ఏపీలో మారని పరిస్థితి.. ప్రజలకు జాగ్రత్త తప్పనిసరి

ఆంధ్రలో ఎండలు మండుతున్నాయి. రోజురోజుకు వడగాలులు వీస్తున్న మండలాల సంఖ్య పెరుగుతోంది. రేపు కూడా 174 మండలాల్లో వడగాలులు వీయొచ్చని విపత్తుల సంస్థ అంచనా..

Update: 2024-04-25 13:14 GMT

రాష్ట్రంలో వాడివేడిగా సాగుతున్న రాజకీయాలు నేటితో నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో కాస్తంత చల్లబడ్డాయి. కానీ రాష్ట్రం వేసవి వేడి మాత్రం రోజురోజుకూ అధికమవుతూనే ఉంది. ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తోంది ఎండ. భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే ఈ పరిస్థితులు రానున్న రోజుల్లో మరింత తీవ్రతరం కావొచ్చని రాష్ట్ర విపత్తుల శాఖ అంచనా వేసింది. రేపు 56 మండలాల్లో తీవ్రస్థాయి వడగాలులు వీచే అవకాశం ఉందని, అదే విధంగా 174 మండలాల్లో ఒక మోస్తరు వడగాలులు వీయొచ్చని సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. కావున ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తూచా తప్పకుండా పాటించడం శ్రేయస్కరమని సూచించారు.

రేపు వడగాలులు ఏయే మండలాల్లో అంటే

శ్రీకాకుళం 13 , విజయనగరం 23 , పార్వతీపురం మన్యం 13 , అల్లూరి సీతారామరాజు 2 అనకాపల్లి 3, తూర్పుగోదావరి 1, కాకినాడ ఒక మండలంలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఆయన వివరించారు. అదే విధంగా శ్రీకాకుళం 12, విజయనగరం 4, పార్వతీపురం మన్యం 2, అల్లూరి సీతారామరాజు 10, విశాఖపట్నం 3, అనకాపల్లి 12, కాకినాడ 17, కోనసీమ 9, తూర్పుగోదావరి 18, పశ్చిమగోదావరి 4, ఏలూరు 14, కృష్ణా 11, ఎన్టీఆర్ 6, గుంటూరు 14, పల్నాడు 18, బాపట్ల 2, ప్రకాశం 8, తిరుపతి 4, నెల్లూరు 1, సత్యసాయి జిల్లాలోని 5 మండలాల్లో ఒక మోస్తరు వడగాల్పులు వీచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్లడాన్ని వీలైనంతవరకు మానుకోవాలని హెచ్చరించారు. ఒకవేళ బయటకు వెళితే తగిన చర్యలు తీసుకోవాలని, తలకు స్కార్ఫ్, టోపీ, కర్చీఫ్ వంటి వాటిని ధరించాలని సూచించారు. అదే విధంగా జీన్స్ వంటి మందపాటి దుస్తులకు దూరం పాటించడం మంచిదని, తద్వారా అనేక ఆరోగ్య సమస్యలు రాకుండానే నివారించుకోవచ్చని ఆయన వివరించారు. బయటకు వెళ్లిన వారు ప్రతి 20 నిమిషాలకు నీళ్లు తాగాలని, వీలైతే జ్యూస్‌లు, చెరుకు రసం, కొబ్బరి నీళ్లు వంటికి తాగడం మరింత మేలు చేస్తుందని చెప్పారు. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులు మరింత జాగ్రత్తలు పాటించాలని, వారు ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్లొద్దని కూర్మనాథ్ హెచ్చరించారు. చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, గుండె జబ్బులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని చెప్పారు.

కాస్తంత వడగాలులకు మాకేం కాదులే అన్న నిర్లక్ష్యాన్ని ప్రతి ఒక్కరూ విడిచి పెట్టాలని కూడా ఆయన హితవు పలికారు. తీవ్ర స్థాయి నుంచి ఒక మోస్తరు వడగాలులు వీచే మండలాల సంఖ్య రోజురోజుకు అధికం అవుతుందని, దానిని గమనించి రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అంచనా వేసుకోవాలని ఆయన సూచించారు. ఈరోజు రాష్ట్రంలో నంద్యాలలో అత్యధికంగా 45.6 సెంటిగ్రేడ్‌ల ఉష్ణోగ్రత, అదే విధంగా శ్రీకాకులం కొల్లివలసలో 44 సెంటిగ్రేడ్‌ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైనట్లు వివరించారాయన.

Tags:    

Similar News