వీరు ప్రజల మనుషులు కాలేరా?

కొందరు నేతలు ప్రజల మనుషులు కాలేకపోతున్నారు. కొందరు ఎస్సీ నాయకుల్లో ఈ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకు ఇలా జరుగుతోంది. ఇద్దరు నాయకురాళ్ల గురించి తెలుసుకుందాం.

Update: 2024-03-26 06:42 GMT
ఉండవల్లి శ్రీదేవి, ఉప్పులేటి కల్పన

వీరిని ప్రజలు అంతగా ప్రేమించిన దాఖలాలు లేవు. ఒక నాయకుడు చనిపోతే ఆయన కోసం వేలమంది అభిమానులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు చూశాం. ఇటీవల చంద్రబాబునాయుడును అరెస్ట్ చేస్తే భావోద్వేగంతో కొందరు చనిపోయారు. వీరిదికూడా అభిమానమే. అటువంటి అభిమానాన్ని గత పదేళ్ల కాలంలో ఒక్క ఎస్సీ ఎమ్మెల్యే కూడా సంపాదించుకోలేక పోయారు. కారణాలు ఎన్నైనా చెప్పొచ్చుకానీ గతంలో లాగా తన వెంట నలుగురు ఉన్నారని చెప్పుకునే నాయకులు లేకుండా పోయారు. చాలా మంది ఎస్సీ నాయకులు, నాయకు రాళ్లను చూస్తున్నాం. వారు రాజకీయాల్లో లేకపోయినా, ఓటమి చెందినా వారి గురించి ఆలోచించే వారు కానీ, పట్టించుకునే వారు కానీ ఉండటం లేదు. ప్రస్తుతం సీట్లు రాని ఓసీ, ఎస్సీ నాయకులు ఆత్మయ సమావేశాలు పెట్టి తమ బాధను వెళ్లగక్కుతున్నారు. అటువంటి కోవలోకే వస్తారు ఈ ఇద్దరు మహిళా నాయకురాళ్లు.

సామాజిక చైతన్యం తేలేని మహిళ

ఉప్పులేటి కల్పన. ఈమె ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ. మొదటి సారి 2009లో తెలుగుదేశం పార్టీలో చేరడం ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2012 సెప్టెంబరులో టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్షీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించి 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. టీడీపీ నుంచి పోటీ చేసిన సీనియర్ టీడీపీ నాయకుడు వర్ల రామయ్యను ఓడించి తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అయ్యారు. తిరిగి ఆమె 2016 డిసెంబరులో టీడీపీలో చేరారు. 2019లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి మొదటి సారి పోటీ చేసిన కైలె అనిల్ కుమార్ చేతిలో ఓడిపోయారు. ఆంధ్ర యూనివర్శిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. బాగా చదువుకున్న మహిళ కావడంతో ప్రజల్లో సామాజిక చైతన్యం తీసుకొస్తారనే ఆలోచనలో చాలా మంది ఉన్నారు. ఆ వైపుగా ఆమె ఎప్పుడూ పనిచేయలేదు. డబ్బుంది కాబట్టి రాజకీయాల్లోకి వచ్చారు. అధికారం ఉన్నంత కాలం ఆనందంగా గడిపారు. ఇప్పుడు ఆమె ఆనందానికి పెద్దగా అడ్డంకులు లేవు.

రాజకీయ చతురత నేర్వని శ్రీదేవి

ఉండవల్లి శ్రీదేవి. ఈమె ప్రస్తుతం తాడికొండ ఎమ్మెల్యే. రాజధాని ప్రాంత నియోజకవర్గం నుంచి మొదటి సారి గెలిచిన మహిళా నాయకురాలు. తాడికొండ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ వారే మహిళలకు సీటు ఇచ్చారు. 2014 ఎన్నికల్లో క్రిష్టినా కధరే కు వైఎస్సార్సీపీ టిక్కెట్ ఇచ్చింది. టీడీపీ అభ్యర్థి టి శ్రావణ్ కుమార్ పై పోటీ చేసి ఓటమి చెందారు. 2016లో ఉండవల్లి శ్రీదేవికి వైఎస్సార్సీపీ తాడికొండ సమన్వయకర్తగా ఇచ్చింది. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగారు. 2019లో ఉండవల్లి శ్రీదేవికి వైఎస్సార్సీపీ టిక్కెట్ ఇచ్చింది. ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. 2023 మార్చి 23న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసి మార్చి 24 వ తేదీన వైఎస్సార్సీపీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఆ తరువాత పార్టీ ఫిర్యాదు మేరకు 2024 ఫిబ్రవరి 26న ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రాష్ట్ర శాసన సభ స్పీకర్ రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. శ్రీదేవికి రాజకీయ నేపథ్యం ఉంది. ఆమె తండ్రి సుబ్బరావు 1978లో ఉండవల్లి నుంచి రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. శ్రీదేవి బెంగుళూరులో 1993లో ఎంబీబీఎస్ పట్టా తీసుకున్నారు. హైదరాబాద్ లో ప్రాక్టీస్ పెట్టారు. వైద్యురాలుగా మంచి గుర్తింపు ఉంది. ఒక్కరోజు లక్ష సంపాదిస్తానని ఇటీవలే చెప్పారు. తాడికొండ నుంచి గెలిచి తన పేరును తానే చెరిపేసుకున్నట్లైంది. తెలుగుదేశం పార్టీ నుంచి సీటు వస్తుందని భావించిన శ్రీదేవికి సీటు దక్కకపోవడంతో భావోద్వేగానికి గురయ్యారు. ఎస్సీలంటే అందరికీ చులకనలేనని వ్యాఖ్యానించడం కూడా విశేషం.

పవర్ ఉన్నప్పుడు ఎందుకు నిర్లక్యం

పవర్ లో ఉండే ఆనందం వేరు. అధికారం లేకుండా అనుభవించే ఆనందం వేరు. అధికారం ఉంటే డబ్బులు ప్రభుత్వం ఖర్చుపెడుతుంది. ఇద్దరు గన్ మెన్ లు ఉంటారు. నిత్యం ఎవరో ఒకరు ఇంటికి వస్తుంటారు. కాస్త తీరికలేనట్లుగా కనిపించినా ఆ ఎంజాయే వేరబ్బ అంటుంటారు నేతలు. ఈ కిక్కు కావాలని కోరుకుంటారు కొందరు నేతలు. ఆ కోవలోకే వీరిద్దరు మహిళా నేతలు వస్తారని చెప్పొచ్చు. పవర్ లో ఉన్నప్పుడు దానిని ఉపయోగించి ప్రజలకు ఏమీ చేయలేకపోయారు. 

Tags:    

Similar News