ప్రతి శనివారం ఏపీ విద్యార్థులకు పుస్తకాలు లేని విద్య

ఏపీ ప్రభుత్వం ప్రతి శనివారం స్కూలు విద్యార్థులు పుస్తకాలు మోసే భారాన్ని తగ్గించింది.;

Update: 2025-03-24 13:03 GMT

నో స్కూల్ బ్యాగ్ డే అనేది విద్యార్థులపై పుస్తకాల బరువును తగ్గించడానికి, వారిలో సృజనాత్మకతను పెంపొందించడానికి ప్రవేశపెట్టిన ఒక వినూత్నమైన కార్యక్రమం. ఈ విధానం వల్ల విద్యార్థులు పాఠశాలలకు పుస్తకాలతో నిండిన బరువైన బ్యాగులు మోసుకుని రావలసిన అవసరం లేదు.

ఈ నో బ్యాగ్ డే రోజున విద్యార్థులకు వివిధ రకాలైన విద్యాపరమైన, వినోదపరమైన కార్యక్రమాలను నిర్వహిస్తారు. వీటిలో క్విజ్‌లు, ఆటలు, పాటలు, డ్యాన్స్, డ్రామాలు, చిత్రలేఖనం, చేతిపనులు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు ఉంటాయి. విద్యార్థులలో ఒత్తిడిని తగ్గించి వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, వారిలో సృజనాత్మకతను, ఆలోచనా శక్తిని పెంపొందిస్తుంది. విద్యార్థులలో సామాజిక స్పృహను, విద్యాపరమైన, వినోదపరమైన అనుభవాన్ని అందిస్తుంది.

కేంద్ర విద్యాశాఖ సిద్ధం

పాఠశాల విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించి ఆహ్లాదం నింపేందుకు, ప్రాక్టికల్ పాఠాలు నేర్పేందుకు ఉద్దేశించిన బ్యాగుల్లేని బడి రోజులను అమలు చేయడానికి కేంద్ర విద్యాశాఖ సిద్ధమైంది. తొలుత 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఏటా 10 రోజుల చొప్పున అమలు చేయనుంది. జాతీయ విద్యావిధానం అమలై 4ఏళ్లైన సందర్భంగా NCERT అనుబంధ విభాగం రూపొందించిన మార్గదర్శకాలను కేంద్రం నోటిఫై చేసింది. మార్గదర్శకాల ప్రకారం విద్యార్థి బ్యాగుల్లేని రోజుల్లో కార్పెంటరీ, ఎలక్ట్రిక్ వర్క్, మెటల్ వర్క్, వంటి వృత్తి విద్య కోర్సును నేర్చుకుంటారు.

అవసరాన్ని బట్టి ఇండోర్, అవుట్ డోర్ కార్యకలాపాలను నిర్ణయించవచ్చు. బ్యాగుల్లేని రోజులను విద్యా సంవత్సరంలో ఎన్ని స్లాట్లుగా అయినా విభజించచ్చు. కూరగాయల మార్కెట్ , సోలార్ విద్యుత్ పార్క్ , బయోగ్యాస్ ప్లాంట్ సందర్శన, దాతృత్వ పర్యటన, డూప్లింగ్, పతంగుల తయారీ, ఎగరవేత, పుస్తక ప్రదర్శన, చెట్ల కింద కూర్చోవడం వంటివి చేపట్టవచ్చు.

జాతీయ విద్యా విధానానికి నాలుగేళ్లయిన సందర్భంగా 25 భారతీయ భాషల్లో టీవీ ఛానళ్లను కేంద్రం ప్రారంభించింది. కెరీర్ గైడెన్స్, ఉపాధ్యాయులకు బ్రెయిలీ, ఆడియో బుక్స్ ద్వారా ప్రామాణిక శిక్షణ పద్ధతులు వంటి ప్రాజెక్టులను ప్రకటించింది.

ప్రతి శనివారం నో బ్యాగ్ డే

రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు ప్రస్తుతం ప్రతి నెల మూడో శనివారం నో బ్యాగ్ డే అమలు చేస్తుండగా... ఇకపై దీనిని ప్రతి శనివారం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి శనివారం నో బ్యాగ్ డేను అమలు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సమగ్ర వికాసమే లక్ష్యంగా ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. అందులో భాగంగానే ‘నో బ్యాగ్‌ డే’ అమలు చేస్తోంది. ఆ రోజు విద్యార్థులకు క్విజ్లు, సమకాలీన అంశాలపై డిబేట్లు, సదస్సులు, క్రీడలు, వివిధ పోటీలు నిర్వహిస్తామని లోకేశ్ తెలిపారు.

నో బ్యాగ్ డే పై వీడియోలు

నో బ్యాగ్ డే వల్ల విద్యార్థులకు కలుగుతున్న ప్రయోనాలపై వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తెలిపిన విశేషాలతో కూడిన వీడియోను లోకేశ్ షేర్ చేశారు. అయితే ఈ నిర్ణయాన్ని పలువురు నెటిజన్లు సైతం అభినందిస్తున్నారు. ఇదిలాఉండగా.. ప్రస్తుతం నెలలో మూడో శనివారం నో బ్యాగ్‌ డేగా అమలు చేస్తున్నారు. అయితే కొన్నిచోట్ల అది సరిగా అమలు కావడం లేదనే విమర్శ ఉంది. ఈ ఏడాది జనవరిలో మంత్రి నారా లోకేష్ పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యపై జరిగిన సమీక్షలో పాఠశాలల్లో ప్రతి శనివారం నో బ్యాగ్ డే అమలు చేయాలని నిర్ణయించారు. విద్యార్థుల కోసం కో కరిక్యులమ్ రూపొందించాలని కూడా మంత్రి నారా లోకేష్ అధికారులను కోరారు.

పిల్లలపై పుస్తకాల భారం తగ్గించడం చాలా మంచిది

పిల్లలపై పుస్తకాల బరువు తగ్గించడం వల్ల పుస్తకాలు మోయాలనే బాధ వారిలో తప్పుతుంది. ఆ రోజు క్లాసులో ఏ పుస్తకాల్లోని అంశాలు చెబుతారో అవే పుస్తకాలు తీసుకు వెళితే సరిపోతుంది. ఆరు నుంచి పదో తరగతి విద్యార్థుకు పుస్తకాల బరువు చాలా ఎక్కువగా ఉంటుంది. సెమిస్టర్ ప్రకారం పుస్తకాలు రూపొందిస్తే బరువు తగ్గుతుందని ఒంగోలుకు చెందిన పదోతరగతి విద్యార్థిని గడ్డం విజయలక్ష్మి తల్లి పార్వతి తెలిపారు.

పుస్తకాలు లేకుండా చదువులేమిటి?

పుస్తకాలు లేకుండా చదువులు ఏమిటని తల్లిదండ్రులు కొందరు పిల్లలకు పుస్తకాలు ఇచ్చి స్కూలుకు పంపిస్తున్నారని, అటువంటి వారికి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానాలు తెలియాల్సి ఉందని యర్రగొండపాలెం ఎంఈవో పెద్దీటి ఆంజనేయులు తెలిపారు. ఉపాధ్యాయులు తల్లిదండ్రుల్లో అవేర్ నెస్ తీసుకొస్తున్నారన్నారు.

విద్యార్థి సంఘాల హర్షం

విద్యార్థుల మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థుల మానసిక ఒత్తిడిని తగ్గించడం, బడి అంటే భయాన్ని పోగొట్టడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న మంత్రి నారా లోకేష్ జనవరి నెలలో కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ప్రతి శనివారం నో బ్యాగ్ డే గా ప్రకటించి విద్యార్థులకు కో కరిక్యులం యాక్టివిటీస్ రూపొందించాలని సంబంధిత విద్యాశాఖ అధికారులను మంత్రి అప్పుడు ఆదేశించారు. ఈ ఆదేశాలు అమలైతే ప్రతి శనివారం విద్యార్థులు పాఠశాలకు పుస్తకాల బరువులతో వెళ్లాల్సిన అవసరం ఉండదు.

ఉన్నత పాఠశాల స్థాయి చదువుల కోసం విద్యార్థులు పుస్తకాల రూపంలో అధిక బరువులను మోస్తున్న పరిస్థితి. వారంలో ఆరు రోజులు విద్యార్థులకు ఏకధాటిగా తరగతులు నిర్వహిస్తారు. ఆదివారం రోజు సెలవు దినం కావడంతో, ఆ రోజున విద్యార్థులు తమకు అప్పగించిన హోంవర్క్ పూర్తి చేసే పనిలో ఉంటారని చెప్పవచ్చు. అలాగే తమకు దొరికిన కొద్ది సమయంలో ఆటపాటలకు సమయాన్ని కేటాయిస్తారు. ఇటువంటి పరిస్థితులను అర్థం చేసుకున్న కూటమి ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

రెడీ అవుతున్న పాఠశాల విద్య సామగ్రి

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త యూనిఫారాలు అందించనున్నారు. ఈ కొత్త యూనిఫార్మ్‌తో పాటు స్కూల్ బ్యాగ్, బెల్ట్ వంటి విద్యా సామగ్రిని కూడా ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. విద్యార్థులకు మరింత గౌరవప్రదమైన రూపాన్ని అందించడానికి, విద్యా ప్రాముఖ్యతను మరింత పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి తెలిపారు. ఈ కొత్త యూనిఫార్మ్ నమూనాలను శాసనసభలో స్వయంగా ప్రదర్శించిన మంత్రి, విద్యార్థుల కోసం క్వాలిటీ ముడి సామాగ్రిని ఉపయోగించి వీటిని రూపొందించినట్లు వివరించారు. పాత విద్యా విధానంలో ఉన్న లోపాలను అధిగమించి, మరింత సమర్థవంతమైన పద్ధతిని అమలు చేయడమే లక్ష్యమని తెలిపారు.

సెమిస్టర్ విధానం

విద్యార్థుల భుజాలపై పుస్తకాల భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాఠశాలల్లో సెమిస్టర్ విధానం అమలులోకి రానుంది. విద్యార్థులు ఒకేసారి ఎక్కువ పుస్తకాలు మోసే అవసరం లేకుండా, ఒక్కో సెమిస్టర్‌కు అవసరమైన పుస్తకాలను మాత్రమే అందించనున్నారు. ముఖ్యంగా ఒకటో తరగతి విద్యార్థులకు ఒక్కో సెమిస్టర్‌కు కేవలం రెండు పుస్తకాలే ఉంటాయి. ఇది విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడమే కాకుండా, వారికి పాఠాలను మెరుగ్గా అర్థం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ విధానం వల్ల విద్యార్థులకు క్రమశిక్షణ పెరుగుతుందని, మరింత ఆసక్తితో చదవగలుగుతారని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఉపాధ్యాయులకు శిక్షణ

విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించాలంటే ఉపాధ్యాయులు కూడా నవీన శిక్షణ పొందడం అత్యవసరం. అందుకే ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా శిక్షణా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. అంతేకాదు, వారిని ఇతర దేశాలకు పంపించి అక్కడి విద్యా విధానాలను అధ్యయనం చేసే అవకాశం కల్పించనున్నారు.

విద్యలో మరిన్ని సంస్కరణలు

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మరిన్ని మార్పులు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లోకేష్ తెలిపారు. పాఠశాలల్లో యాక్టివ్ లెర్నింగ్ విధానాన్ని ప్రోత్సహిస్తూ, విద్యార్థుల మెరుగైన అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇకపై పాఠ్యపుస్తకాలపై రాజకీయ నాయకుల ఫొటోలు ఉండకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

2024-25 విద్యా సంవత్సరంలో 62,023 పాఠశాలలు ఉండగా వీటిలో ప్రభుత్వ యాజమాన్యంలో 44,954 ఉన్నాయి. ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలో 15,784 స్కూల్స్ ఉన్నాయి. 1225 ఎయిడెడ్ పాఠశాలలు ప్రత్యేకించి ఉన్నాయి. కేంద్రం ద్వారా మరో 60 పాఠశాలలు నడుస్తున్నాయి. మొత్తం సుమారు 36 లక్షల మంది విద్యార్థులకు కిట్స్ పంపిణీ చేయాల్సి ఉంటుంది.

2025-26 విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్యను ప్రభుత్వ స్కూళ్లలో పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రైవేట్ స్కూళ్లతో సమానంగా అన్ని సౌకర్యాలతో విద్యను ప్రభుత్వం అందిస్తున్నందున ఉపాధ్యాయులు పూర్తి బాధ్యత తీసుకుని విద్యార్థుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం ఆదేశించింది.

Tags:    

Similar News