‘హిడెన్ కెమెరా అంశం ఉంది’.. మహిళా కమిషన్ చైర్‌పర్సన్

గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో సీక్రెట్ కెమెరా వ్యవహారం కీలక మలుపు తీసుకుంది. ఈ విషయంపై ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ గజ్జల వెంకటలక్ష్మీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Update: 2024-09-13 08:58 GMT

గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో సీక్రెట్ కెమెరా వ్యవహారం కీలక మలుపు తీసుకుంది. ఈ విషయంపై ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ గజ్జల వెంకటలక్ష్మీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ అంశాన్ని కొందరు మసిపూసి మారేడుకాయలా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారనేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి. ఈ విషయంపై పోలీసులు చెప్పిన అంశాలకు ఛైర్‌పర్సన్ చేసిన వ్యాఖ్యలు పూర్తి విరుద్ధంగా ఉండటంతో పాటు ఈ విషయాన్ని తప్పుదోవ పట్టించడంలో పోలీసులు పాత్ర కూడా ఉందా? అన్న అనుమానాలకు కలిగించేలా ఉన్నాయి. ఒకవైపు కళాశాలలో ఎక్కడా కూడా సీక్రెట్ కెమెరాలు లేవంటూ పోలీసులు చెప్తుంటే.. వెంకటలక్ష్మీ మాత్రం ఈ వ్యవహారంలో సీక్రెట్ కెమెరాల అంశం తప్పకుండా ఉందని అభిప్రాయపడుతున్నారు.

మాకు అనుమానాలున్నాయి: వెంకటలక్ష్మీ

‘‘హిడెన్ కెమెరాల అంశాన్ని పక్క దారి పట్టించడానికి పోలసులే చీకట్లో రెండు షవర్లను ఎత్తుకెళ్లారని మాకు అనుమానాలు ఉన్నాయి. అంతేకాకుండా విద్యార్థులను కూడా బెదిరించే నిరసనలు ఆపించారు. ఇందులో కళాశాల యాజమాన్య హస్తం కూడా ఉంది. ఈ విషయాన్ని ఎలాగైనా తప్పుదవ పట్టించగలమన్న నమ్మకంతోనే తెల్లవారేసరికి పరిస్థితులు మారతాయని ప్రిన్సిపాల్ అన్నారనిపిస్తోంది’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ ఘటనలో వందకు వందశాతం సీక్రెట్ కెమెరాల కోణం దాగి ఉందని వ్యాఖ్యానించారు. ఇది ఒక కళాశాల రిపిటేషనో, ఒక ప్రభుత్వం రిపిటీషన్‌కో సంబంధించిన అంశం కాదని, 300 మంది విద్యార్థినుల జీవితాలకు సంబంధించిన అంశమని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

సీక్రెట్ కెమెరాలు లేవు: ఐజీ

అయితే గుడ్లవల్లేరు కాలేజీలో ఎక్కడా కూడా సీక్రెట్ కెమెరాలు లేవని ఐపీ అశోక్ కుమార్ గతంలోనే స్పష్టం చేశారు. విద్యార్థినులు, సిబ్బంది సమక్షంలో కాలేజీ అంతా అనువనువూ పరిశీలించామని, తమకు ఎటువంటి సీక్రెట్ కెమెరా లభించలేదని ఆయన చెప్పారు. ‘‘గుడ్లవల్లేరు ఘటన రాష్ట్రమంతా చర్చనీయాంశమైంది. ఈ అంశంపై సీఎం చంద్రబాబు స్వయంగా దృష్టి సారించారు. ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా తీసుకోవాలని, సమగ్ర విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు అదే రోజున దర్యాప్తును ప్రారంభించారు. ప్రత్యేక మహిళా బృందం, విద్యార్థినులతో కలిసి హాస్టల్, బాత్రూమ్‌లు అన్నీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశాం. 35 మంది విద్యార్థినులు, వార్డెన్లు, సిబ్బందిని విచారించాం. వారెవ్వరూ కూడా కెమెరా చూసినట్లు చెప్పలేదు’’ అని వెల్లడించారు.

సందేహాల నివృత్తికి ప్రయత్నిస్తాం..

ఈకేసుకు సంబంధించి విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులకు సంబంధించి సందేహాలను నివృత్తి చేయడానికి సీఈఆర్‌టీ ఆయా వర్గాల నుంచి పలు వివరాలు సేకరించిందని, కాగా వారివన్నీ అనుమానాలేనని తెలిసిందని చెప్పారు. వారు ఎటువంటి సాక్ష్యాలు ఇవ్వలేకపోయారని, ఎవరైనా సాక్ష్యాలు ఇస్తే దర్యాప్తును కొనసాగిస్తామని వెల్లడించారు. ఇప్పటి వరకు వారం రోజులుగా సాగిన దర్యాప్తులో సీక్రెట్ కెమెరాల ఏర్పాటు, వీడియోల షేరింగ్ ఏమీ జరగలదేని ఆయన నిర్ధారించారు. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంపై కూడా దృష్టి సారిస్తున్నామని, వచ్చిన వివరాల ఆధారంగా చర్యలు చేపడతామని ఐజీ పేర్కొన్నారు.

రంగంలోకి కేంద్ర బృందాలు

ఈ ఘటనను సీఎం చంద్రబాబు చాలా సీరియస్‌గా తీసుకున్నారని, ఈ విషయం విద్యార్థినుల భవిష్యత్తుకు సంబంధించిందని, వారి మానానికి చెందిన అంశంలో ఏమాత్రం ఛాన్స్ తీసుకోలేమని చంద్రబాబు తమతో చెప్పారని ఐజీ చెప్పారు. ‘‘సీఎం చొరవతో ఢిల్లీకి చెందిన కంప్యూటర్స్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్‌టీ), పూణెకు చెందిన సీ-డాక్ సాంకేతిక నిపుణులు గుడ్లవల్లేరుకు చేరుకున్నారు. కళాశాలలోని కేంద్ర సర్వర్‌ను, వసతిగృహాలను, విద్యార్థుల ఫోన్లు, ట్యాప్‌టాప్‌లు సహా ఇతర గ్యాడ్జెట్‌లను వారు తనిఖీ చేశారు. ఒక క్రిమినల్ కేసులో సీఈఆర్‌టీ పనిచేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. అనుమానితుల ఫోన్లు, ల్యాప్‌టాప్‌లో గ్యాడ్జెట్లను కూడా పరిశీలించారం. లోతైన దర్యాప్తు కోసం వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తున్నాం. ఐదు రోజుల్లో ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా వచ్చేస్తుంది. అప్పుడు పూర్తి వివరాలు బహిర్గతం చేస్తాం’’ అని ఐజీ తెలిపారు.

Tags:    

Similar News