కాదేదీ ప్రచారానికి అనర్హమంటే ఇదేనేమో..
ఎన్నికలొచ్చాయంటే ప్రతి పార్టీ అభ్యర్థి కూడా అన్ని అవకాశాలను తన ప్రచారానికి అనువుగా వాడుకుంటారు. ఈ విషయంలో టీడీపీ నేత బేబి నాయన మరింత జోరు కనబరుస్తున్నారు.
(శివారామ్)
విశాఖపట్నం: కవితకు కాదేదీ అనర్హమని మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టు.. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికన్నీ అర్హంగానే కనిపిస్తున్నాయి. మామూలు పెళ్లిళ్లయినా చివరకు శ్రీరామ చంద్రుడి పెళ్లి కూడా బాగా మైలేజ్ తెచ్చిపెడుతోంది. ఓట్ల కోసం వంద మంది కార్యకర్తలను వెంటపెట్టుకొని ఎర్రటి ఎండలో నినాదాలు చేస్తూ రోడ్ల మీద తిరగడం కంటే ఇలా పెళ్లిళ్లకు హాజరై ప్రచారం చేసుకుంటే బెటర్ అని అభ్యర్థులు భావిస్తున్నారు. హాయిగా ఏదో మండపంలోనో, ఏసీ హాలులోనో జరిగే పెళ్లికి వెళ్లి నాలుగు అక్షింతలు వేసి రెండు ఫొటోలకు ఫోజులిచ్చి ఆప్యాయంగా ‘ఏం బాబాయ్, ఏం తాతా’ అని పలకరిస్తే ఓట్లు వచ్చి పడిపోవా? అని భావిస్తున్నారు. ఇళ్ల దగ్గర కలవని ఓటర్లు, పల్లెటూర్లలో అయితే ఊరు ఊరు అక్కడే దొరకదా? అనే ఆలోచనలో ముందుకెళుతున్నారు. తాజాగా బొబ్బిలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, బొబ్బిలి చిన్నరాజు బేబీ నాయన అదే పని చేస్తున్నారు.
డజనుకుపైగా శ్రీరామ నవమి వేడుకలలో బేబీ నాయన
శ్రీరామనవమి సందర్భంగా బొబ్బిలి నియోజకవర్గంలో ఉన్న పలు రామాలయాలలో జరుగుతున్నటువంటి శ్రీరామనవమి ఉత్సవాలలో పాల్గొని రాములవారిని దర్శించుకున్నారు బేబీ నాయన. పనిలో పనిగా ఆ ఉత్సవాల్లకు హాజరైన వేలాది మంది భక్తులు కమ్ ఓటర్లను పలకరించేసి తన పని పూర్తి అయిందనిపించారు. బొబ్బిలి మున్సిపాలిటీలో గల తారకరామ కాలనీ ఆలయం, చిన్నబజారులోని అరకాల రామమందిరం, మెయిన్ మార్కెట్‌లోని రామమందిరం,
గోనవారి వీధిలో ఉన్న రామమందిరాల్లో జరిగిన పూజలు, రాముల వారి కళ్యాణాల్లో బేబి నాయన పాల్గొన్నారు. అంతటితో ఆగక రామభద్రపురం మండలంలో చింతలవలస గ్రామంలో ఉన్న రామమందిరం, తెర్లాం మండలంలో చిన్నయ్యపేట, అంట్లవార గ్రామాల్లో ఉన్న రామమందిరాలతో పాటు మరికొన్నింటికి హాజరై రామభక్తి చాటుకొని ఓటర్ల మనసు గెలుచుకున్నారు.
అప్పట్లో ఒకే రోజు 31 ముహూర్తాలు..
ముహూర్తాలు ఎక్కువగా ఉన్న ఏప్రిల్ మొదటి బుధవారం ఒక్కరోజే ఏకంగా నియోజకవర్గంలో జరిగిన 31 వివాహ కార్యక్రమాల్లో పాల్గొని రికార్డు సృష్టించారు. బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలోని కార్యక్రమాలతోపాటు బాగండి, సీతానగరం, బొబ్బిలి, రామభద్రాపురం మండలాల్లో జరిగిన పెళ్లిళ్లన్నింటికీ వెళ్లి వచ్చారు. ఒక రకంగా నియోజకవర్గంలో ఆయన హాజరు కాని పెళ్లి అంటూ లేదన్న మాటే.
చావులు, పరామర్శలకు కూడా..
మామూలు రోజుల్లోనే ప్రజలు బొబ్బిలి కోటకు వచ్చి శుభలేఖలు ఇచ్చి వెళుతుంటారు. కుదిరినవాటన్నింటికీ బేబీనాయన హాజరవుతుంటారు. ఇప్పుడు ఎన్నికల సీజన్ కావడం, ఆయనే అభ్యర్థి కావడంతో ఇలా కార్డు వస్తే అలా వెళ్లిపోతున్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో నేతలను, ముఖ్యలను పేరు పెట్టి పిలిచేంతటి పరిచయాలు ఉన్న ఆయనకు కార్యక్రమానికి వెళ్లిన తర్వాత త్వరగా ముగించుకొని అక్కడ నుంచి బయటపడడమే కాస్త ఇబ్బందిగా ఉందట. అయినప్పటికీ నియోజకవర్గంలో జరిగే అన్ని కార్యక్రమాలకు హాజరవుతూ తలలో నాలుకగా చలామణి అవుతున్నారు. అన్నట్లు కేవలం వివాహాలే కాదు, చావులు, పరామర్శలకు కూడా ఇలాగే బేబీ నాయన హాజరవుతుంటారు. మిగిలిన నేతలు బీబీ నాయనను చూసి 'మీ ఓపికకు జోహార్లు' అంటూ ఒక రకంగా అసూయ పడుతున్నారు.