అచెన్న అడ్డాలో ఆశా పోస్ట్‌ల వేలం..!
ఆశా వర్కర్ పోస్టు రూ.2 లక్షలకు వేలం. చెల్లించనందుకు గ్రామ బహిష్కరణ. అంగన్వాడీ ఉద్యోగాలకూ వేలం పాట. ససేమిరా అన్నందుకు ఆ పాఠశాలకు తాళాలు.;
అంతరిక్షంలోకి అడుగు పెట్టి అక్కడేం జరుగుతుందో అణువణువూ శోధిస్తున్నాం. ప్రపంచాన్ని కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నాం. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో ముందుకు దూసుకుపోతున్నాం. రోజు రోజుకూ కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్నాం. రాచరికం పోయి ప్రజాస్వామ్య పాలనలోకి వచ్చాం. కానీ ఇంకా ఆ ఊళ్లో మాత్రం అనాగరికమే రాజ్యమేలుతోంది. అరాచకమే ఆశ్చర్యపోయేలా గ్రామ పెద్దల పాలన సాగుతోంది. అదెక్కడో మారుమూల అటవీ ప్రాంతంలో అనుకుంటున్నారా? కానే కాదు.. సాక్షాత్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అడ్డాలోనే అడ్డూ అదుపూ లేకుండా జరుగుతోంది. అదేంటో తెలిస్తే ఔనా? అంటూ నోరెళ్లబెట్టడం మీ వంతవుతుంది. ఇంతకీ అ ఆనాగరిక చర్య ఏమిటంటే?
శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని సంతబొమ్మాళి మండలం లక్కివలస పంచాయతీ గెద్దలపాడు అనే గ్రామం ఉంది. ఆ ఊరు జనాభా 1257. ఆ ఊళ్లో 21 మందితో కూడిన గ్రామ పెద్దల దళం ఒకటి ఉంటుంది. వారు చెప్పినట్టే గ్రామస్తులంతా నడచుకోవాలి. లేదంటే గ్రామ బహిష్కరణకు గురి కావల్సిందే. ఊళ్లో ఆశావర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, స్వీపరు, డీలరు పోస్టుల్లో అర్హతను బట్టి చేరదామంటే కుదరదు. ఆ పోస్టులకు గ్రామ పెద్దలే వేలంపాట నిర్వహిస్తారు. అందులో ఎవరు ఎక్కువ పాట పాడుకుంటే వారికే ఆ పోస్టు ఇస్తారు.. వారు నిర్దేశించిన సొమ్ము చెల్లిస్తేనే ఉద్యోగం చేయనిస్తారు. లేదంటే ఉద్యోగాన్ని ఊడబెరికి ఊరు బహిష్కరణ చేస్తారు. ఈ దురాచారం ఆ గ్రామంలో కొన్నేళ్ల నుంచి నిరాటంకంగా సాగుతోంది.
రూ.లక్షలకు ఆశావర్కర్ పోస్టు వేలం..
గెద్దలపాడులో అన్ని గ్రామాల్లో మాదిరిగానే ఆశావర్కరు పోస్టు ఉంది. ఆ పోస్టులో 2014 నుంచి ఓ మహిళ (ధనలక్ష్మి) కొనసాగుతూ వచ్చింది. అప్పట్లో పనికి తగిన పారితోషికం పేరిట ప్రభుత్వం నెలకు రూ.500-800 వరకు గౌరవ వేతనంగా చెల్లించేది. ఆ వేతనంతో బతుకు దెరెవు కష్టమన్న ఉద్దేశంతో ఆ మహిళ ఆశా వర్కరు పోస్టును వదిలి వెళ్లిపోయింది. ఆమె స్థానంలో అదే గ్రామానికి చెందిన నుత్తు చంద్రమ్మ అనే మహిళను గ్రామ ఏఎన్ ఎం సిఫార్సుతో అధికారులు నియమించారు. అప్పట్నుంచి ఆమె తన విధులను సక్రమంగా నిర్వహిస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ వేతనాన్ని రూ.10 వేలకు పెంచారు. ఇంతలో గతంలో ఆ ఉద్యోగాన్ని వదిలి వెళ్లిన మహిళ తనకు మళ్లీ ఆ ఉద్యోగాన్నిస్తే కొంత సొమ్ము ఇస్తానని గ్రామ పెద్దలతో చెప్పింది.
దీంతో ఊరి పెద్దలు ఆ పోస్టుకు గత ఆగస్టు నెలలో వేలంపాట నిర్వహించారు. ఆ వేలంపాటలో చంద్రమ్మ రూ.1.85 లక్షలకు ఆ పోస్టు దక్కించుకుంది. అయినా సంత్రుప్తి చెందని గ్రామ పెద్దలు రూ.2 లక్షలు ఇవ్వాలని, లేదంటే గతంలో మానేసిన ధనలక్ష్మికి ఆ ఉద్యోగం ఇచ్చేస్తామని, అందుకు రాజీనామా చేయాలని చంద్రమ్మను బెదిరించారు. పేదరాలినైన తాను అంత సొమ్ము చెల్లించలేనని చెప్పింది. ఆగస్టు నుంచి ఆ సొమ్ము కోసం పెద్దలు గ్రామంలో ఏడెనిమిది సార్లు మీటింగ్‌లు పెట్టుకుని ఆమెపై ఒత్తిడి చేస్తూనే ఉన్నా ఫలితం లేకుండా పోయింది. తన ఉద్యోగాన్ని ఊరి పెద్దలు వేలంపాటలో అమ్మేశారని కొంతమంది సాటి ఆశావర్కర్లను వెంట బెటుకుని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి ఇంటికి వెళ్లి ఫిర్యాదు చేసింది.
అలా ప్రభుత్వ ఉద్యోగానికి వేలంపాట నిర్వహించడం చట్టవిరుద్ధం...నీ ఉద్యోగానికేం ఢోకా లేదు.. వెళ్లు.. ఎప్పడైనా ఇబ్బందైతే చెప్పు.. అని చంద్రమ్మను మంత్రి అచ్చెన్న పంపేశారు. ఈ సంగతి తెలుసుకున్న గ్రామ పెద్దలు ఆమెపై మరింతగా కక్ష పెంచుకున్నారు. చివరకు ఆ ఊరి పెద్దలు ఈనెల 17న చంద్రమ్మను పిలిచి ఆ రోజు నుంచి ఉద్యోగం చేయొద్దని, ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు సంతకం పెట్టాలని ఒత్తిడి చేశారు. తన పిల్లల పోషణకు ఈ ఉద్యోగమే ఆధారమని, తనను తొలగించవద్దని వేడుకున్నా కనికరించలేదు. ఆపై ఆమె కుటుంబాన్ని వెలి వేశారు. అంతేకాదు.. ఊళ్లో ఆమెతో ఎవరూ మాట్లాడొద్దని, ఆమె ఇంటికి ఎవరూ వెళ్లొద్దని, ఆమెకు సరకులు విక్రయించరాదని, ఆమె ఇచ్చే మందులు గర్భిణులు సైతం తీసుకోరాదని హుకుం జారీ చేసి దండోరా వేయించారు. ఊరంతా గ్రామ పెద్దల ఆజ్క్షకే కట్టుబడ్డారు. చేపల వేటతో జీవనం సాగించే చంద్రమ్మ భర్తను కూడా వేటకు వెళ్లకుండా కట్టడి చేశారు.
రంగంలోకి ఉన్నతాధికారులు..
తనకు జరిగిన అన్యాయంపై చంద్రమ్మ మండలంలోని సీఐటీయూ, ఆశావర్కర్ల అసోసియేషన్ నాయకులను ఆశ్రయించింది. తనను ఆశా వర్కరు ఉద్యోగం నుంచి తీసేస్తే ఆత్మహత్యే శరణ్యమని కన్నీటి పర్యంతమైంది. ఆమెకు అండగా నిలిచిన ఆ నాయకులు జిల్లా కలెక్టర్, ఆర్డీవో, ఎస్పీ, డీఎంహెచ్‌వో తదితర అధికారులకు ఫిర్యాదు చేశారు. ఊరి పెద్దల అనాగరిక చర్యకు ఈ అధికారులు కూడా నివ్వెరపోయారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని టెక్కలి ఆర్డీవో క్రుష్ణమూర్తిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రంగంలోకి దిగిన ఆర్డీవో బుధవారం (19న) గెద్దలపాడు గ్రామ పెద్దలను పిలిపించుకుని విచారించారు.
ఉద్యోగాలకు వేలంపాట నిర్వహించడం చట్టరీత్యా నేరమని, ఇకపై అలా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినా వెనక్కి తగ్గని పెద్దలు చంద్రమ్మ విధులకు హాజరు కావడం లేదని, మందులను అమ్మేసుకుంటుందని తప్పుడు ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలు వాస్తవం కాదని, ఆమెపై ఇప్పటిదాకా తమకు ఎలాంటి ఫిర్యాదులు లేవని డీఎంహెచ్‌వో, వైద్యాధికారులు ఆర్డీవోకు స్పష్టం చేశారు. దీంతో చంద్రమ్మ తమ పరువు తీసిందంటూ ఆమెను గ్రామంలో విధులకు అంగీకరించబోమని గ్రామ పెద్దలు భీష్మించారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఆ ఊరి వెల్‌నెస్ సెంటరులో విధులు నిర్వహించాలని చంద్రమ్మకు ఆర్డీవో సూచించారు. దీంతో గురువారం నుంచి చంద్రమ్మ వెల్‌నెస్ సెంటర్‌లో విధులకు వెళుతోంది. అయినప్పటికీ చంద్రమ్మ కుటుంబంపై వెలి మాత్రం కొనసాగుతూనే ఉంది. ఆ ఊళ్లో ఆమె ఇంటి వైపు ఎవరూ తొంగి చూడడం లేదు. బయటకు వెళ్లాలన్నా ఆటోల్లోనూ అనుమతించడం లేదు. ఆర్డీవో ఆదేశంతో చంద్రమ్మ భర్త వేటకెళ్లేందుకు గ్రామ పెద్దలు అనుమతించారు.
అంగన్వాడీలకూ వేలం పాటే..
ఆశా వర్కరు పోస్టును రూ.2 లక్షలకు వేలం పాట పెట్టిన గెద్దలపాడు పెద్దలు ఆ ఊళ్లోని అంగన్వాడీ ఉద్యోగాలకూ అదే పని చేశారు. ఆ గ్రామంలో 2014 నుంచి అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల్లో ఇద్దరు మహిళలు వేలంపాట దక్కించుకుని పని చేస్తున్నారు. ఆగస్టులో ఈ రెండు పోస్టులకు వేలం పాట నిర్వహించారు. ఆయా పోస్టుకు వేలం పాట ద్వారా రూ.90 వేల ధర నిర్వహించారు. భర్తలేని ఆమె ఆ సొమ్ము ఇచ్చుకోలేనని చెప్పింది. అలాగే అంగన్వాడీ టీచరు పోస్టుకు తొలుత రూ.1.80 లక్షలకు ఖరారు చేశామని, అంతకు మించి చెల్లిస్తే నిన్ను కొనసాగిస్తామని, లేకపోతే మరొకరికి రూ. 2 లక్షలకు ఇచ్చేస్తామని చెప్పారు.
ఈ మహిళలు ఆ మొత్తాన్ని చెల్లించకపోవడంతో మూడు రోజుల క్రితం నుంచి వీరిని అంగన్వాడీ స్కూలుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. పైగా ఆ స్కూలుకు తాళం వేసేశారు. చంద్రమ్మ వ్యవహారంపై అధికారులు సీరియస్ కావడంతో గ్రామ పెద్దలు ఈ అంగన్వాడీ ఉద్యోగులను గురువారం నుంచి మళ్లీ స్కూలుకు అనుమతించారు. ఇంకా గెద్దలపాడులో పెద్దలు డీలరు పోస్టుకు రూ.30 వేలు, మధ్యాహ్న భోజనం వండే మహిళను కొనసాగించడానికి రూ.10 వేలు, గదులు శుభ్రం చేసే మహిళ పోస్టుకు రూ.10 వేలు చొప్పున వేలం పాట ధరలు నిర్ణయించి అమలు చేస్తున్నారు.
రూ.లక్షలు కడితే ఉద్యోగంలో ఐదేళ్లు
ఆశావర్కరు, అంగన్వాడీ ఉద్యోగాలను వేలంపాటలో దక్కించుకున్న వారిని ఆ ఊరి పెద్దలు కేవలం ఐదేళ్ల వరకే ఉద్యోగంలో కొనసాగనిస్తారు. ఆ తర్వాత మళ్లీ వేలం పాట నిర్వహించి ఎవరు ఎక్కువకు పాడుకుంటే వారికే ఇస్తారు. ఇలా ఎన్నో ఏళ్ల నుంచి గెద్దలపాడులో అనాగరిక ఆచారం నిరాటంకంగా కొనసాగుతూ వస్తోంది. 21 మంది ఉండే ఆ గ్రామ పెద్దల్లో సర్పంచ్, ఎంపీటీసీలు కూడా ఉండడం మరో విశేషం! వేలం పాటలో వచ్చిన సొమ్మును గ్రామ పెద్దల సరదాలు, సంబరాలకు ఖర్చు పెడతారని చెబుతున్నారు.
ఆత్మహత్యే శరణ్యమనుకున్నాను..
‘‘ఆరుగురి కుటుంబ సభ్యులతో కుటుంబాన్ని పోషించుకుంటున్న నాకు ఆశావర్కరు ఉద్యోగం ద్వారా వచ్చే రూ.10 వేల జీతమే ఆధారం. ఊరి పెద్దలు చెప్పినట్టు ఉద్యోగానికి రూ.2 లక్షలు చెల్లించలేను. అందువల్ల ఊళ్లో మా కుటుంబాన్ని నిర్దాక్షిణ్యంగా వెలి వేశారు. ఊళ్లో ఎవరూ మాతో మాట్లాడడం లేదు. ఏ సరకులూ అమ్మడం లేదు. రూ.2 లక్షలు కట్టకపోతే ఉద్యోగం చేయనీయబోమని పెద్దలు తెగేసి చెప్పేశారు. నాకు ఉద్యోగం లేకపోతే బతకలేం. గత్యంతరం లేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. సాటి ఆశావర్కర్లు, సీఐటీయూ నాయకులు అండగా నిలవడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం. అధికారుల సూచనలతో వెల్‌నెస్ సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్నాను. ఇప్పటికీ మాపై వెలి కొనసాగుతోంది. ఎన్ని కష్టాలు ఎదురైనా నా ఉద్యోగాన్ని వదలను. నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది. వచ్చే నెల 18న కుమార్తె పెళ్లి ఉంది. ఆమె పెళ్లికి 1200 మందికి పైగా భోజనాలు పెట్టాలనుకున్నాం. ప్రస్తుతం వెలి ఉండడంతో 200 మందికి కుదించాం. మా కూతురు పెళ్లి ఎలా జరుగుతుందోనని బెంగగా ఉంది. ఇప్పటికే గతంలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడిని కలిశాను. నేడో, రేపో మరోసారి కలిసి తనకు న్యాయం చేయాలని కోరతాను’’ అని బాధితురాలు నుత్తు చంద్రమ్మ ‘ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో చెప్పారు. చంద్రమ్మకు న్యాయం జరిగే వరకు ఆమెకు అండగా ఉంటాం. ఊళ్లో ఉద్యోగాలకు వేలంపాట నిర్వహించే అనాగరిక ఆచారం నిర్మూలనయ్యే దాకా పోరాటం చేస్తాం అని శ్రీకాకుళం జిల్లా ఆశా వర్కర్ల యూనియన్ అధ్యక్షురాలు ధనలక్ష్మి తెలిపారు.
మరోవైపు గెద్దలపాడు పెద్దల అనాగరిక చర్యలపై చర్యలు తీసుకుని బాధిత మహిళ, ఆశావర్కర్ చంద్రమ్మకు న్యాయం చేయాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లకు లేఖ రాశారు.