సముద్రంలో బంకర్ పేలుళ్లు..అబ్బుర పరిచిన నేవీ విన్యాసాలు
హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, మనవడు దేవాన్ష్.;
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ సముద్ర తీరం జన సంద్రంగా మారింది. సముద్ర తీరంలో నిర్వహించిన నేవీ విన్యాసాలను తిలకించేందుకు భారీగా తరలి వచ్చారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, మనవడు దేవాన్ష్ ఈ విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు. నేవీ డే సందర్భంగా శనివారం విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో భారత నౌకాదళ వాయు విభాగం ఆధ్వర్యంలో సాహసోపేత విన్యాసాలు చేపట్టారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. భారత నౌకాదళ పాటవం, పరాక్రమాన్ని విన్యాసాల్లో నేవీ దళాలు ప్రదర్శించాయి. దాదాపు ఎనిమిది వేల అడుగుల ఎత్తు నుంచి పారచ్యూట్ సాయంతో జాతీయ జెండాతో పాటు నేవీ జెండాను ఎగురవేసి తమ సాహసాలను ప్రదర్శించడంతో పాటు ప్రజలను అలరించారు. ఉగ్రవాదుల చెర నుంచి బంధీలను రక్షించే క్రమాన్ని విన్యాసాల ద్వారా ప్రదర్శించిన తీరు సందర్శకులను ఆకట్టుకుంది. యుద్ధ విన్యాసాలు అబ్బుర పరిచాయి. సముద్రంలో చిక్కుకున్న వారిని హెలిక్యాప్టర్ల ద్వారా రక్షించే విధానం కూడా చూపరులను కట్టిపడేసింది. కళ్లార్పకుండా విన్యాసాలను చూస్తూ ఉండి పోయారు. విన్యాసాలను చూస్తూ చలించిపోయిన సీఎం చంద్రబాబు చప్పట్లతో నేవీ సిబ్బందిని అభినందించారు. సముద్రంలో నిర్వహించిన బంకర్ పేలుళ్లు అయితే సందర్శకులను కట్టిపడేశాయి. విశాఖ సముద్ర తీరంలో యుద్ధ విమానాలు, నౌకలు, హెలిక్యాప్టర్లు వాటి ప్రదర్శనలు సందర్శకులను అలరించాయి.