ఏపీలో విమానాశ్రయాల సంఖ్య డబులు అవుతుంది.. కేంద్రమంత్రి

ఏపీలో ఉన్న విమానాశ్రయాల సంఖ్యపై కేంద్ర పౌరవిమానాయన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు సంచలన ప్రకటన చేశారు.

Update: 2024-08-17 11:24 GMT

ఏపీలో ఉన్న విమానాశ్రయాల సంఖ్యపై కేంద్ర పౌరవిమానాయన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు సంచలన ప్రకటన చేశారు. ఏపీలోని విమానాశ్రయాల సంఖ్యను రెట్టింపు చేసే కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వెల్లడించారు. ఇప్పటికే పలు కొత్త విమనాశ్రయాల నిర్మాణాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని విమానాశ్రయాల అభివృద్ధిపై రామ్మోహన్‌నాయుడుతో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమావేశమయ్యారు. ఈ సమావేశం పూర్తయిన తర్వాత రామ్మోహన్‌నాయుడు ఈ ప్రకటన చేశారు. ఆంధ్ర సీఎంతో జరిపిన చర్చలు ఫలదాయకంగా సాగాయని, ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో విమాన ప్రయాణాలను పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

అభివృద్ధే ధ్యేయం

‘‘ఆంధ్రప్రదేశ్‌లోని విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ 7 విమానాశ్రయాలు ఉన్నాయి. వాటి సంఖ్యను 14 చేసేలా చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే వీటిలో పలు ప్రాజెక్ట్‌లకు కేంద్ర ఓకే చెప్పేసింది. వీటితో పాటుగా పుట్టపర్తిలో ఉన్న ప్రైవేట్ ఎయిర్‌పోర్ట్‌ను కూడా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. 500-700 ఎకరాల స్థలం ఉంటే చిన్న ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించొచ్చు. అలాంటిది పెద్ద ఎయిర్‌పోర్ట్ కావాలంటే కనీసం 3000 ఎకరాల భూమి కావాలి. ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణం కోసం ప్రస్తుతం భూసేకరణ చేస్తున్నాం’’ అని వెల్లడించారు.

కోస్తా అభివృద్ధికి అవకాశం

‘‘భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి. కోస్తా తీరం పెద్దఎత్తున అభివృద్ధి కావడానికి అవకాశం ఉంది. ఆ దిశగానే నిర్ణయాలు తీసుకోవాలి’’ అని ఏపీ సీఎం చంద్రబాబుకు సూచించారు రామ్మోహన్‌నాయుడు. ‘‘హెలికాప్టర్ల వినియోగాన్ని అధికం చేయడానికి గల అవకాశాలను పరిశీలించాలి. డ్రోన్ల వ్యవస్థను కూడా అభివృద్ధి చేయాలి. అతి త్వరలోనే డ్రోన్లకు సంబంధించి ఏపీలో ఓ పెద్ద కార్యక్రమం నిర్వహిస్తాం. ప్రస్తుతం ఏపీలో నిర్మాణంలో ఉన్న ఎయిర్‌పోర్ట్‌లు నిర్దిష్ట సమయంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. నాగార్జున సాగర్, కుప్పం, దిగదుర్తి, తుని-అన్నవరం, తాడెపల్లి గూడెం ప్రాంతాల్లో కొత్త ఎయిర్‌ల నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తాం. ఎయిర్‌పోర్ట్ అథారిటీకి రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించిన వెంటనే పనులు ప్రారంభిస్తాం. విమానాశ్రయాలు అనుకున్న సమయంలో పూర్తి చేసే బాధ్యత కేంద్రం తీసుకుంటుంది’’ అని చెప్పారు.


భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు డెడ్‌లైన్

చంద్రబాబుతో ఏపీలో కొత్త ఎయిర్‌పోర్ట్‌లు, సీ ప్లేన్స్‌ పాలసీపై చర్చించామని రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఈ సందర్భంగానే భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణంపై కీ అప్‌డేట్ ఇచ్చారు. ‘‘జూన్ 2026 నాటికి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను పూర్తి చేస్తాం. ఏపీలో మిగిలిన ఎయిర్‌పోర్ట్‌ల విస్తరణ కూడా వచ్చే ఏడాదిలోగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నాం. ఈస్ట్ కోస్ట్‌ను లాజిస్టిక్ హబ్‌గా మార్చనున్నాం. వాటికి అనుసంధానంగానే కొత్త ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణం జరుగుతుంది. 30 ఏళ్ల తర్వాత వచ్చే అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు శ్రీకారం చుట్టాం. రిమోట్ ప్రాంతాల్లో కూడా 80, 20 సీటర్ ప్లేన్స్‌ను తిప్పేలా ప్లాన్స్ చేస్తున్నాం’’ అని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News