KODALI NANI|కొడాలి నానీపై విశాఖలో కేసు నమోదు, ఏం జరుగుతుందీ?
మాజీ మంత్రి కొడాలి నానీ గతంలో వాడిన భాషపై విశాఖపట్నంలో కేసు నమోదు అయింది. ఓ లా స్టూడెంట్ చేసిన ఫిర్యాదుపై పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు.
By : The Federal
Update: 2024-11-17 05:57 GMT
ఎక్కడ విశాఖపట్నం ఎక్కడ గుడివాడ? అనుకోవద్దు.. ప్రముఖ సినీనటుడు సల్మాన్ ఖాన్ పై ఇక్కడెక్కడో ఆంధ్రప్రదేశ్ లో కేసు నమోదైనప్పుడు ఒకే రాష్ట్రంలో కేసు ఫైల్ అయితే తప్పేముందీ? విశాఖపట్నానికి చెందిన ఓ లా విద్యార్ధిని సత్యాల అంజన ప్రియ (Anjana Priya) వైఎస్సార్‌సీపీ నేత (YSRCP Leader), మాజీ మంత్రి కొడాలినాని (Ex Minister Kodali Nani)పై ఫిర్యాదు చేశారు. వైసీపీ అధికారంలో ఉండగా కొడాలి నానీ వాడిన భాషపై ఆమె ఫిర్యాదు చేశారు. విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు.
నవంబర్ 17 శనివారం రాత్రి 11 గంటలకు ఈ కేసు నమోదు అయింది. ఈ వి"ద్యార్థిని నేపథ్యం ఏమిటనేది ఇంకా తెలియలేదు. విశాఖపట్నం 3వ పట్టణ పోలీసు స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు. కొడాలి నాని మీడియా సమావేశాల్లో, అసెంబ్లీ సమావేశాలలో వాడిన భాషపై అంజన ప్రియ ఫిర్యాదు చేశారు.
తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పై అవమానకరమైన రీతిలో అసభ్య పదజాలం ఉపయోగించారని ఆమె ఫిర్యాదు చేశారు. వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని ఆరోపించారు. కొడాలి నాని వ్యాఖ్యలు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, ఇతర కుటుంబ సభ్యులకు చాలా తీవ్ర ఆవేదన కలిగించాయని, వారికి పరువు నష్టం కలిగించడమే కాకుండా, సామాజిక మాద్యమాల ద్వారా వారి వ్యక్తిగత గౌరవాన్ని, కుటుంబ ప్రతిష్ఠను దెబ్బతీశాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
"కొడాలి నాని వ్యాఖ్యలు ఒక బాధ్యతాయుతమైన మహిళగా తనను తీవ్ర ఆవేదన కలిగించాయి. కొడాలి నానీ తరచుగా ప్రసంగాల్లో, మీడియా వేదికలపై దుర్భాషలు ఆడారు. బాడీ షేమింగ్, నిరాధారమైన ఆరోపణలు చేయడం వంటి చర్యల ద్వారా నారా చంద్రబాబు నాయుడు, వారి కుటుంబంపై తీవ్ర అవమానకర వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళగా, లా విద్యార్థిగా, ఇటువంటి అసభ్య పదజాలం వినడం, చూడడం నాకు చాలా బాధ కలిగించింది. ఇది సమాజంలో యువతపై ప్రతికూల ప్రభావం చూపించడమే కాకుండా, ప్రజాస్వామ్య విలువలకు హానికరంగా ఉంటుంది. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజా ప్రవర్తనను ప్రతికూలంగా ప్రభావితం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ముఖ్యంగా యువతలో ఇది విషపూరితమైన ఆన్‌లైన్ సంస్కృతిని సృష్టించడాన్ని ప్రోత్సహిస్తుంది. ఇటువంటి వాటిని ఉపేక్షిస్తే యువత వీటినే ఆదర్శంగా తీసుకునే ప్రమాదం ఉంది" అని అంజన ప్రియ అన్నారు. ఇదే జరిగితే దారి తప్పిన యువత, ముఖ్యంగా మహిళలపై అభ్యంతరకరమైన భాషతో సామాజిక మాద్యమాల్లో దుర్భాషలకు దిగితే ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితి ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవడం వల్ల అపఖ్యాతి పాలైన వ్యక్తుల గౌరవాన్ని నిలబెట్టినట్టనవుతుందని, బహిరంగ వేదికలపై దూషించే పదజాలం, అవమానకరమైన వ్యాఖ్యలను మరెవ్వరూ ఉపయోగించకుండా బలమైన సందేశాన్ని పోలీసులు పంపాలన్నారు. విశాఖ పోలీస్ కమిషనర్ ఈ అంశంపై అత్యవసర చర్యలు తీసుకోవాలని, అనుచిత వ్యాఖ్యలు చేసిన కొడాలి నానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్ననన్నారు.
ఈ కేసును నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తామని ప్రకటించారు. అయితే ఈ వ్యవహారమై కొడాలి నానీ ఇంకా ఏమీ స్పందించలేదు. బెయిల్ కోసం ప్రయత్నం చేస్తారా లేక కేసును ఎదుర్కోవడానికే సిద్ధపడతారో తెలియాల్సి ఉంది.