ప్రజలతో నేరుగా బాబు, పవన్, లోకేష్..
ప్రభుత్వం ప్రజల వద్దకు వెళుతోంది. ఇది ఎంతకాలం.. మొదలు పెట్టినంత స్పీడుగా తుది వరకూ ఏదీ కొనసాగించని పాలకులు తెలుగు వారు. అందుకే ఆరంభ శూరత్వం కాకూడదు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌డీఏ ప్రభుత్వం కాస్త రూటు మార్చింది. గతానికి ఇప్పటికి భిన్నత్వం కనిపిస్తోంది. గతంలో ముఖ్యమంత్రిని కానీ, ఇతర మంత్రులను కానీ కలవాలంటే ప్రజలకు కష్టంగా ఉండేది. కానీ ఈ సారి అధికారం చేపట్టిన ఎన్‌డీఏ ప్రభుత్వం నేరుగా ప్రజల వద్దకే వెళుతోంది. గతంలో చాలా సార్లు ఈ ప్రయోగాలు చేసినా ఎక్కువగా ముందుకు సాగలేదు. పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు వారం రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. అక్కడ నాయకులు, మంత్రులు, కార్యకర్తలతో మమేకమయ్యారు. ప్రతి ఒక్కరితో ఓపిగ్గా ఫొటోలు దిగారు. అర్జీలు స్వీకరించారు. ఇకపై ప్రతి వారం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వస్తానని మాటిచ్చారు. ఆ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. అక్కడ కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించారు. మంత్రులు కూడా జిల్లాలో పార్టీ కార్యాలయాలకు వెళ్లాలని, కార్యకర్తలు, జిల్లా స్థాయి నాయకులకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఇకపై ప్రతి సోమవారం ప్రజల నుంచి అర్జీలు తీసుకునే కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించాలని కలెక్టర్‌లను ఆదేశించారు. తాను కూడా సోమవారం ప్రజలకు అందుబాటులో ఉండేలా చూస్తానని, ఎక్కడ అనువైన ప్రాంతమనేది పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
సచివాలయంలో కూడా అన్ని బ్లాకులను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఉద్యోగులను ఆప్యాయంగా పలకరించారు. ఎనిమిదేళ్లుగా తాము సచివాలయంలో పనిచేస్తున్నామని, మేమంతా రాజధానికి భూములు ఇచ్చిన రైతు కుటుంబాలకు చెందిన వారమని, మమ్మల్ని ఉద్యోగులుగా గుర్తించాలని హౌస్ కీపింగ్ సిబ్బంది విజ్నప్తి చేశారు.