SECI|సెకిలో ఇంత మతలబు ఉందని నాడు బాలినేని ఊహించ లేదా?

సెకి ఒప్పందంపై సంతకం చేయలేదు కాబట్టి ఆ మకిలీ నాకు అంటలేదు. లేదంటే అవినీతిలో నేనూ భాగస్వామినేనని మనసులో మాట బయట పెట్టారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.

Update: 2024-11-23 11:16 GMT

సెకి కుంభకోణం ఇప్పుడు రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఈ ఒప్పందం జరిగినప్పుడు విద్యుత్ శాఖ మంత్రిగా మాజీ సీఎం వైఎస్ జగన్ బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఆయన ఒక దిన పత్రికతో మాట్లాడుతూ నాడు అర్ధరాత్రి నాకు విద్యుద్ శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నుంచి ఫోన్ వచ్చింది. సెకి ఒప్పందంపై సంతకం చేయాలని కోరారు. నేను ఆ ఒప్పందం వివరాలు పూర్తిగా చదవకుండా సంతకం ఎలా పెడతానని చెప్పాను. అయితే రేపు జరిగే క్యాబినెట్ మీటింగ్ కు ఫైల్ పంపించాలని చెప్పారు.. అంటూ జగన్ పై వచ్చిన కుంభకోణం ఆరోపణలపై ఆశ్చర్య పోయారు. బాలినేని శ్రీనివాసరెడ్డి నిజంగా ఈ రాష్ట్రం కోసం ఈ మాటలు చెప్పారా? జగన్ ను మరి కాస్త ఇరికిద్దామని చెప్పారా? అనే చర్చ రాష్ట్రంలో మొదలైంది. సీఎం చంద్రబాబు ఈ వ్యవహారంపై దాటవేత ధోరణితో వ్యవహరించడం, కాలవ శ్రీనివాసులు, విష్ణుకుమార్ రాజులు జగన్ అవినీతి మితిమీరిందని వ్యాఖ్యానించడం చర్చనియాంశాలయ్యాయి.

బాలినేని అప్పుడప్పుడు ఇలా బాంబులు పేలుస్తాడు..

బాలినేని శ్రీనివాసరెడ్డి పెద్దగా మాట్లాడే వ్యక్తి కాదు. అప్పుడప్పుడూ ఇలా బాంబులు పేలుస్తారు. మొదటి నుంచి వివాద రహితునిగా పేరు ఉంది. తనవరకు వస్తే కాని నోరు విప్పరు. ఇంత పెద్ద కుంభకోణం జరుగుతుందని ఊహించలేదని అనటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఒప్పందం విషయంలో మంత్రికి, అదాని సంస్థ ప్రతినిధులకు మధ్య తప్పకుండా చర్చ జరిగి ఉంటుంది. సెకి నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తే ఎంతో కొంత పర్సెంటేజీలు ఉండి ఉంటాయని మంత్రి కూడా భావించి ఉండవచ్చు. పైగా 25 ఏళ్లపాటు విద్యుత్ సరఫరాకు సంబంధించిన ఒప్పందం. అయితే ఇంత భారీ మొత్తం ఆఫర్ వచ్చిందనే విషయాన్ని దర్యాప్తు సంస్థ బయట పెట్టాక ఆశ్చర్యపోతూ మనసులోని మాట వెల్లడించారు. తాను ఆర్థికంగా బాగా నష్టపోయినందునే వైఎస్సార్సీపీని వీడినట్లు పలుమార్లు చెప్పారు. ఇంత పెద్ద డీల్ మాట్లాడుకున్న వారు సంబంధిత మంత్రి గురించి ఎందుకు పట్టించుకోలేదు. జగన్ కూడా విద్యుత్ శాఖ మంత్రిగా మీరు సంతకం పెట్టాలని ఎందుకు బాలినేనిని పట్టుబట్టలేదు. అనే అంశాన్ని ఇప్పుడు విమర్శకులు లేవనెత్తుతున్నారు. అంటే బాలినేనికి అసలు విషయం తెలిస్తే భారీ మొత్తం మాట్లాడుకుని నా గురించి ఎందుకు ఆలోచించలేదని ప్రశ్నిస్తారేమోననే అనుమానంతోనే బాలినేని సంతకం పెట్టకపోయినా మంత్రి మండలి ఆమోదించి ఉంటుందనే అనుమానాన్ని విమర్శకులు వ్యక్తం చేస్తున్నారు. బాలినేనికి ఎటువంటి అనుమానం లేకుంటే ఒప్పందంపై ఎందుకు సంతకం పెట్టలేదు. నాడు ఈ ఒప్పందం వల్ల ఏదో భారీ ప్రయోజనం జగన్ ఆశించారని మాత్రం బాలినేని భావించి ఉండొచ్చని, అందుకే ఆయన సంతకం పెట్టకుండా తప్పుకున్నారనే చర్చ జరుగుతోంది.

సీఎం అనుకుంటే మంత్రి సంతకాల అవసరం ఉండదా?

ఏ ఒప్పందం జరగాలన్నా సంబంధిత మంత్రి ద్వారా ఆ ఒప్పందాన్ని చేసుకుంటారు. ఎందుకంటే ఆ మంత్రి పర్యవేక్షించే శాఖలకు సంబంధించి పూర్తి హక్కులు ఒక విధంగా ఆ శాఖ మంత్రికి ఉంటాయి. మంత్రిని పక్కనబెట్టి నేరుగా సీఎం చెప్పడం వల్ల ప్రభుత్వ ఉన్నతాధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి ఎంఓయూ కుదుర్చుకుంటారని ఈ సంఘటన రుజువు చేస్తోంది. నాడు బాలినేని వంటి మంత్రుల పవర్ కూడా పనికి రాకుండా పోయింది. బంధువు పవరే పనికి రాకుండా పోయిందంటే ఇక మిగిలిన మంత్రులు నామ మాత్రమేనని చెప్పాల్సి ఉంటుంది. అందుకే అప్పట్లో చాలా మంది మంత్రులు అసంతృప్తులు వ్యక్తం చేశారు. సీఎంఓపై అప్పట్లో ఒక విమర్శ కూడా ఉంది. ఏదైనా నేరుగా సీఎంవో నుంచి జరగాలని, అవినీతి సెంట్రలైజ్డ్ అయిందని నాడు ప్రతిపక్షం విమర్శలు గుప్పించింది. ఈ డీల్ చూస్తుంటే ప్రతి ఒప్పందం వెనుక ఇంటువంటిదేదో ఉందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా దర్యాప్తు సంస్థ విషయం బయట పెట్టబట్టి ఈ డీలింగ్ బయటకు వచ్చింది. లేదంటే ఎన్నేళ్లు అయినా డీల్ బయటపడే అవకాశమే లేదు.

విద్యుత్ చార్జీల పెంపును నాడు మంత్రి ఎందుకు వ్యతిరేకించలేదు?

నాటి విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నిజంగా ప్రజలపై ప్రేమ ఉన్నవారైతే విద్యుత్ చార్జీలు ఇష్టానుసారం పెంచుతుంటే ఎందుకు ప్రశ్నించలేదనే చర్చ కూడా ప్రస్తుతం జరుగుతోంది. ప్రజలపై అధిక భారం వేసి విద్యుత్ పై భారీ వ్యాపారం చేయడం మంచిది కాదని నాడు బాలినేని ప్రశ్నించి ఉండాల్సిందనే వాదన తెరపైకి వచ్చింది. విద్యుత్ చార్జీల పెంపు కూడా నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనేనా.. లేక ఎవరైనా అధికారుల ఆలోచనా.. అనేది కూడా బాలినేని వెల్లడించి ఉంటే బాగుండేది. ఎందుకంటే అధిక ధరలు పెట్టి సెకి నుంచి విద్యుత్ ను కొనుగోలు చేసి ఆ భారాన్ని ప్రజలపై వేయడం ఏమిటనే చర్చ కూడా మొదలైంది. విజయవాడకు సమీపంలోని ధర్మల్ పవర్ ప్రాజెక్టు (ఎన్టీపీసీ) రెండు రూయాల లోపు యూనిట్ విద్యుత్ ను ఇస్తామని చెప్పినా వినకుండా వేరే రాష్ట్రం నుంచి అడ్డగోలు ఒప్పందాలు చేసుకుని విద్యత్ కొనుగోలు చేసి ముడుపులు తీసుకోవడమే కాకుండా ప్రజలను ఎలా దోచుకోవచ్చో ప్రపంచానికి చాటి చెప్పిన జగన్ ప్రభుత్వంలో పనిచేసిన మంత్రి బాలినేని కూడా ఈ అవినీతి వ్యవహారంలో పరోక్ష్గంగా భాగస్వామి అయినట్లేనని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Tags:    

Similar News