ఈ మాజీ మంత్రులు కేసుల్లో ఇరుక్కున్నారా? ఇరికించారా?

వీరు మాజీ మంత్రులు. ఒకరు లంచం కేసులో ఇరుక్కోగా, మరొకరు బియ్యం కేసులో ఇరుక్కున్నారు. ఇంతకూ వీరు ఇరుక్కున్నారా.. ఇరికించారా.. అనేది ప్రస్తుతం చర్చగా మారింది.;

Update: 2024-12-12 07:09 GMT

వైఎస్సార్సీపీ నాయకులు వరుసగా ఇబ్బందుల్లో ఇరుక్కుంటున్నారు. యాదృచ్చికంగా జరుగుతోందా? ప్రస్తుత ప్రభుత్వం వీరిని ఇరికిస్తోందా? అనేది చర్చగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో కక్ష రాజకీయాలు సాగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్సార్సీపీ వారిని అడుగడుగునా అధికార పార్టీ వారు ఒక కన్నేసి ఉంచారు. గతంలో తమ పార్టీ వారిని చాలా కేసుల్లో అనవసరంగా ఇరికించారని తెలుగుదేశం, జనసేన వారు ఇప్పటికీ చెబుతున్నారు. హోం మంత్రి ఒకడుకు ముందుకు వేసి తమను గత ప్రభుత్వం ఇబ్బందుల పాలు చేసింది. ఇప్పుడు వారిని వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వంలో తప్పులు చేసిన మంత్రులు, వారి అనుచరులు గురించి ఆరా తీస్తున్నారు. ఇక వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వారిని వెంటాడుతున్నారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ఇన్చార్జి సజ్జల భార్గవ్ రెడ్డితో పాటు వందల మంది వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను ప్రభుత్వం అరెస్ట్ చేయిస్తోంది.

వైఎస్సార్సీపీ ప్రముఖ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) భార్య జయసుధపై కేసు నమోదైంది. పేర్ని నానికి సంబంధించిన గోడౌన్ ను గత ప్రభుత్వ హయాంలో బియ్యం నిల్వ ఉంచేందుకు అద్దెకు తీసుకున్నారు. 2022లో బస్తాకు నెలకు రూ. 5ల వంతున అద్దె చెల్లించే విధంగా ప్రభుత్వం గోడౌన్ ను అద్దెకు తీసుకుంది. మెయింటెనెన్స్ మొత్తం గోడౌన్ వారికే అప్పగించింది. గోడౌడ్ లో బియ్యం నిల్వలు ఎంత ఉన్నాయి అనే వివరాలు కూడా వారే రికార్డులు మెయింటెన్ చేయాల్సి ఉంటుంది. బియ్యం గోడౌన్ కు సరఫరా చేసే టప్పుడు ఎంత చేశారనే వివరాలు ప్రభుత్వం వద్ద వుంటాయి. ప్రభుత్వ అధికారులు పర్యవేక్షణ బాధ్యతల్లో ఉన్నందున ప్రతి నెలా గోడౌన్ ను తనిఖీ చేసి నిల్వల వివరాలు ఎప్పటికప్పుడు జిల్లా అధికారులకు ఇవ్వాలి. అయితే నాని గోడౌన్ లో ఉన్న బియ్యం నిల్వల గురించి తనిఖీలు చేయకుండానే జిల్లా అధికారులకు జిల్లా సివిల్ సప్లైస్ మేనేజర్ పంపింస్తున్నారని ప్రభుత్వం గుర్తించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.

గోడౌన్లో ఉండాల్సిన బియ్యం నిల్వల్లో 3,700 బస్తాలు తగ్గాయని, ఇందుకు సంబంధించిన డబ్బు నేను చెల్లిస్తానంటూ గత నెల 27న కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మకు లేఖ రాశారు. తూకాల్లో తేడా వల్ల ఈ బియ్యం తగ్గినట్లు గోడౌన్ యజమాని నిర్థారిస్తూ ఈ లేఖలో పేర్కొన్నారు. వెంటనే ఆమె గోడౌన్ లో బియ్యం తనిఖీ చేయాల్సిందిగా సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ మన్ జీర్ జిలాని ని పంపించారు. ఆయన 28,29 తేదీల్లో తనిఖీ చేసి 185 టన్నుల బియ్యం గోడౌన్ నుంచి మాయమయ్యాయని రిపోర్టు ఇచ్చారు. ఈ రిపోర్టు మేరకు గోడౌన్ యజమానిగా ఉన్న జయసుధపై కేసు నమోదు చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు కేసు నమోదు చేశారు. టన్ను బియ్యం విలువ రూ. 48,500లు ఉందని, మొత్తం రూ. 89.72 లక్షలు చెల్లించడంతో పాటు రెట్టింపు జరిమానా కట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేశారు.

గోడౌన్ లో బియ్యం నిల్వలు తగ్గాయని పేర్ని నాని లేఖ రాసే వరకు ప్రభుత్వానికి బియ్యం దగ్గాయనే విషయం కూడా తెలియదు. నాని అనుకుంటే అంతే మొత్తం బియ్యం కొనుగోలు చేసి గోడౌన్ లో పెట్టవచ్చు. అలా కాకుండా తానే లేఖరాసి ప్రభుత్వ కేసుల్లో చిక్కుకున్నారు. పారదర్శకంగా ఉందామని ఇలా చేశారా? లేక కేసులు పెడితే రాజకీయ కక్ష సాధింపు కిందకు వస్తుంది కాబట్టి తాను బయటకు వచ్చి పోరాటాల్లో పాల్గొనేందుకు ఇదో ఆయుధంగా వాడుకోవచ్చనుకున్నారా? అనే చర్చ జరుగుతోంది. నిజానికి గోడౌన్ లో స్టాక్ తగ్గింది అనేది నిర్థారణ అయిన తరువాత ఎవరైనా కేసు పెట్టకుండా ఎందుకు ఉంటారు. అదే నాని విషయంలోనూ జరిగింది. ఈ కేసు నుంచి ఎలా తప్పించుకుంటారో వేచి చూడాల్సిందే.

వైద్య ఆరోగ్య శాఖ మాజీ మంత్రి విడదల రజిని లంచం కేసులో ఇరుక్కున్నారు. ఈ కేసులో ఆమె ఇరుక్కున్నారా? పాలకులు ఇరికించారా? అనే అంశంపై చర్చమొదలైంది. గుంటూరు జిల్లా యడ్లపాడు వద్ద ఉన్న శ్రీ లక్ష్మి బాలాజీ స్టోన్ క్రషర్ యజమానులను బెదిరించి రెండు కోట్లు లంచం తీసుకున్నట్లు కేసు నమోదైంది. తమను బెదిరించి తమ వద్ద నుంచి రూ. 2.20 కోట్లు తీసుకున్నారని స్టోన్ క్రషర్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వయిరీకి ఆదేశించింది. విజిలెన్స్ వారు విచారణ నిర్వహించి రజిని లంచం తీసుకున్న మాట వాస్తవమని ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీంతో ఆమెపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనే విషయమై ఆసక్తి నెలకొంది. విజిలెన్స్ రిపోర్టు ఇచ్చిన తరువాత ప్రభుత్వం నుంచి ఇంకా స్పందన రాలేదు. వివరాలు మాత్రం మీడియాకు అందాయి.

సాధారణంగా అవినీతికి పాల్పడినట్లు నిర్థారణ అయినందున యాంటి కరప్షన్ బ్యూరో సెక్షన్ కింద కేసు నమోదవుతుంది. బెయిల్ కూడా తిరస్కరించ వచ్చు. స్టోన్ క్రషర్ నడపాలంటే ఐదు కోట్లు ఇవ్వాలని, లేకుంటే రూ. 50 కోట్లు జరిమానా విధిస్తామని బెదిరించినట్లు క్రషర్ యజమాని పోలీసులకు చెప్పారు. విజిలెన్స్ విచారణ అంటే పోలీసులతో పాటు ఇతర శాఖలకు చెందిన అధికారులు కూడా ఉంటారు. అన్ని కోణాల నుంచి పరిశీలించిన తరువాతనే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి ఉంటారు. అప్పట్లో రీజినల్ విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారిగా పోలీస్ అధికారి పల్లె జాషువా ఉన్నారు. 2020లో సంఘటన జరిగినట్లు విచారణలో తేల్చారు. 2020 సెప్టెంబరు 4న రజిని పిఏ రామకృష్ణ, జాషువా కలిసి ఈ పనిచేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. తీసుకున్న లంచంలో రెండు కోట్లు రజిని, పది లక్షలు పిఏ రామకృష్ణ, పది లక్షలు జాషువ తీసుకున్నట్లు విజిలెన్స్ నివేదికలో పేర్కొన్నారు.

మాజీ మంత్రులైన పేర్ని నాని, విడదల రజినిలు ఆధారాలతో సహా ప్రభుత్వానికి దొరికారు. వీరిపై రాజకీయంగా జరిగిందా? అంటే ఆధారాలు ప్రభుత్వం వద్ద ఉన్నందున రాజకీయ కక్ష ఎలా అవుతుందని టీడీపీ వారు అంటున్నారు. ఈ విషయంలో మాజి మంత్రులు ఇద్దరూ ఇంకా ఎటుంటి వివరణలు ఇవ్వలేదు. ఈ కేసుల్లో ఏమి జరుగుతుందోనని ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇరువురూ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ కు మంచి సన్నిహితులు. విడదల రజిని కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. నాని సీనియర్ రాజకీయ నాయకులు.

Tags:    

Similar News