Vijayawada Book Faire|విజయవాడలో పుస్తక ప్రియుల పండగ
బుక్ ఫెస్టివల్ ఈనెల 2 నుంచి 12 వరకు విజయవాడ నగరంలో ని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జరుగుతుంది. పుస్తకాలు కొనుగోలు చేసే వారికి మంచి అవకాశం.;
విజయవాడలో పుస్తక ప్రదర్శన చాలా ప్రసిద్ధి చెందింది. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ ప్రతి సంవత్సరం జనవరిలో నిర్వహిస్తుంది. పుస్తక ప్రదర్శన గతంలో పిడబ్ల్యుడీ గ్రౌండ్ లో జరిగేది. ప్రస్తుతం అక్కడ అంబేద్కర్ స్మృతివనం కట్టడంతో గత సంవత్సరం వేరే ప్రదేశంలో పెట్టారు. ఈ సంవత్సరం ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. పుస్తక ప్రదర్శన ప్రారంభోత్సవానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను ఆహ్వానించారు. ఆయన ఈనెల 2న సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తారు. వారితో పాటు కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కె శ్రీనివాస్ హాజరవుతారు.
ఇప్పటికే 200కు పైగా ప్రచురణ సంస్థలు స్టాల్స్ ఏర్పాటుకు పేర్లు నమోదు చేసుకున్నారు. 'విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం, ఏలూరు సహా చుట్టుపక్కల అన్ని ప్రాంతాల నుంచి పుస్తక ప్రియులు వేల సంఖ్యలో నిత్యం తరలి వస్తుంటారు. 11 రోజుల్లో కనీసం 10 లక్షల మంది పుస్తక ప్రియులు ఏటా తరలి వస్తుంటారు. ఈ మహోత్సవంలో పుస్తకాలు కొనుక్కునేందుకు ఏడాదంతా డబ్బులు దాచుకుని మరీ చాలామంది వస్తారు.'
పుస్తక మహోత్సవం ప్రాంగణం, వేదికలకు దివంగతులైన ప్రముఖుల పేర్లు పెట్టినట్లు పుస్తక మహోత్సవం కార్యదర్శి
మనోహర్‌నాయుడు తెలిపారు. రచయితలు గతంలో స్టాల్ ఇస్తామన్నా తీసుకునే వారు కాదు. ఈ సంవత్సరం మూడు స్టాల్స్ ఇవ్వాల్సిందిగా కోరారు.
రామకోటేశ్వరరావు ప్రాంగణం: పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి పిడికిటి రామకోటేశ్వరరావు పేరు పెట్టారు. ఈయన సాహితీ నవజీవన్ బుక్‌లింక్స్ అధినేత.
రామోజీరావు సాహిత్య వేదిక: ప్రధాన సాహిత్య వేదికకు రామోజీ గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు పేరు పెట్టారు. ఈ వేదికపై పుస్తకావిష్కరణలు, శత జయంతి సభలు, చర్చాగోష్ఠులు, సభలు జరుగుతాయి.
రతన్ టాటా ప్రతిభా వేదిక: ప్రాంగణంలో ఉండే ప్రతిభా వేదికకు రతన్‌టాటా పేరు పెట్టారు. పిల్లలకు సంబంధించిన ప్రదర్శనలు, కార్యక్రమాలు ఈ వేదికపై జరుగుతుంటాయి.
పుస్తక ప్రియుల పాదయాత్ర : నేటి తరానికి పఠనంపై ఆసక్తి పెంచేందుకు ఏటా నగరంలో నిర్వహించే పుస్తక ప్రియుల పాదయాత్రను జనవరి 6న సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తున్నారు. మొగల్రాజపురంలోని సిద్ధార్థ కళాశాల నుంచి ఆరంభించి.. పుస్తక మహోత్సవ ప్రాంగణానికి పాదయాత్ర చేరుకుంటుంది. సాహితీ ప్రముఖులు, పుస్తక ప్రియులు పాల్గొంటారు.
ప్రతి పుస్తకంపైనా 10శాతం రాయితీ : పుస్తక ప్రదర్శనలో ఉండే స్టాళ్లలో ప్రతి పుస్తకంపై తప్పనిసరిగా 10శాతం రాయితీ ఇస్తారు. పుస్తక మహోత్సవం నిబంధన ప్రకారం ప్రతి పుస్తకంపైనా రాయితీ ఉంటుంది. ప్రదర్శనకు వచ్చే వారందరికీ ప్రవేశం ఉచితం. ఎలాంటి రుసుము ఉండదు.
ముఖ్యమైన విషయాలు:
పుస్తక మహోత్సవం 35 సంవత్సరాలుగా జరుగుతోంది, కాబట్టి ఇది విజయవాడలో ఒక ముఖ్యమైన సాంస్కృతిక కార్యక్రమం.
ఇక్కడ అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి.
రచయితలు, కవులను కలవడానికి ఇది ఒక మంచి అవకాశం.