కొనసాగుతున్న ఆవర్తనం.. పలు జిల్లాల్లో వర్షాలు..

మహారాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంతంలో ఆవర్తనం కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. దాని ప్రభావం ఏపీపై ఉండొచ్చన్నారు.

Update: 2024-06-10 12:43 GMT

మహారాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంతంలో ఆవర్తనం కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాలపై ఉండే అవకాశం ఉందని వివరించారు. ఆవర్తం ప్రభావంతో మంగళవారం.. అల్లూరి సీతారామరాజు, కృష్ణా, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్‌ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. దీని ప్రభావం ఎల్లుండి కూడా ఉండొచ్చన్నారు.

ఎల్లుండి పలు ప్రాంతాల్లో వర్షాలు పడొచ్చని తెలిపారు. నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైయస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

పిడుగులతో కూడా వర్షాలు కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా పొలాల్లో పనిచేసేవారు, పశు కాపరులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, వర్షం పడే సమయంలో చెట్ల కిందకు వెళ్లి నిలబడొద్దని, పోల్స్, టవర్స్‌కు కాస్త దూరంగా ఉండాలని, బహిరంగ ప్రదేశాల్లో తిరగొద్దని వివరించారు. వాహనాలపై వెళ్లేవారు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా బైక్‌లపై వెళ్లేవారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Tags:    

Similar News