చరిత్రలో మొదటిసారి
ప్రతిపక్షం లేకుండా కేవలం అధికార పక్షమే కూర్చుని అసెంబ్లీలో చర్చించి 21 బిల్లులు ఆమోదించింది. ఈ బిల్లులపై చర్చలు జరిగాయి. అయితే చర్చంతా ఏకపక్షంగానే సాగింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులపై చర్చకంటే గత ప్రభుత్వం వైఫల్యాలపైనే చర్చ సాగింది. ప్రతి విషయంలోనూ అవినీతి అంశమే ప్రస్తావనకు వచ్చింది. అమరావతిని ధ్వంసం చేశారని, విశాఖ రుషికొండపై విలాస వంతమైన భవనాలు నిర్మించారని, విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాలు కూడా భ్రష్టుపట్టాయని సభలో సభ్యులు ప్రస్తావించారు. విజన్ 2047పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఒక్క విజన్ కూడా సక్సెస్ కాలేదు.
పెట్టుబడి దారులకు భారీ రాయితీలు..
ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు పెట్టుబడులు పెట్టేందుకు వచ్చినా వారికి అమరావతిలో ఆఫీసులు కట్టుకునేందుకు స్థలాలు ఇవ్వడంతో పాటు రాయితీలు కూడా ఇస్తామని సభా ముఖంగా ప్రకటించారు. ఒక వైపు సభ జరుగుతుండగానే పలు ఒప్పందాలపై ఎంవోయూలు కూడా జరిగాయి. విశాఖ, అమరావతి వంటి పట్టణాల్లో ఎక్కువ పెట్టబడులు వస్తున్నాయని ప్రభుత్వం ప్రకటించింది.
పార్టీ ఆఫీసు నుంచి వైఎస్సార్‌సీపీ గళం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి ఒకటికి రెండు సార్లు అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి ప్రసంగాలను తూర్పారబడుతూ మీడియా సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్వహించి సుదీర్గంగా వివరణలు ఇవ్వడంతో పాటు ప్రశ్నల వర్షం కురిపించారు. తమకు మాట్లాడేందుకు మైకు కూడా ఇవ్వరని, అందుకే తాము అవమానాలు భరించే కంటే సమావేశాలు బహిష్కరించటమే మంచిదని భావించినట్లు వైఎస్సార్‌సీపీ చెప్పుకుంది.
సభలో అధికార పక్ష సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రులు సరైన సమాధానాలు ఇవ్వలేదు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తున్నారా? లేదా? అని మండలిలో సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి బాల వీరాంజనేయ స్వామి సమాధానం ఇస్తూ లేని వ్యవస్థను కొనసాగించడం ఏమిటని చెప్పడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనియాంశంగా మారింది. కొన్ని అంశాలను ముఖ్యమంత్రి ప్రస్తావించలేదు. వివాదాస్పద అంశాల గురించి సీఎం ఎక్కడా ఏ విధమైన వ్యాఖ్యలు చేయలేదు. సోషల్ మీడియాలో దారుణమైన పోస్టులు పెడుతున్నారని, వారి భరతం పట్టాల్సిందేనని సీఎం చెప్పారు. పీడీ యాక్ట్ కూడా వారిపై ప్రయోగిస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు. ఇక మైన్స్, విద్యుత్, మద్యం వంటి అంశాలపై మాట్లాడినంత సేపు పర నింద తప్ప ప్రస్తుత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది స్పష్టం చేయలేదు. విద్యుత్‌పై అదానీ విషయం సభలో చర్చకు వచ్చినప్పుడు అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదిక మావద్దకు వచ్చింది. దానిపై స్టడీ చేయాల్సి ఉందని సీఎం తప్పుకున్నారు. అదానీ విషయంలో పెద్దగా చర్చను ముందుకు తీసుకుపోలేదు. గత ప్రభుత్వం చేసిన ప్రతి ఒప్పందంలోనూ దారుణాలు జరిగాయన్న సీఎం, అదానీ విషయంలో దూకుడుగా వ్యవహరించలేదు. విజన్ 2027తో శాసన సభ సమావేశాలు ముగిసాయి.
ప్రతిపక్షం అవమానాలు భరిస్తే తప్పేంటి?
ప్రతిపక్ష పార్టీ అవమానాలు భరించేందుకు సిద్ధంగా లేదంటూ శాసన సభ సమావేశాలు బహిష్కరించడం క్షమించరాని నేరంగానే రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కెవివి ప్రసాద్ ఈ విషయంపై మాట్లాడుతూ శాసన సభ ఉన్నది ప్రజలు సమస్యలు చర్చించి సరైన పరిష్కార మార్గాలు చూపించడానికి, చట్టాలు చేసేందుకు ప్రవేశపెట్టే బిల్లుల్లో మంచీ చెడులు ప్రతిపక్షం ఉంటేనే బయటకు వస్తాయి. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోకపోవడం ప్రతిపక్షం తప్పుగానే బావించాల్సి ఉంటుందన్నారు. ప్రతిపక్ష హోదా ఇచ్చినా, ఇవ్వకపోయినా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ మాత్రమే ప్రతిపక్షమని అన్నారు.