ఆంధ్రలో రానున్న మూడు నాలుగు రోజులపాటు వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో రానున్న మూడు నాలుగు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.

Update: 2024-06-13 14:04 GMT

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో రానున్న మూడు నాలుగు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు.. మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కొస్తాంధ్ర, వాయువ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో ముందుగా సాగనున్నాయని, అందుకోసం వచ్చే మూడు నాలుగు రోజులు వాతావరణం అత్యంత అనుకూలంగా ఉండనుందని ఆయన వివరించారు. ఈ సమయంలో తెలంగాణ నుంచి బంగాళాఖాతం మధ్య ప్రాంతాల వరకు ద్రోణి కొనసాగుతుందని ఆయన తెలిపారు. వీటి ప్రభావంతో ఈ మూడు నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో స్వత్ప వర్షపాతం నమోదవుతుందని పేర్కొన్నారు.

రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అన్నారు.

అదే విధంగా ఎల్లుండి అంటే శనివారం రోజున కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. ఈ వర్షాలు మరికొన్ని ఇతర ప్రాంతాల్లో కూడా కురిసే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

జాగ్రత్తలు తప్పనిసరి

ఉరుములతో కూడిన వర్షాలు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూర్మనాథ్ సూచించారు. వ్యవసాయ కూలీలు, పశు కాపరులు ఎవరూ కూడా చెట్లు, పోల్స్, టవర్ల కింద తలదాచుకోవడానికి ఆగొద్దని హచ్చరించారు. వాటి దగ్గర పిడుగులు పడే అవకాశాలు అధికంగా ఉంటాయని చెప్పారు. అంతేకాకుండా మైదాన ప్రాంతాల్లో కూడా తిరగొద్దని సూచించారు. ఇదిలా ఉంటే గురువారం.. సాయంత్రం 5 గంటల నాటికి ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో 45.7మిమీ, బాపట్ల జిల్లా పర్చూరులో 32.54మిమీ, అన్నమయ్య జిల్లా పెదతిప్పసముద్రంలో 18.5మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు.

Tags:    

Similar News