ఆంధ్రాలో తొలి మంత్రి బర్తరఫ్, గొడవెంటి?
రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ లో బర్తరఫ్ అయిన తొలి మంత్రిగా ఆయన చరిత్రకెక్కారు. ఆయనే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం.;
(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్, తిరుపతి)
ఆయనటు సైకిల్ ఎక్కాడు.. ఇటు వేటు పడింది. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ లో బర్తరఫ్ అయిన తొలి మంత్రిగా ఆయన చరిత్రకెక్కారు. ఆయనే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. కొంతకాలంగా అసమ్మతితో రగిలిపోతున్న గుమ్మనూరి జయరాం మంగళగిరి సమీపంలో టీడీపీ ఏర్పాటు చేసిన జయహో బీసీ సభలో మాట్లాడుతూ పదేళ్లకిందట తప్పిపోయిన ఓ స్కూలు పిల్లాడి తిరిగి స్వగ్రామానికి చేరినట్టుగా ఉందంటూ.. తన టీడీపీలో పునఃప్రవేశాన్ని సంబరపడిన మరుక్షణమే రాజ్ భవన్ నుంచి బర్తరఫ్ చేస్తూ అధికారిక ప్రకటన వెలువడింది.
సీఏం విధానాలతో విసుగు..
"వైయస్సార్ సిపికి, మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా" అని విజయవాడ బయలుదేరడానికి ముందు గుమ్మనూరు జయరాం చెప్పారు. సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి విధానాలతో విసుగుచెంది రాజీనామా చేస్తున్నా అంటూ తన మాజీ బాస్ పై విరుచుకుపడ్డారు. రానున్న ఎన్నికల్లో గుంతకల్లు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానంటున్నారు జయరాం.
సీఎం వైఎస్ జగన్ గుడిలో శిల్పం..
"సీఎం వైఎస్ జగన్ గుడిలో శిల్పం మాదిరిగా తయారయ్యారు. తాడేపల్లి అనేది ఓ గుడి అయితే అందులో ఇద్దరు పూజారులు ఉంటారు. ఒకరు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడైన సజ్జల రామకృష్ణారెడ్డి, మరొకరు ఐఎఎస్ అధికారి ధనుంజయరెడ్డి. వాళ్లిద్దరు చెప్పిందే చేస్తాడు జగన్" అన్నారు గుమ్మనూరు జయరాం. "కర్నూలు ఎంపీగా వెళ్లాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నన్ను అడిగారు. కర్నూలు ఎంపీగా వెళ్లడం ఇష్టం లేదు" అన్నారు.
తెర వెనుక ఏం జరిగిందంటే..?
సర్వేలో పనితీరు బాగా లేదని చెప్పడంతో పాటు, కర్నూలు నుంచి పోటీ చేయాలని ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ కు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచన చేశారు. అదే సమయంలో.. చిప్పగిరి జెడ్పిటిసి సభ్యుడు విరుపాక్షిని ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడం పై ఆలూరు జయరాం గరంగరం అయ్యారు. బీసీ బోయ సామాజిక వర్గానికి చెందిన జయరాం.. ఏకంగా జిల్లా దాటి సమీపంలోనే ఉన్న గుంతకల్లు నియోజకవర్గం (అనంతపురం జిల్లా) నుంచి పోటీ చేయడానికి వీలుగా సన్నాహాలు చేసుకున్నారు.
ఆ ముగ్గురితోనే ఇబ్బంది...
ఆలూరు నుంచి తనకు టికెట్ దక్కకపోవడానికి సోదరులైన ముగ్గురు అధికార పార్టీ ఎమ్మెల్యేలే కారణమని మంత్రి గుమ్మనూరు జయరాం అభిప్రాయపడుతున్నారు. మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి, ఆదోని ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి, అనంతపురం జిల్లా గుంతకల్ ఎమ్మెల్యే వై. వెంకటరామిరెడ్డి ప్రధాన కారకులని జయరాం సన్నిహితులు వద్ద ఆరోపించడంతో పాటు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వద్ద కూడా ప్రస్తావించారని తెలిసింది.
టిడిపిలోనే రాజకీయ అరంగేట్రం..
వాస్తవానికి గుమ్మనూరు జయరాం తెలుగుదేశం పార్టీ నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2001లో ఆయన ఏలూరు గ్రామ టిడిపి ఎంపీటీసీగా పోటీ చేసి ఓటమి చెందారు. 2005లో టిడిపి నుంచి పోటీ చేసి చిప్పగిరి మండల జడ్పిటిసిగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉత్సాహం నేపథ్యంలో ఆయన 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో ఆయన 2011లో వైఎస్సార్ సీపీలో చేరి, 2014లో జరిగిన ఎన్నికల్లో ఆలూరు నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మళ్లీ 2014లో అదే స్థానం నుంచి ఎన్నికై, మంత్రిగా అయ్యారు.
కర్ణాటక మంత్రులే కీలకం?
జయరాం తెలుగుదేశం పార్టీలో చేరేందుకు కర్ణాటకకు చెందిన ఇద్దరు మంత్రులు కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. అందులో కర్ణాటక మంత్రి నాగేంద్ర సోదరుడు కావడం గమనార్హం. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గానికి పొరుగునే అనంతపురం జిల్లా గుంతకల్లు ఉంటుంది. ఇక్కడ కూడా బోయ (వాల్మీకి) సామాజిక వర్గానికి చెందిన ఓటర్లే కీలకం. ఆలూరు-గుంతకల్లు ప్రాంతాల్లో ఉండే వాల్మీకి సామాజిక వర్గం మధ్య బంధుత్వం ఎక్కువగా ఉంది. లావాదేవీలు సాగుతుంటాయి. రెండు లక్షల 38వేల పైచిలుకు ఓట్లు ఉన్న గుంతకల్లు నియోజకవర్గం లో వాల్మీకులు ముస్లిం, ఇతర బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు. కొన్ని రోజులుగా గుంతకల్లు నియోజకవర్గం లో పరిస్థితి చెక్క దించడానికి గుమ్మనూరు జయరాం సోదరులు విస్తృతంగా పర్యటించారు.