వరల్డ్ రికార్డ్ సృష్టించిన పవన్ కల్యాణ్.. ఎలాగో తెలుసా..
ఒకే రోజు 13,326 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించిన ప్రపంచ రికార్డు సృష్టించింది ఆంధ్రప్రదేశ్ పంచాతీరాజ్ శాఖ.
ఒకే రోజు 13,326 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించిన ప్రపంచ రికార్డు సృష్టించింది ఆంధ్రప్రదేశ్ పంచాతీరాజ్ శాఖ. ఈ గ్రామ సభలను ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. సీఎం చంద్రబాబు సహా డిప్యూటీ సీఎం కూడా పలు గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభల్లో నిర్వహించారు. గ్రామాల అభివృద్ధికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఇప్పటికే నిధులు కూడా మంజూరు చేసిందని వారు పేర్కొన్నారు. కాగా ఒకే రోజు ఇంత భారీ సంఖ్యలో గ్రామ సభలు నిర్వహించడమే ఏపీ పంచాయతీరాజ్ శాఖకు అరుదైన ఘనతను తెచ్చిపెట్టింది. ప్రపంచంలో ఎక్కడా కూడా ఇప్పటి వరకు ఒకే రోజు ఏకకాలంలో ఇంతటి స్థాయిలో గ్రామ సభలు నిర్వహించింది లేదని వరల్డ్ రికార్డ్ అధికారి తెలిపారు. అంతేకాకుండా పంచాయతీరాజ్‌కు వారు సాధించిన వరల్డ్ రికార్డ్‌కు సంబంధించిన సర్టిఫికెట్‌ను అందించారు. ఈ సర్టిఫికెట్‌ను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా పలువురు అధికారులు అందుకున్నారు. ఈ సందర్భంగానే ఆంధ్రప్రదేశ్ గ్రామ స్వరాజ్యం దిశగా దూసుకెళ్తోందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం చేపట్టిన గ్రామ సభలు తొలి అడుగే ప్రపంచ రికార్డుతో పడిందని, ఈ ఉత్సాహాన్ని ఇదే విధంగా కొనసాగిద్దామని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
సభలతోనే ప్రపంచ రికార్డు: పవన్
గ్రామాలను అభివృద్ధి దిశగా నడిపించాలన్న ఉద్దేశంలో చేపట్టిన గ్రామసభ కార్యక్రమానికి ప్రపంచ గుర్తింపు లభించడం చాలా సంతోషంగా ఉందని పవన్ తెలిపారు. ‘‘అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే కూటమి ప్రభుత్వం, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్వ్యంలో చేపట్టిన కార్యక్రమాలకు ప్రపంచ రికార్డు సాధించాం. ఇదే విధంగా పనిచేస్తే మరెన్నో ఘనతలు మన సొంతమవుతాయి. వాటిలో ప్రజల చేత శభాష్ అనిపించుకోవడం కూడా ఒకటిగా ఉంటుంది. ఆగస్టు 23న రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభలను గుర్తించి వరల్డ్ రికార్డ్స్ యూనియన్ సంస్థ ప్రతినిధి.. రికార్డ్ పత్రాన్ని, మెడల్‌ను అందించారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఈ గ్రామసభల నిర్వహణ సాధ్యమైంది. దీనిని అతిపెద్ద పాలనగా గుర్తించినట్లు వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి తెలిపారు’’ అని పవన్ కల్యాణ్ వివరించారు.
గ్రామ సభల లక్ష్యం ఇదే: పవన్
ఇదిలా ఉంటే ఆగస్టు నెలలో గ్రామ సభలను పునరుద్దరించడానికి గల కారణాలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వివరించారు. గత ప్రభుత్వం పంచాతీరాజ్ శాఖను నిర్వీర్యం చేసిందని, కానీ ఈ శాఖ ద్వారా గ్రామ స్థాయిలో అభివృద్ధి సాధ్యమని చెప్పారు. ఆగస్టు 23న నిర్వహించిన స్వర్ణ గ్రామ సభలో పాల్గొన్న సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ‘‘గ్రామాభివృద్ధి చేయాలంటే అందులో గ్రామ సభలు నిర్వహించడం అత్యంత ప్రముఖమైన అంశం. ఉన్న నిధులతో పాటు వచ్చిన నిధులను కూడా దారి మళ్లించి జేబులు నింపుకున్న దుస్థితి గ్రామాలు గత ఐదేళ్లలు చూశాయి. గత ప్రభుత్వం పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం పంచాయతీరాజ్‌ను మళ్ళీ గాడిలో పెట్టాలని, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడపాలని యోచిస్తోంది. అందుకు కావాల్సిన ప్రణాళికలనూ సిద్ధం చేస్తోంది. మొత్తం 13,326 పంచాయతీలు బలపడితే రాష్ట్రానికి ఉన్న అప్పులను తీర్చేయొచ్చు’’ అని వివరించారు.