కేంద్ర నిధులు సాధించడం హర్షనీయం.. సీఎంకి బొజ్జా దశరథరామిరెడ్డి లేఖ

రాష్ట్రంలో వెనకబడిన జిల్లాలకు బుందేల్ ఖండ్ తరహా ప్రత్యేక నిధులను రాబట్టాలని బొజ్జా దశరథరామిరెడ్డి కోరారు. శిథిలావస్థలో ఉన్న రాయలసీమ సాగునీటి రంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలన్నారు.

Update: 2024-08-31 11:08 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాపై ఆర్థిక భారం పడకుండా అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు కేంద్రం నుండి నిధుల కేటాయింపులు సాధించడంపై క్రియాశీలకంగా వ్యవహరించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారికి రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అభినందనలు తెలిపారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు కేంద్రం నిధుల కేటాయింపులు సాధించిన సందర్భంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రాయలసీమ సాగునీటి రంగ అభివృద్ధికి కార్యాచరణ చేపట్టాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు.

ఈ సందర్భంగా శనివారం నంద్యాల సమితి కార్యాలయంలో బొజ్జా మాట్లాడుతూ.. రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై మీ క్రియాశీల కార్యాచరణ వలననే కేంద్రం నుంచి నిధుల సమీకరణలో విజయం సాధించారు. అదే స్ఫూర్తితో శిథిలావస్థకు చేరిన రాయలసీమ సాగునీటి రంగాన్ని ముఖ్యమంత్రి గాడిన పెడతారన్న ఆశాభావాన్ని రాయలసీమ సమాజం ఆశిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ యోగ్యమైన భూమిలో 42 శాతం రాయలసీమ ప్రాంతంలో ఉన్నప్పటికీ, రాష్ట్ర సాగునీటి బడ్జెట్ లో కేవలం 15 శాతం నిధులే గత 10 సంవత్సరాలుగా ఖర్చు చేయడంతో నాలుగు దశాబ్దాలుగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులలో ఏమాత్రం పురోగతి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మించిన ప్రాజెక్టుల నిర్వహణకు కూడా నోచుకోకపోవడంతో సాగునీటి ప్రాజెక్టుల ఆధారంగా రాయలసీమలో పంటల సాగు “దినదిన గండం నూరేళ్ళ ఆయస్సు” లాగా కొనసాగుతున్నదనీ, దీనివలన రాయలసీమ సమాజం ఆర్థికంగా, సామాజికంగా తీవ్రంగా నష్టపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో..

1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాగునీటి బడ్జెట్ లో 42 శాతం నిధులు రాయలసీమకు కేటాయించడం.

2. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన వెనుకబడిన జిల్లాల బుందేల్ కండ్ తరహా ప్రత్యేక ప్యాకేజీ నిధులను కేంద్ర ప్రభుత్వం నుండి తక్షణమే సాధించడం.

3. అభివృద్ధి చెందిన ప్రాంతాలతో పాటుగా రాయలసీమ సమానాభివృద్ధి సాధించడానికి, కేంద్ర ప్రభుత్వం అమలు పరిచే ప్రధాన మంత్రి క్రిషి సించాయ్ యోజన నిధులను, రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ పర్ఫస్ వెహికల్ ద్వారా నిధులను, గ్రాంట్ లను సాధించడం.

4. రాయలసీమ సాంప్రదాయ వనరులైన చెరువుల పరిరక్షణ, నిర్మాణం, వాటిని వాగులు, వంకలు, నదులు, కాలువలతో అనుసంధానం చేపట్టడం. దీనితో పాటు పెన్నా నది పునరుజ్జీవనం, సామాజిక అటవీ అభివృద్ధి, పర్యవరణ పరిరక్షణను చేపట్టడం. ఒక నిర్ధిష్టమైన ప్రణాళికతో చేపట్టాల్సిన ఈ కార్యక్రమాలకు ప్రత్యేక సాంప్రదాయ వనరుల, పర్యావరణ పరిరక్షణ మిషన్ ను ఏర్పాటు చెయ్యడం లాంటి అంశాలపై క్రియాశీలకంగా నిర్ణయాలు తీసుకుని, తద్వారా రాయలసీమకు ముఖ్యమంత్రి అండగా వుండాలని రాయలసీమ సమాజం ఆశిస్తున్నదని తెలిపారు.

అన్ని రకాల వాణిజ్య, ఉద్యానవన పంటలు పండించే, విత్తనోత్పత్తి చేయగలిగే అన్ని వనురులు కలిగి, రాష్ట్రంలో 42 శాతం వ్యవసాయ యోగ్యమైన భూమి ఉన్న రాయలసీమలో సంపద సృష్టికి దోహదపడే పై కార్యక్రమాలను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని లేఖలో ముఖ్యమంత్రికి బొజ్జా విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News