దేశంలో అరకు కాఫీ తుపాన్!
అరకు కాఫీని పీఎం నరేంద్ర మోదీ కీర్తించారు. అరకు కాఫీని కొత్తగా కనిపెట్టినట్లు చెప్పుకోవడం ఏమిటని కాంగ్రెస్ వారు ఎద్దేవా చేశారు. ఇంతకూ ఏమి జరిగింది?
అరెరే.. ఇదేమి లొల్లి అనుకుంటున్నారా..! అవును అరకు ఆర్గానిక్ కాఫీ గురించి జరిగిన లొల్లి. అరకు కాఫీపై తలో మాట మాట్లాడారు. ఎవరికి వారు తమ గొప్పను చెప్పుకునేందుకు ప్రయత్నించారు. అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాత్రం అరకు కాఫీ ఎంతో గొప్పదన్నారు. ఆయన ఆదివారం దేశ వ్యాప్తంగా ‘మన్‌కీ బాత్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎందుకు ఆంధ్రప్రదేశ్ గుర్తుకు వచ్చిందో... ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు ప్రస్తావించాలనుకున్నారో తెలియదు కానీ.. అరకు కాఫీ గొప్పతనం గురించి తన అనుభవాలు ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. పైగా 2016లో చంద్రబాబునాయుడు సీఎంగా ఉండగా ఆయనతో విశాఖపట్నంలో అరకు కాఫీ తాగుతూ మాట్లాడుతున్న ఫొటోలు ట్విటర్‌లో షేర్ చేశారు. ప్రపంచంలోని ఎవరైనా కాఫీ ప్రియులైతే తప్పకుండా అరకు కాఫీని ఒక్కసారి తాగాల్సిందేనని మరో ట్వీట్ చేస్తూ అందులో అరకు కాఫీ తోటలు, గింజలు కోసే విధానం, గిరిజనుల పనితీరు, కాఫీ గింజల ప్రాసెసింగ్ విధానం చూపించే వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. ఎంతో ప్రేమ, అభిమానం, ఉచ్చుకత, అరకు గిరిజనుల గొప్పతనం కనిపించేలా ట్విటర్‌లో పోస్టు చేసే సమయంలో స్వయంగా ప్రధాన మంత్రి శ్రద్ధ తీసుకున్నారంటే అరకు కాఫీ గురించి ఆయన ఏమి చెప్పదలుచుకున్నారో అర్థమవుతోంది.