బెజవాడలో అన్నదమ్ముల సవాల్
విజయవాడ పార్లమెంట్ కు అన్నదమ్ముల పోటీ హాట్ టాపిక్‌గా మారింది. తెరచాటు నుంచి సోదరుడి విజయం కోసం కష్టపడిన తమ్ముడు అన్నపై పోటీకి సిద్దమయ్యాడు.;
By : The Federal
Update: 2024-03-18 07:10 GMT
జి.విజయ కుమార్
వేర్వేరు పార్టీల నుంచి వీరు బరీలోకి దిగనున్నారు. ఒకరు రాజకీయ భిక్ష పెట్టిన తల్లి లాంటి పార్టీని కాదనుకొని పార్టీ మారి అభ్యర్థిగా తెరపైకి రాగా మరొకరు తన సోదరుడ్ని సవాల్ చేస్తూ పార్టీ ఎందుకు మారావని నిలదీస్తూ తొలి నుంచి నమ్ముకున్న పార్టీ క్యాండిడేట్‌గా నిలబడనున్నారు. వారే కేశినేని సోదరులు. కుటుంబంలో జరిగిన ఆస్తి గొడవలు వారిని విడదీసాయి. వ్యాపారాల్లో వచ్చిన బేదాభిప్రాయాలు వారి ఎడబాటుకు కారణమయ్యాయి. అన్న పార్టీని విభేదించడాన్ని కూడా తమ్ముడు జీర్ణించుకోలేక పోయారు. అవి ఇద్దరి మధ్య కక్షలకు దారి తీసాయి. దీంతో వారు ప్రత్యర్థులుగా మారి తాడో పేడో తేల్చుకునేందుకు రంగంలోకి దిగనున్నారు.
అన్న ఎంట్రీ ఇలా..
కేశినేని నాని వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2014కి ముందు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని ఆయన వారి కుటుంబ సభ్యుల మధ్య ఉంచారు. ఆ నిర్ణయాన్ని వాళ్లు కాదన లేదు. కుటుంబమంతా ఏక తాటిపైకి వచ్చి ఆయనను బలపరిచారు. దీంతో ఆయన రంగంలోకి దిగారు. 2014 ఎన్నికలతో పాటు 2019 ఎన్నికల్లో కూడా గెలుపొందారు. అలా కుటుంబం అంతా ఆయన కోసం పని చేసి ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించింది.
అడ్డం తిరిగిన కుటుంబం
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలు కావడం, వైఎస్‌ఆర్‌సీపీ అధిక సీట్లు కైవసం చేసుకోవడం, ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం చకచక జరిగి పోయాయి. దీంతో ఒక్క సారిగా ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ సినారియో ఒక్క సారిగా మారి పోయింది. అధికారంలో ఉన్న పార్టీకి జైకొట్టేందుకు ప్రతిపక్షానికి చెందిన నాయకులు సిద్ధమయ్యారు. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీలోకి కొంత మంది వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపిలు జంప్ అయ్యారు. వారి వారి వ్యాపార లావాదేవీలు ఎక్కడ దెబ్బతింటాయోమోనని అధికార పార్టీల వైపు చూడటం రివాజుగా మారింది. ఇదే సీన్ 2019లో కూడా రిపీట్ అయ్యింది. అయితే కొంత మంది నేరుగా వైఎస్‌ఆర్‌సీపీకి మద్ధతు ప్రకటించగా.. మరి కొందరు బయట పడకుండా మద్దతు దారులుగా కొనసాగారు. వారిలో కేశినేని నాని కూడా ఉన్నారని ఆప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. దీనికి తోడు విజయవాడ స్థానిక నేతల్లో కూడా ఆయనపై వ్యతిరేకత నెలకొనడం, గ్రూపులుగా ఏర్పడటం వంటి సమస్యల నేపథ్యంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పంగా మారుతూ వచ్చాయి. అయితే ఇది ముదిరి పాకాన పడటంతో కేశినేని నాని పార్టీ మారారు. ముందుగా కుమార్తెను కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయించారు. తరువాత ఎంపి పదవితో పాటు టీడీపీకి రాజీనామా చేసి ఆయన కుమార్తెతో కలిసి ఇటీవల సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కేశినేని నానినే విజయవాడ పార్లమెంట్ వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా జగన్ రంగంలోకి దింపారు.
సేవా కార్యక్రమాల ద్వారా చిన్ని తెరపైకి
తన అన్న కేశినేని నాని గెలుపు కోసం తెర వెనుక ఉండి చక్రం తిప్పిన కేశినేని చిన్నీ ఒక ట్రస్టు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలకు దగ్గరయ్యేందుకు బాట వేసుకున్నారు. హైదరాబాద్‌లో వ్యాపారం చేసుకునే చిన్నీ తన అన్న కేశినేని నాని వల్ల కుటుంబంలోను, తన పార్టీలోను నెలకొన్న పరిణామాల నేపథ్యంలో తానే ప్రత్యక్షంగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు కేశినేని చిన్నీ. అందులో భాగంగా ఏకంగా ఎంపి స్థానంపైనే కన్నేశారు. ఎలాగైనా దక్కించుకోవాలని భావించారు. తన వ్యాపారాలను అక్కడ కొనసాగిస్తూనే విజయవాడ పార్లమెంట్ పరిధిలో సేవా కార్యక్రమాలను చేపట్టాలనుకున్నారు. ఆ విధంగా గత మూడేళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎన్టీఆర్ జిల్లాలో కీలకమైన టీడీపీ నేతల్లో ఒకరుగా ఎదిగారు. తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దృష్టిని ఆకర్షించారు. తిరువూరులో చంద్రబాబు సభను సక్సెస్ చేయించారు. కేశినేని నాని టీడీపీకి రాజీనామా చేసి వైఎస్‌ఆర్‌సీపీలోకి వెళ్లడం ఆ పార్టీ నుంచే నాని ఎంపి అభ్యర్థిగా ఖరారు అయిన నేపథ్యంలో నానిని ఢీ కొట్టాలంటే చిన్నీనే కరెక్ట్ అనే నిర్ణయానికి వచ్చినట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. దీంతో చిన్నీ పేరును ఖరారు చేయనున్నట్లు టీడీపీ ముఖ్య నాయకులు చెబుతున్నారు.