అటు కృష్ణమ్మ.. ఇటు గోదావరి.. పరుగులు

కృష్ణానదీ పరివాహక ప్రాంతంలోని శ్రీశైలం రిజర్వాయర్ కు పెద్దఎత్తున నీరు వస్తోంది. అదేసమయంలో గోదావరి నది కూడా ఉరకలెత్తుతోంది.;

Update: 2025-07-12 05:54 GMT
Godavari Barrage at Dhavaleswaram

ఆంధ్రప్రదేశ్ లో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు రాష్ట్రంలోని పలు జిల్లాలు వర్షాభావంతో అల్లాడుతుంటే మరోవైపు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు కృష్ణా, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కృష్ణానదీ పరివాహక ప్రాంతంలోని శ్రీశైలం రిజర్వాయర్ కు పెద్దఎత్తున నీరు వస్తోంది. అదేసమయంలో గోదావరి నది కూడా ఉరకలెత్తుతోంది.

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో వరద ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద 10 అడుగుల నీటిమట్టం ఉండగా.. బ్యారేజి నుంచి 5లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం 11.75 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.

కృష్ణమ్మ పరుగులు...

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. శుక్రవారం జూరాల, సుంకేసుల నుంచి 1,41,105 క్యూసెక్కుల వరద వస్తోంది. జలాశయం 3 గేట్లను 10 అడుగుల మేర పైకెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.


శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 882.90 అడుగులు నమోదైంది. శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటినిల్వ 215.807 టీఎంసీలు. ప్రస్తుతం 203.89 టీఎంసీలుగా నమోదైంది.

కుడి, ఎడమ జల విద్యుత్తు కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుత్తు ఉత్పత్తి జరుగుతోంది. స్పిల్‌వే ద్వారా 1,48,864 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌కు 20వేల క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం పెరుగుతుండటంతో హంద్రీనీవా ప్రధాన కాల్వకు జూలై నెల 15 నుంచి నీటిని ఎత్తిపోయాలని అధికారులు నిర్ణయించారు. ప్రధాన కాల్వలో 3,850 క్యూసెక్కులు వెళ్లేలా సిద్ధం చేశారు.

హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌) ప్రాజెక్టు పరిధిలోని మల్యాల నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ 40 టీఎంసీలను లిఫ్ట్ చేయనున్నారు. 554 కి.మీ. మేర వరద జలాలు ప్రవహించి చిత్తూరు జిల్లా అడివిపల్లి జలాశయానికి అవి చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News