రాయలసీమ నుంచి ద్రోణి.. ఆ జిల్లాలకు వర్ష సూచన

ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు మూడు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర విపత్తుల సంస్థ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.

Update: 2024-06-14 12:24 GMT

ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు మూడు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర విపత్తుల సంస్థ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. రాయలసీమ నుంచి బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతుందని, దాని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని వివరించారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

వర్షాలు కురిసే జిల్లాలు ఇవే..

ద్రోణి ప్రభావంతో రేపు అంటే శనివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

అదే విధంగా ఎల్లుండి కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, వైయస్ఆర్, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు. అంతేకాకుండా వర్షం పడుతున్న సమయంలో వీలైనంత వరకు డ్రైవింగ్ కూడా చేయొద్దని, వాన పడుతున్న సమయంలో వాహనాలు స్కిడ్ అయి ప్రమాదాలు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వివరించారు. కాబట్టి డ్రైవింగ్ చేసేవారు అప్రమత్తంగా ఉండాలని, అతివేగం ఎప్పుడూ మంచిది కాదని చెప్పారు. బైక్‌లపై ప్రయాణం చేసే వారు వర్షం తగ్గే వరకు ఎక్కడైనా ఆగడమే మంచిదని అన్నారు.

కార్యాలయాన్ని సందర్శించిన ఐపీఎస్‌లు

ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని శుక్రవారం ప్రొబేషనర్ IPS అధికారులు నవజ్యోతి మిశ్రా, మండా జావలి ఆల్ఫన్స్, మనోజ్ రామ్ నాథ్, పాటిల్ దేవరాజ్, రోహిత్ కుమార్ చౌదరి సందర్శించారు. ఈ సందర్భంగా విపత్తుల సంస్థ అవలంబిస్తున్న అనేక సాంకేతికతల గురించి తెలుసుకున్నారు. తుపాన్లు, వరదలు, వడగాల్పులు, భారీవర్షాలు, పిడుగుపాటు హెచ్చరిక సమాచారాన్ని జిల్లాయంత్రాంగానికి పంపించే కార్ాయచరణ గురించి కూడా వారికి ఎండీ రోణంకి కూర్మనాథ్ వివరించారు. స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్లో 24/7 వాతావరణాన్ని పర్యవేక్షించే విధానాన్ని తెలియజేసారు. వాతావరణ పరిశోధన విభాగాలలోని వివిధ అంశాలను తెలిపారు.

విపత్తుల సమయంలో నిరంతరం పర్యవేక్షిస్తూ అలర్ట్స్ పంపే విధానాన్ని ప్రత్యక్షంగా చూపించారు. కామన్ అలెర్ట్ ప్రోటోకాల్ , ఏపీ అలెర్ట్ ద్వారా ప్రజలకు హెచ్చరిక మేసేజ్లు పంపించే విధానం చూపించారు. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు వినియోగించే శాటిలైట్ ఫోన్స్, శాటిలైట్ బేస్డ్ మొబైల్ డేటా వాయిస్ టెర్మినల్(SBMDVT), వాకీటాకీ, వి-శాట్ కమ్యూనికేషన్ వ్యవస్థల గురించి తెలియజేశారు.

Tags:    

Similar News