హైదరాబాద్ లో గుట్టలుగా దొరుకుతున్న ఏపీ లిక్కర్ స్కాం నోట్ల కట్టలు
ఏపీ లిక్కర్ స్కాంను తొవ్వేకొద్ది హైదరాబాద్ లో నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా బయటపడుతున్నాయి.;
By : The Federal
Update: 2025-07-30 04:39 GMT
ఏపీ లిక్కర్ స్కాంను తొవ్వేకొద్ది హైదరాబాద్ లో నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా బయటపడుతున్నాయి. నిందితుల ఇళ్లు, ఫాం హౌస్ లు క్యాష్ బాక్సులతో నిండి ఉన్నట్టు కనిపిస్తోందా అని పోలీసులు విస్తుపోతున్నారు. లిక్కర్ స్కాంలో సంచలన విషయాలు బయటపడ్డాయి. నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టిన సిట్ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు.
లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఐటీ సలహాదారు రాజ్ కెసిరెడ్డి చెప్పిన సమాచారం మేరకు పోలీసులు సుమారు 12 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం నగదును 12 బాక్సుల్లో భద్ర పరిచినట్టు గుర్తించారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన ఫార్మ్ గెస్ట్ హౌస్‌లో నగదు డంప్‌ను గుర్తించారు.
లిక్కర్‌స్కామ్‌లో 40వ నిందితునిగా ఉన్న వరుణ్ పురుషోత్తం ఇచ్చిన సమాచారం మేరకు రాజ్ కసిరెడ్డిని ప్రశ్నించిన అనంతరం సిట్ అధికారులు ఈ ఫాం హౌస్ లో తనిఖీలు చేశారు. అప్పుడు ఈ డంప్ బయటపడింది. భారీగా నగదు పట్టుబడింది. నగదు సీజ్ ఘటనలో చాణక్య, వినయ్ పాత్రపైనా సిట్ బృందం విచారణ చేపట్టింది.
రాజ్ కెసిరెడ్డి, చాణక్య ఆదేశాల మేరకు జూన్ 2024లో వినయ్ సాయంతో వరుణ్ రూ.12 కోట్ల నగదు ఉన్న 12 అట్ట పెట్టెలను ఆఫీస్ ఫైళ్ల పేరుతో దాచినట్టు సిట్ అధికారులు గర్తించారు. వరుణ్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించి నిజాలు బయటపెట్టడంతో లిక్కర్ స్కామ్‌కి చెందిన భారీ నగదు నిల్వల విషయం వెలుగులోకి వచ్చింది. ఏపీ మద్యం స్కామ్‌లో దాదాపు రూ.3500 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్టు సిట్ ప్రాథమికంగా గుర్తించింది.
సిట్ అధికారులు ఇప్పటి వరకు ఈ కేసులో 12 మందిని అరెస్ట్ చేశారు. ఇటీవలే ఏసీబీ కోర్టులో చార్జిషీట్ కూడా దాఖలు చేశారు. ఓ ఎంపీ, మరో ఐఎఎస్ అధికారి కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే 32 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నారు.