రాష్ట్రమంతా విస్తరించిన రుతుపవనాలు..

రుతుపవనాల వల్ల రేపు, ఎల్లుండి ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పారు రాష్ట్ర విపత్తుల సంస్థ ఎండీ కూర్మనాథ్.

Update: 2024-06-20 12:07 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించాయని రాష్ట్ర విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. దాంతో పాటుగా కర్ణాటక, కేరళ తీరాల మీదుగా ద్రోణి కూడా కొనాగుతుందని, వీటి ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆయన వివరించారు. వర్షాలు పడే అవకాశం ఉన్న జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కూర్మనాథ్ తెలిపారు.

ఈ జిల్లాల్లోనే వర్షాలు

రుతుపవనాల కారణంగా రేపు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. అదే విధంగా ఎల్లుండి కూడా వర్షాలు పడతాయని, ఎల్లుండి.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు.

అప్రమత్తంగా ఉండాలి

రాష్ట్రంలో ఉరుములతో కూడిన వర్షాలు పడే సమయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూర్మనాథ్ హెచ్చరించారు. పశు కాపరులు, వ్యవసాయ కూలీలు.. చెట్లు, పోల్స్, టవర్ల కింద నిలబడొద్దని, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని వివరించారు. అంతేకాకుండా లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అంతేకాకుండా వృద్ధులు, చిన్నారులు, బాలింతలు వీరు సీజనల్ వ్యాధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం అనుమానం వచ్చినా వైద్యులను సంప్రదించడం ఉత్తమం అని వివరించారు. ఆరోగ్యపరంగా వచ్చే సమస్యలను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదని హితవు పలికారు.

Tags:    

Similar News