విజయవాడలో ఏపీ పోలీస్‌ అకాడమి

విభజన అనంతరం ఏపీకి ప్రత్యేకంగా పోలీసు అకాడమీ లేకుండా పోయింది. గత పదేళ్ళల్లో ప్రభుత్వాలు దీనిపై దృష్టి పెట్ట లేదు. అప్పా ఆస్తుల పంపకాలు ఇంత వరకు తేల లేదు.

Update: 2024-08-28 08:44 GMT

ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ అకాడమీ అంశం మరో సారి తెరపైకి వచ్చింది. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లైనా ఇంత వరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా పోలీసు అకాడమినీ ఏర్పాటు చేయడంలో తొలుత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం, తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం నిర్లక్ష్యంగానే వ్యవహరించాయి. రెండు ప్రభుత్వాల ఉదాసీనత వల్ల ఇంత వరకు ఆంధ్రప్రదేశ్‌లో సపరేట్‌ పోలీసు అకాడమీ లేకుండా పోయిందనే చర్చ పోలీసు వర్గాల్లో నడుస్తోంది.

అయితే రెండో సారి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఈ అంశపై దృష్టి సారించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఏపీలో పోలీసు అకాడమీని అందుబాటులోకి తీసుకొని రావాలని భావిస్తోంది. ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై కసరత్తు చేసిన తర్వాత రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సెంటర్‌ పాయింట్, రాజధాని అమరావతికి సమీపంలో ఏర్పాటు చేస్తే సముచితంగా ఉంటుందనే నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో విజయవాడలో ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది.
విజయవాడలో ఏపీ పోలీసు అకాడమి ఏర్పాటుకు అసరమైన స్థలాన్ని సేకరించే బాధ్యతను ఎన్టీఆర్‌ జిల్లా యంత్రాంగానికి సీఎం చంద్రబాబు అప్పగించారు. ఆ మేరకు సీఎం నుంచి ఆదేశాలు కూడా ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌కు అందాయి. ఇది ఎన్టీఆర్‌ జిల్లా అధికారులకు పెద్ద చాలెంజ్‌గా మారింది. ఆ స్థలాన్ని సేకరించే పనిలో జిల్లా అధికారులు నిమగ్నమయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో 175 ఎకరాల్లో పోలీసు అకాడమీని ఏర్పాటు చేశారు. ఏపీలో మోడర్స్‌గా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు కాబట్టి అంత కంటే ఎక్కువ స్థలం అవసరం అవుతుంది. విజయవాడ నగరంలో పోలీసు అకాడమీని ఏర్పాటు చేసేందుకు అసరమైన స్థలం ఎక్కడుందనే టాక్‌ అధికార వర్గాల్లో నడుస్తోంది. దీంతో విజయవాడ నగరానికి సమీపంలో ఉన్న మైలవరం నియోజక వర్గం పరిధిలోని గొల్లపూడి, ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో అవసరమైన స్థలాన్ని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ప్రభుత్వ స్థలాలు కూడా పెద్దగా లేవు. అటవీ భూములు ఉన్నాయి. ప్రైవేటు భూములు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు ల్యాండ్‌ను తీసుకుంటారా, అటవీ భూములను తీసుకుంటారా అనేది అంశంపై స్పష్టత రావలసి ఉంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాజధాని హైదరాబాద్‌ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ పోలీసు అకాడమీ(అప్పా)ని ఏర్పాటు చేశారు. 1986లో దాదాపు 175 ఎకరాలలో అప్పాను ఏర్పాటు చేశారు. తెలంగాణ భూ భాగంలో ఉండటం వల్ల రాష్ట్ర విభజన అనంతరం దీనిని తెలంగాణకు కేటాయించారు. పోలీసు ఆఫీసర్లకే కాకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు, ఫోరెన్సిక్‌ ఎక్స్‌పర్ట్స్, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు వంటి వివిధ రకాల విభాగా అధికారులు, సిబ్బందికి ఇక్కడ శిక్షణ ఇస్తారు. విభజన సమయంలో తెలంగాణకు కేటాయించడంతో ఏపీకంటూ పోలీసు అకాడమీ లేకుండా పోయింది. దీంతో అనంతపురం, శ్రీకాకుళం వంటి ప్రాంతాల్లో ఉన్న పోలీస్‌ ట్రైనింగ్‌ కేంద్రాల నుంచే శిక్షణలకు చేపడుతూ వస్తున్నారే కానీ పోలీసు అకాడమీ నిర్మాణం దిశగా అడుగులు వేయడంలో వైఫల్యం చెందారు.
అప్పా ఉమ్మడి ఆస్తి కాబట్టి దీనిని విభజన చట్టంలోని పదో షెడ్యూల్‌లో చర్చారు. విజన జరిగి పదేళ్లు అయినా అప్పాకు సంబంధించిన ఆస్తుల పంపకాలు ఇంత వరకు చేపట్ట లేదు. దీంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. పోలీసు అకాడమీనే లేక పోవడంతో అందులో పోస్టుల భర్తీని కూడా ప్రభుత్వాలు మరిచి పోయాయి. అయితే గత ఏడాది ఫిబ్రవరిలో 185 పోలీసు అకాడమీ పోస్టులను భర్తీ చేయాలని భావించింది. అందుకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా కేంద్రానికి పంపింది. ఇదిలా ఉంటే విభజన చట్టం ప్రకారం పోలీసు అకాడమీని ఏర్పాటు చేసేందుకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని 2020 డిసెంబర్‌లో నాటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. అకాడమీకి అవసరమైన భవన నిర్మాణాల కోసం రూ. 500 కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరింది. అయితే కేంద్రం నుంచి స్పందన రాక పోవడంతో అకాడమీ ప్రస్తావన లేకుండా పోయిందనే టాక్‌ పోలీసు వర్గాల్లో వినిపిస్తోంది. దీంతో పాటుగా ప్రభుత్వాలు దీనిపై శ్రద్ద పెట్టక పోవడంతో ఇది కార్యరూపం దాల్చ లేదనే చర్చ పోలీసుల్లో వినిపిస్తోంది.
Tags:    

Similar News