రాయలసీమకు మరో రాష్ట్ర కార్యాలయం.. పాతికేళ్ల తర్వాతే..

ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమకు ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. అన్ని అంశాల్లో రాయలసీమ తన మార్క్ చూపుకుంటుంది. తాజాగా రాష్ట్ర కార్యాలయాల విషయంలో కూడా..

Update: 2024-06-03 14:57 GMT

ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమకు ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. అన్ని అంశాల్లో రాయలసీమ తన మార్క్ చూపుకుంటుంది. తాజాగా రాష్ట్ర కార్యాలయాల విషయంలో కూడా తన మార్క్ చూపించుకోవడానికి సిద్ధమైంది. ఇప్పటికే మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త.. రాయలసీమ నుంచే కార్యకలాపాలు జరుపుతున్నాయి. తాజాగా మరో రాష్ట్ర కార్యాలయం రాయలసీమ బాటపట్టింది. అదే ఎపీఈఆర్‌సీ (ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి). ఈ కార్యాలయం కర్నూలు కేంద్రంగా ఏర్పాటు కానుంది. ఇప్పటి వరకు ఈ కార్యాలయం హైదరాబాద్ కేంద్రంగా ఉంది. తాజాగా దీనిని కర్నూలుకు బదిలీ చేశారు. అందులో పనిచేసే ఉద్యోగులు కూడా కర్నూలుకు తమ నివాసాన్ని మార్చుకోవాలని అధికారులు సూచించారు. ఆ మేరకే వారు కార్నూలుకు పయనమవుతున్నారు.

అదే అసలు కారణం

2 జూన్ 2014న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు విడివడ్డాయి. ఆ విభజన చట్టంలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా పదేళ్లు కొనసాగుతుందని కేంద్రం తెలిపింది. ఆ గడువు ఈ ఏడాది జూన్ 2తో అంటే నిన్నటితో (ఆదివారంతో) ముగిసింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ఉన్న ఏపీఈఆర్‌సీ కార్యాలయాన్ని ప్రభుత్వం కర్నూలు‌కు షిఫ్ట్ చేసింది. ఉమ్మడి రాజధాని గడువు ముగియడానికి ఒక్కరోజు ముందే ఆంధ్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కర్నూలు‌లో కార్యకలాపాలు ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాంతో ఉద్యగోలు, ఫైళ్లు, సామాగ్రిని కూడా కర్నూలుకు తరలించారు.

ఏపీఈఆర్‌సీలో ఉండే సిబ్బంది ఎవరంటే..!

ఏపీఈఆర్సీకి ఒక చైర్మన్, ఇద్దరు సభ్యులు ఉంటారు. వారి తర్వాత డైరెక్టర్ హోదాలో ఒక కమిషన్ సెక్రటరీ ఉంటారు. ఆ తర్వాత జాయింట్ డైరెక్టర్, ఐదుగురు డిప్యూటీ డైరెక్టర్లు, ఒక లీగల్ కన్సల్టెంట్, ఒక ఐటీ కన్సల్టెంట్, కార్యాలయ సిబ్బంది ఉంటారు. వీరంతా తమ ఆధీనంలోని ఫైళ్లను తరలించేందుకు సిద్ధంచేసి భద్రపరచాలని ఈ ఏడాది ఏప్రిల్‌లో కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా ఉద్యోగులు కూడా తమ నివాసాలను కర్నూలుకు మార్చుకోవాలని సూచించింది కమిషన్. ఉద్యోగులు తమ వసతి ఏర్పాట్లు కోసం స్థానికంగా ముగ్గురు డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ స్థాయి అధికారుల సహాయ సహకారాలను తీసుకోవాల్సిందిగా సూచించింది.

ఏపీఈఆర్‌సీ చేసే పనులు ఇవే..

విద్యుత్ చట్టంలోని సెక్షన్-86 ద్వారా కమిషనకు పలు విధులను నిర్దేశించారు. అవి.. విద్యుత్ ప్రసారం, పంపిణీ, రిటైల్ సరఫరా కార్యకలాపాలు, నిర్వహణను మెరుగుపరిచి, విద్యుత్ చార్జీలను నిర్ణయించడం మండలి లక్ష్యం. ఇంట్రా-స్టేట్ ట్రాన్స్మిషన్‌లో ఓపెన్ యాక్సెస్‌ను సులభతరం చేయడం, ఇంట్రా-స్టేట్ ట్రేడింగ్, పవర్ మార్కెట్ అభివృద్ధిని ప్రోత్సహించడం, విద్యుత్ అంతరాష్ట్ర ప్రసారం, పంపిణీ రిటైల్ సరఫరాలో పోటీ మార్కెట్ల అభివృద్ధికి అవసరమైన సాంకేతిక, సంస్థాగత మార్పులను తీసుకురావడం వంటివి చేయడం కూడా ఏపీఈర్‌సీ విధులే. రాష్ట్రంలో పంపిణీ, సరఫరా కోసం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, విద్యుత్ కొనుగోలు, సేకరణ ప్రక్రియను నియంత్రిస్తుంది. పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించడానికి మొత్తం విద్యుత్ వినియోగంలో దాని శాతాన్ని నిర్ణయిస్తుంది.

అంతేకాకుండా.. డిస్కంలు, ఉత్పాదక సంస్థల మధ్యనున్న వివాదాలపై విచారణ జరిపి తీర్పుల ద్వారా పరిష్కరిస్తుంది. వినియోగదారుల ప్రయోజనాలను పెంపొందించడంపై ప్రభుత్వానికి సలహాలివ్వడం వంటివి కమిషన్ చేస్తుంది. అలాగే, కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉండేలా విశాఖపట్నంలో ఇప్పటికే ఏపీఈఆర్సీ క్యాంపు కార్యాలయం గతేడాది ఆగస్టు 18న ప్రారంభమైంది.

పాతికేళ్ల తరువాత ఏపీకి ఏపీఈఆర్‌సీ

ఏపీఈఆర్‌సీ కార్యాలయం 1999 మార్చిలో హైదరాబాద్ కేంద్రంగా. రాష్ట్ర విభజన తర్వాత అమరావతి ప్రాంతానికి తరలిస్తూ 2014 ఆగస్టులో ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే మండలి మాత్రం ఇన్నాళ్లూ హైదరాబాద్ కేంద్రంగానే పనిచేస్తూ వచ్చింది. ఏపీఈఆర్సీ ప్రధాన కార్యాలయం కర్నూలులో ఉండాలని రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ గతేడాది ఆగస్టు 25న నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం.. అక్కడ భవన నిర్మాణం మొదలైంది.

Tags:    

Similar News