వచ్చే జన్మలో గిరిజన గూడెంలో పుట్టాలనుకున్న చంద్రబాబుకు లేఖ
మామ ఎన్టీఆర్ ని గుర్తు చేసిన మాజీ ఐఎఎస్ అధికారి ఇఎఎస్ శర్మ;
సుమారు వారం రోజుల క్రితం, విశాఖ ఆదివాసీ ప్రాంతాల్లో పర్యటించిన సమయంలో, మీరు, ‘వచ్చే జన్మలో మళ్ళీ జన్మిస్తే, ఆదివాసీ ప్రాంతాల్లోనే జనుమించాలని ఉంది,’ అని అన్నారు . చాలా సంతోషం. అటువంటి ఉద్దేశం రావడం మంచి సంకేతంగా భావిస్తాను.
ఆదివాసీల సమస్యల మీద అవగాహన రావాలంటే, వారి జీవితాలలో భాగస్వాములై, వారికి సహాయం అందించడం అవసరం.
ఒక విషయం మీకు గుర్తు చేస్తున్నాను. మీరు అధికారంలో ఉన్న సమయంలో, ఆదివాసీ సంక్షేమం దృష్ట్యా చేయవలసిన చర్యలు చాలా ఉన్నాయి. ఆ విషయంలో, గతంలో, మీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, తీసుకోవాల్సిన నిర్ణయాల మీద, నేను విపులంగా మీకు 13-6-2024 న లేఖ రాయడం జరిగింది. ఈ రోజు వరకు, మీ ప్రభుత్వం అటువంటి నిర్ణయాలు తీసుకోక పోవడం బాధాకరంగా ఉంది.
ఎనిమిది దశాబ్దాల క్రితం, సుప్రసిద్ధ విదేశీ మానవ శాస్త్రవేత్త, హేమన్డార్ఫ్ (Christopher von Fürer-Haimendorf ), ఆయన భార్య, ఆదిలాబాద్ లో, మార్లవాయి అనే మారుమూల గ్రామంలో, అక్కడ గోండ్ ఆదివాసీలతో నివసించి, వారి సమస్యలను కూలంకషంగా అధ్యయనం చేసి, ఆ విషయాలను అప్పటి హైదరాబాద్ పాలకుల దృష్టికి తీసుకువచ్చిన విషయం, మీకు తెలుసు అని అనుకుంటున్నాను.
నాలుగు దశాబ్దాల కింద, అప్పటి ముఖ్యమంత్రి, N T రామారావు గారు, హేమన్డార్ఫ్ గారిని సంప్రదించి, వారి సలహాలు ఆధారంగా, ఆదివాసీ విధానంలో సంస్కరణలు ప్రవేశపెట్టిన సమయంలో, నేను రాష్ట్ర ప్రభుత్వ గిరిజన సంక్షేమ విభాగం కార్యదర్శిగా పని చేయడం జరిగింది. ఆ సంస్కరణల్లో భాగంగా, అప్పటి ప్రభుత్వం, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉపాధ్యాయుల నియామకంలో, ఆదివాసీలకు, (GOMs No. 275 dated 5-11-1986 ద్వారా) ప్రత్యేకంగా 100% రిజర్వేషన్ కలిగించింది. అదేకాకుండా, కొన్నిగిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ (GCC) వంటి ఇతర విభాగాల్లో కూడా, పోస్టుల నియామకం విషయంలో, అప్పటి ప్రభుత్వం ప్రత్యేకంగా రిజర్వేషనులు కలిగించింది.
తర్వాత, అదే GOMs 275 ఆధారంగా, ఉపాధ్యాయుల నియామకం విషయంలో, 10-1-2000 న, కొన్ని కోర్టు తీర్పులను దృష్టిలో పెట్టుకుని, GOMs No. 3 రూపంలో, అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆ GOMs 3 ను, సుప్రీమ్ కోర్టువారు 2020 ఏప్రిల్ 22న కొట్టివేశారు.
ఆదివాసీలకు, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో, ఉద్యోగావకాశాలు కలిగించడం కోసమే కాకుండా, వారి సంస్కృతిని, స్వాభిమానాన్ని పరిరక్షించడం కోసం, రాష్ట్ర ప్రభుత్వం, రాజ్యాంగం 5వ షెడ్యూల్ క్రింద, 5వ క్లాజ్ ప్రకారం ఒక ప్రత్యేకమైన చట్టాన్ని ప్రవేశపెట్టడం, అదే కాకుండా, Indra Sawhney, 1992 Supp (3) SCC 217 కేసులో, ఇతర కేసుల్లో, గతంలో సుప్రీంకోర్టు వారు, రిజర్వేషన్లు ఏ పరిస్థితులలోను, 50% కు మించి ఉండకూడదు అన్న ఆదేశాలను కూడా, రాజ్యాంగం 16(4) ఆర్టికల్ క్రింద ప్రశ్నించాల్సిన అవసరం ఉంది.
ఆ విషయంలో, టీడీపీ తన ఎన్నికల మానిఫెస్టోలో, తగిన చర్యలు తీసుకుంటామని, ఎన్నికల ముందు హామీ, ఇవ్వడం, అదే హామీని తప్పకుండా నెరవేర్చుకుంటామని, మీరు మళ్ళీ 2015 మే 12న ప్రకటన చేయడం, మీకు గుర్తు చేస్తున్నాను. ఆ హామీ అమలులో, ఆలస్యం చేయడం కారణంగా, ప్రతిరోజు ఆదివాసీలకు నష్టం కలిగే అవకాశం ఉంది. ఇప్పటికైనా, మీ ప్రభుత్వం ఆ చట్టాన్ని, అందులో భాగంగా రిజర్వేషన్లు 50% కు మించి ఉండకూడదన్న ఆదేశాలకు వ్యతిరేకంగా చట్టంలో ప్రత్యేకమైన సెక్షన్లను చేర్చడం కూడా అవసరం. ఆ ప్రత్యేకమైన చట్టం, ఒక్క ఉపాధ్యాయుల పోస్టులకే కాకుండా, ఇతర పోస్టులకు కూడా వర్తించాలి. ఆ విషయంలో ప్రభుత్వ ఎంత త్వరగా చట్టాన్ని ప్రవేశపెడితే, ఆదివాసీలకు అంత మంచి కలుగగలదు.
ఆ విషయంలోనే కాకుండా, మీ ప్రభుత్వం ఆదివాసీల హక్కుల అమలు చేయడం విషయంలో, వారి సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలు ఇంకా ఎన్నో వున్నాయి. మీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో, అటువంటి చర్యలు ఆలస్యం చేయకుండా తీసుకోవడం అవసరం.
ఆ విషయాలను క్రింద సూచిస్తున్నాను.
- పీసా, అటవీ హక్కుల చట్టాల అమలు- ఆదివాసీ గ్రామ సభల హక్కులను పునరుద్ధరించడం:
రాష్ట్రంలో షెడ్యూల్డ్ ప్రాంతాల్లో, గనుల తవ్వకాలు, ఇతర ప్రాజెక్టులు చేపట్టినప్పుడు, పీసా చట్టం క్రింద, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అక్కడి ఆదివాసీ గ్రామ సభల నుంచి, ముందస్తు ఆమోదం తీసుకోవాలి, కాని, ప్రస్తుతం ఆ విధంగా అనుమతులు తీసుకోవడం లేదు. మీ ప్రభుత్వం పీసా చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని నా విజ్ఞప్తి.
షెడ్యూల్డ్ ప్రాంతాలలో, ఇతర ప్రాంతాలలో, అడవులు ఉన్న ప్రదేశాలలో, అటవీ హక్కుల చట్టం క్రింద గ్రామ సభల తీర్మానాలకు అనుగుణంగా వ్యక్తిగత పట్టాలు, ఆదివాసీలు తరతరాలుగా అనుభవిస్తున్న ప్రకృతి వనరుల విషయంలో గ్రామ ఉమ్మడి పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఇంతవరకు సరిగ్గా అమలు కాలేదు. మీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని కూడా చిత్తశుద్ధితో, అమలు చేయాలి.
ఆ విషయంలో, కొన్ని రోజుల క్రింద, సుప్రీం కోర్టు వారు కూడా, అటవీ హక్కుల చట్టాన్ని సరిగ్గా అమలు చేయాలని, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వడాన్ని, మీ దృష్టికి తీసుకు వస్తున్నాను.
- షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజనేతరులు భూములను కొనడం మీద నిషేధం విధించే చట్టం అమలు చేయడం:
షెడ్యూల్డ్ ప్రాంతాల్లో, గిరిజనేతరులు, భూములను కొనడం మీద నిషేధం విధించే LTR చట్టం అమలు కావడం లేదు. ప్రతి జిల్లాలో, తహసిల్ లో, గ్రామ వారీగా గిరిజన భూములను, ప్రభుత్వ భూములను, చట్టవిరుద్దం గా కబ్జా చేసిన గిరిజనేతరులను గుర్తించి చర్యలు తీసుకోవడం అవసరం.
- షెడ్యూల్డ్ ప్రాంతాల బయట ఉన్న ఆదివాసీ గ్రామాలను షెడ్యూల్డ్ ప్రాంతంలో కలిపే నోటిఫికేషను కేంద్ర ప్రభుత్వం ఇవ్వవలసి ఉంది:
1986 లో, శ్రీ N T రామారావు గారి ప్రభుత్వం, షెడ్యూల్డ్ ప్రాంతాల బయట ఉన్న కొన్ని వందల ఆదివాసీ గ్రామాలను గుర్తించి, షెడ్యూల్డ్ గ్రామాలుగా నోటిఫై చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. మూడు దశాబ్దాలకు పైగా ఆ ప్రతిపాదన మీద కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ఆ కారణంగా, ఆ గ్రామాల ప్రజలకు, పీసా క్రింద కలిగే పరిరక్షణ లభించడంలేదు. మీ ప్రభుత్వం ఆ విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవలసిన అవసరం ఉంది.
- ట్రైబల్ సబ్ ప్లాన్ చట్టం అమలు ఆదివాసీల పర్యవేక్షనక్రింద జరగాలి:
Scheduled Castes Sub Plan and Tribal Sub Plan Act, 2013 క్రింద ఆదివాసీ ప్రాంతాల్లో, ట్రైబల్ సబ్ ప్లాన్ సరిగ్గా అమలు జరగాలి. ఆ విషయంలో స్థానిక ఆదివాసీ గ్రామ సభలకు ప్రాముఖ్యత ఇవ్వడమే కాకుండా, ట్రైబల్ సబ్ ప్లాన్ అమలు, గ్రామసభల పర్యవేక్షణలో జరగాలి. అమలు విషయంలో ప్రతి సంవత్సరం, రాష్ట్ర గవర్నర్ గారికి రాష్ట్రపతి గారికి విపులమైన రిపోర్టులు పంపించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కాని అమలుకావడం లేదు. మీ ప్రభుత్వం ఆ విషయంలో కూడా ప్రభుత్వం శ్రద్ధ చూపించాలని నా విజ్ఞప్తి.
- ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిన గుత్తి కోయల సంక్షేమ పథకాలు చేపట్టాలి:
గతంలో, కొంతమంది గుత్తికోయలు, ఛత్తీస్గఢ్ నుంచి AP సరిహద్దు జిల్లాలకు వలస వచ్చారు. ఛత్తీస్గఢ్ లో
గుత్తికోయలు మరియా గోండ్ ST తెగకు చెందినవారు. ఆ రాష్ట్రంలో వారికి రాజ్యాంగపరమైన హక్కులు ఉన్నాయి. కాని AP లో వారికి అటువంటి గుర్తింపు లేకపోవడం వలన, వారిని అధికారులు, ST గా గుర్తించకుండా, కేవలం ఆక్రమణదారులు గా పరిగణించి, వారిని అక్కడి అటవీ ప్రాంతం నుండి బహిష్కరిస్తున్నారు. వారి పరిస్థితి దైన్యంగా ఉంది. కొంతమంది జిల్లా అధికారులు, వారికి రేషన్, వైద్య సౌకర్యాలను అందించినా, వన సంరక్షణ శాఖ అధికారులు, వారిపై కేసులు పెట్టి అనేక బాధలకు గురి చేస్తున్నారు.
గుత్తికోయల పరిస్థితులు మెరుగు పరచడానికి, కేంద్ర ప్రభుత్వం, AP, తెలంగాణ ప్రభుత్వాలు తీసుకోవలసిన చర్యల గురించి నేను రాష్ట్రపతి గారికి రాసిన లేఖ మీద మీ ప్రభుత్వం, నిపుణుల సలహాతో తగిన చర్యలు తీసుకోవాలని నా విజ్ఞప్తి.
గిరిజన సలహా మండలి
రాజ్యాంగం 5వ షెడ్యూల్ క్రింద, రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో ఆదివాసీ ప్రతినిధుల ప్రాతినిధ్యం తో Tribal Advisory Council (TAC) ని ఏర్పాటు చేయాలి. వారి ని ఆదివాసీ సంక్షేమ కార్యక్రమం అమలులో సంప్రదించవలసిన అవసరం ఉంది.
మీ ప్రభుత్వం అధికారం లోనికి వచ్చిన సంవత్సరం తర్వాత, ఆలస్యంగా, TAC నియామకం జరిగింది. కాని, రాష్ట్ర ప్రభుత్వం, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో, మైనింగ్ అనుమతుల విషయంలో, ఇతర విషయాల్లో, ఆదివాసీ గ్రామసభల ముందస్తు అనుమతులు తీసుకోవడం కాని, TAC ను సంప్రదించడం కాని చేయడం లేదు. LTR చట్టం క్రింద, గిరిజనేతరులు మైనింగ్ చేయడం నిషేధించబడింది. సమత కేసులో, సుప్రీం కోర్టు వారు, ఆ విషయాన్ని ధ్రువ పరిచారు. ఆ నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం, పదేపదే ఉల్లంఘించడం ఆదివాసీల హక్కులను భంగం పరచడం గా పరిగణించాలి.
- షెడ్యూల్డ్ ప్రాంతాల బయట ఉన్న గ్రామాల్లో, ఆదివాసీ సాగు దారులకు జరిగిన అన్యాయం:
గత ప్రభుత్వం చేపట్టిన భూముల సర్వే ముసుగులో, షెడ్యూల్డ్ ప్రాంతాల బయట ఉన్న గ్రామాల్లో, తరతరాలుగా భూములు సాగు చేస్తున్న ఆదివాసీల పేర్లు, గ్రామ రికార్డుల నుంచి తొలగించి, రెవెన్యూ అధికారుల తో కుమ్మక్కు అయ్యి కొంతమంది కబ్జాదారులు ఆదివాసీల ఉపాధులకు నష్టం కలిగిస్తున్నారు. ఆ విషయం మీద, మీ ప్రభుత్వం దర్యాప్తు చేయించడం అవసరం. సీనియర్ రెవెన్యూ అధికారులు, ఆదివాసీల సమక్షంలో అటువంటి దర్యాప్తు చేపట్టి, ఆదివాసీలకు తత్ క్షణం న్యాయం చేయకపోతే, ఆదివాసీలకు అపారమైన నష్టం కలుగుతుంది.
మీద సూచించిన విషయాలమీద మీ ప్రభుత్వం ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ తో, ఆదివాసీ ప్రజా ప్రతినిధులతో త్వరలోనే చర్చించి, తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను.