షర్మిలక్క గెలుపుపై తమ్ముళ్ల బెట్టింగ్‌లు
కడపలో అక్కా.. తమ్ముళ్ల పోటీపై బెట్టింగ్‌లు ఊపందుకున్నాయి. ఎన్నికలకు రెండు వారాల ముందే బెట్టింగ్‌లు చర్చగా మారింది
Byline : The Federal
Update: 2024-05-01 13:53 GMT
కడప పార్లమెంట్ ఎన్నికపై రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది కడప పార్లమెంట్ నియోజక వర్గం. ఈ నియోజక వర్గం నుంచి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల పోటీలో ఉండగా, వైఎస్‌ఆర్‌సీపీ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి పోటీలో ఉన్నారు.
అక్క గెలుస్తుందా.. తమ్ముడు గెలుస్తాడా
అక్క షర్మిల గెలుస్తుందని కొందరు బెట్టింగ్‌లు కడుతుంటే.. లేదు తమ్ముడు అవినాష్‌రెడ్డి గెలుస్తారని మరి కొందరు బెట్టింగ్‌లు కడుతున్నారు. కడప జిల్లాలో ప్రధానంగా ఈ బెట్టింగ్‌ల జోరందుకుంది. ఇప్పటికి రూ. 10వేల నుంచి రూ. 1లక్షల వరకు పలువురు బెట్టింగ్‌లకు దిగినట్టు స్థానికులు చర్చించుకుంటున్నారు.
కడప జిల్లాలో ఇప్పటి వరకు వార్ ఒన్‌సైడే నడిచింది. ఈ సారి ఎన్నికల్లో మాత్రం ఒకే ఇంట్లో వార్ నడుస్తోంది. ఆ ఇల్లు వైఎస్‌ఆర్ కుటుంబం కావడం విశేషం. నిజానికి వార్ ఒన్‌గా ఉండే కడప గడపలో ఈ సారి మాత్రం వార్ ఏ సైడు అనేది అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. పోటీ మాత్రం రసవత్తరంగా ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు.
కడప అనగానే గురొచ్చేది వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. 1978 నుంచి కడపను వైఎస్‌ఆర్ తన కేరాఫ్ అడ్రస్సుగా మార్చుకున్నారు. కడప, పులివెందుల రెండు చోట్ల ఎక్కడ చూసినా ఆయనే కనిపిస్తారు. అసెంబ్లీకి పోటీ చేసినా, పార్లమెంట్‌కు పోటీ చేసినా, గెలుపు ఆయనదే. కడప పార్లమెంట్ స్థానంలో 1984–89 కాలం తప్ప తక్కిన అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 1989, 1991, 1996, 1998 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గెలవగా, 1999, 2004 ఎన్నికల్లో ఆయన సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి గెలిచారు. 2009 ఎన్నికల్లో వైఎస్ జగన్ విజయం సాధించగా, 2014,2019 ఎన్నికల్లో వైఎస్ అవినాష్‌రెడ్డి విజయం సాధించారు.
2024 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ తరపున సిట్టింగ్ ఎంపీ అవినాష్‌రెడ్డి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ నుంచి వైఎస్ షర్మిల రంగంలో ఉన్నారు. టీడీపీ నుంచి చడిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి రంగంలో ఉన్నారు. ప్రధానంగా చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య కేసును ప్రచారం చేస్తున్న షర్మిల, ఆమె తరఫున ప్రచారం చేస్తున్న సోదరి సునీత, ఇప్పుడు కడపలో చర్చలకు కేంద్ర బిందువయ్యారు. తండ్రి హత్య కేసులో నిందితుడుగా ఉన్న అవినాష్‌కు జగన్ టికెట్ ఇవ్వడం దారుణమంటున్నారు. ఈ ఎన్నికల్లో షర్మిల గెలుపు సాధ్యమే అంటూ జోరుగా ప్రచారం కూడా సాగుతోంది. అయితే వైఎస్‌ఆర్ అభిమానులు మాత్రం గెలిచేది ఎవరైనా పదవి మాత్రం వైఎస్‌ఆర్ కుటుంబం నుంచి బయటకు పోదు కదా అంటున్నారు. ఈ బెట్టింగుల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా జోరందుకునే అవకాశం కూడా లేకపోలేదు.