జగనన్న ఇళ్ల పట్టాల్లో స్థలం చూపరా? సీపీఎం

జగనన్న ఇళ్ల పట్టాల్లో అధికారులు పట్టాలు ఇచ్చి స్థలం చూపలేదని సీపీఎం నాయకులు ఆరోపించారు. సోమవారం వారు జిల్లా కలెక్టర్ ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందించారు.

Update: 2024-02-05 15:05 GMT

కరకంబాడి ప్రాంతంలో వారం రోజుల నుంచి ఇళ్ల స్థలాల కొరకు రేయింబవళ్ళు పోరాడుతున్న పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చి ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందారపు మురళి, అంగేరి పుల్లయ్య జిల్లా కలెక్టర్ లక్ష్మీ షాను కోరారు.

సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ను కలెక్టర్ ఛాంబర్ లో కలిసి ఇళ్ల స్థలాలకై పోరాడుతున్న పేదల గురించి ప్రస్తావించారు. కరకంబాడి, రేణిగుంట చుట్టుపక్కల ప్రాంతాలలో వేలాదిమంది ప్రజలకు జగనన్న ఇళ్ల పట్టాలను ఇచ్చి స్థలం చూపలేదని ఆరోపించారు.

ఈ ప్రాంతంలో చిన్న, చిన్న పనులు చేసుకుంటున్న పేదలకు ఎక్కడో దూర ప్రాంతంలో స్థలాలు ఇచ్చారని, ఆ ప్రాంతంలో కనీస సౌకర్యాలు కూడా లేవన్నారు.ఈ కారణంగా పేదలు తమ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూములు ఇవ్వాలని కోరుతున్నారని కలెక్టర్ కు నేతలు విన్నవించారు.

కరకంబాడి ప్రాంతంలో పదివేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు ఉన్నాయని, ఇందులో గణనీయమైన భాగం భూబకాసురులు ఆక్రమించి సొమ్ము చేసుకున్నారని, ఆఖరుకు స్కూల్ ఆట స్థలాలను సైతం విడవకుండా ఆక్రమించారని కలెక్టర్ కు వాటి వివరాలను అందించారు. కరకంబాడి వద్ద పేదలు ఆక్రమించుకున్న స్థలం సిద్దుల రవి అనే వ్యక్తి అధీనంలో ఉందని, పేరుకు ప్రభుత్వ భూమైన దానిపై నియంత్రణ రవి దేనని వారు ఆరోపించారు.

రవి గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో మట్టిని, మైనింగ్ ను తరలిస్తూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నా.. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రాంతంలో అనధికారికంగా అనేక కట్టడాలు నిర్మాణం చేశారని, ఆఖరుకు జేసీబీలు పెట్టి పెద్ద ఎత్తున తవ్వేస్తున్నా అధికారులు స్పందించకపోవడం దారుణమని విమర్శించారు.

అర్హులైన పేదలకు 125 ఎకరాల భూమిని పంచాలని, సమస్య పరిష్కారానికి కలెక్టర్ జోక్యం చేసుకోవాలని వారు విన్నవించారు. రేణిగుంట, కరకంబాడి ప్రాంతాలలో కొందరు రాజకీయ నాయకులు ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్నారని, పేదల ఇళ్ల స్థలాలను దౌర్జన్యంగా అమ్మేస్తున్నారని ఆరోపించారు.

ప్రభుత్వ భూములను ప్లాట్లు గా వేసి అమ్మేస్తున్నా అధికారులు పట్టించుకోలేదని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. రేణిగుంట ఎమ్మార్వో కార్యాలయం పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని ఒక్కో ప్లాటు రూ.10 నుంచి రూ.20 లక్షల రూపాయల వరకు వసూలు చేసే అమ్ముతున్నారని, అయినా అధికారుల నుంచి స్పందన లేకపోవడం అన్యాయమని, కలెక్టర్ జోక్యం చేసుకొని సమస్య పరిష్కారానికి తోడ్పడాలని వారు విజ్ఞప్తి చేశారు.

శ్రీ కాళహస్తి నియోజకవర్గంలో భూదందాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయని, పేదలకు సెంటు భూమి అడిగితే సవా లక్ష అడ్డంకులు సృష్టిస్తున్నారని కలెక్టర్ జోక్యంతో పేదలకు న్యాయం జరిగేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

కలెక్టర్ లక్ష్మి షా మాట్లాడుతూ.. అర్హులైన వారికి న్యాయం చేస్తామని దరఖాస్తు ఇచ్చిన 90 రోజుల్లో పరిష్కారం చేయడం చట్టంలో ఉన్న అంశమే నని తప్పక పేదలందరికీ ఇళ్ల స్థలాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని జిల్లా కలెక్టర్ గా తాను న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేదిలేదు

తమకు న్యాయం జరిగేంతవరకు లేదా స్పష్టమైన హామీ లభించే వరకు కరకంబాడి ప్రాంతంలోని పేదలు ఆక్రమించుకున్న స్థలాన్ని విడిచి పెట్టేది లేదని నేతలు ప్రకటించారు. కరకంబాడి ఇళ్ల స్థలాల సాధన కమిటీ 3297 అర్జీలను జిల్లా కలెక్టర్ కు నేరుగా అందించారు.

అర్జీలన్నింటిని కూలంకషంగా పరిశీలన చేస్తామని, అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలం ఇస్తామని కలెక్టర్ ప్రకటించారు. దూర ప్రాంతంలో కాకుండా కరకంబాడిలో ఉన్న ప్రభుత్వ భూములు ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని నేతలు విజ్ఞప్తి చేయడంతో కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.

ఈ కార్యక్రమంలో ఇండ్ల సాధన పోరాట కమిటీ నాయకులు సత్యశ్రీ, రాజశేఖర్, దీప, ఎర్రస్వామి, కుమారి, పవిత్ర, సుధ, మస్తానీ, పార్వతి, నూరి, రాధిక, శ్రావణి, జయసుధ, అమీర్జాన్, మస్తాన్, లోకేష్, మునిరాజమ్మ, కిషోర్, అరుణ్, లిల్లీ, నాగేంద్ర,రేణిగుంట సిపిఎం మండల కార్యదర్శి హరినాథ్, శివానందం తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News