జగన్‌కు ప్రతిపక్ష హోదాపై స్పీకర్‌ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు

ప్రతిపక్ష హోదాపై జగన్ చేస్తున్న పోరాటం ఆంధ్ర హైకోర్టుకు చేరింది. ఈ విషయంపై విచారణ చేసిన న్యాయస్థానం అసలు స్పీకర్‌ రిప్రజెంటేషన్ పంపారా అంటూ..

Update: 2024-07-30 07:33 GMT

ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ రేంజ్ పోరాటమే చేస్తున్నారు. ఇప్పటికే తనకు ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ స్పీకర్‌కు లేఖ రాసి తిరస్కరణకు గురైన జగన్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టును కూడా ఆశ్రయించారు. తనకు ప్రతిపక్ష హోదా కల్పించేలా అసెంబ్లీ స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. జగన్ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్తానం ఈరోజు విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా జగన్ తరపు న్యాయవాది తమ వాదనలు వినిపించారు. అసెంబ్లీలో విపక్ష పార్టీకి ఉన్నది ఓకే ఒక్క పార్టీ అని, అప్పుడు ఆ పార్టీనే ప్రతిపక్షంగా గుర్తించాలని, ఆ పార్టీ అధినేతకు ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని జగన్ తరపు న్యాయవాది వివరించారు.

విచారణలో భాగంగా.. ప్రతిపక్ష నేతగా గుర్తించాలని శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రడికి వైఎస్ జగన్.. రిప్రజెంటేషన్ ఇచ్చారా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. కాగా జూన్ 24న జగన్ తన రిప్రజెంటేషన్‌ను స్పీకర్‌కు అందించినట్లు జగన్ తరపు న్యాయవాది వినిపించారు. వారి వాదనలు విన్న అనంతరం దీనిపై తమ సమాధానం చెప్పాలని, కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కోరుతూ అసెంబ్లీ సెక్రటరీ, స్పీకర్ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలుకు మూడు వారాల గడువు ఇస్తున్నట్లు కూడా న్యాయస్థానం వెల్లడించింది. అనంతరం ఈ పిటిషన్ విచారణను వాడువారాలకు వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది.

అయితే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి కేవలం 11 స్థానాలే వచ్చాన్న కారణం చూపుతూ ప్రతిపక్ష హోదా కల్పించడం లేదని, జగన్‌ను ప్రతిపక్ష నేతగా గుర్తించడం లేదని, ఈ విషయంపై ప్రశ్నిస్తే స్పీకర్ సమాధానం చెప్పకుండా విషయాన్ని సాగదీస్తున్నారని జగన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

స్పీకర్‌కు లేఖలో జగన్ ఏం రాశారు

‘‘అసెంబ్లీ సీట్లలో 10శాతం సీట్లు రానందున వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసనభాపక్షానికి ప్రధాన ప్రతిపక్ష హోదా రాదనే చర్చ జరుగుతోంది. భారత రాజ్యంగా ప్రకారం ఆర్టికల్‌–208 కింద ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ నోటిఫై చేసిన సభా ప్రవర్తనా నియమావళిలో పలానా సీట్లు వస్తేనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలనే విషయాన్ని ఎక్కడా చెప్పలేదన్న విషయాన్ని మీ ముందుకు తెస్తున్నాను.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎక్కడా ఈ నిబంధన పాటించలేదనే అంశాన్ని గుర్తుచేస్తున్నాను. 1984లో లోక్‌ సభలో 543 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 30 ఎంపీ సీట్లను గెలుచుకుంది. సభలో 10శాతం సీట్లు లేకపోయినప్పటికీ అప్పుడు టీడీపీకి చెందిన పర్వతనేని ఉపేంద్రను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు. 1994 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లకు గాను కాంగ్రెస్‌ 26 సీట్లు మాత్రమే సాధించింది. 10 శాతం సీట్లు కాంగ్రెస్‌కు లేకపోయినప్పటికీ పి జనార్ధన్‌ రెడ్డిని ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు. 2015లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను బీజేపీ కేవలం 3సీట్లు సాధించినప్పటికీ ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఈ అంశాలన్నీ కూడా కేవలం ప్రజా ప్రయోజనాల రీత్యా మీ దృష్టికి తీసుకు వస్తున్నాను. ప్రజల తరఫున అసెంబ్లీలో గొంతు విప్పడానికి తగిన సమయం లభించాలనే ఉద్దేశంతో ఈ లేఖ మీకు రాస్తున్నాను.

అయితే ఇలాంటి పరిస్థితికి ఆస్కారం లేకుండా ఇప్పటికే అధికార కూటమి శతృత్వాన్ని ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో నేను సభలో మాట్లాడాలనుకుంటే అది భారీ మెజార్టీ సాధించిన అధికార కూటమి దయమీద, నన్ను చచ్చేవరకూ కొట్టాలన్న స్పీకర్‌ గారి విచక్షణ మీదే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం సభలో ఉన్న పార్టీల సంఖ్యా బలాలనుదృష్టిలో ఉంచుకుని ఈలేఖను పరిశీలించాలి’’ అని ఏపీ అసెంబ్లీ స్పీకర్‌కు రాసిన లేఖలో వైఎస్ జగన్ పేర్కొన్నారు.

Tags:    

Similar News