అమరావతి బాట పట్టిన కేంద్ర సంస్థలు..

కేంద్ర ప్రభుత్వ సంస్థలతో ఏపీ సీఆర్‌డీఏ సంప్రదింపులు ప్రారంభించిందా? గతంలో కేటాయించిన స్థలాలకు సంబంధించిన సమాచారం అందించినా.?

Update: 2024-06-23 11:40 GMT

రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం అమరావతి పునఃనిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇటీవల ఢిల్లీలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్.. అమరావతి ప్రస్తావ తీసుకొచ్చారు. అమరావతి నిర్మాణానికి కేంద్రం సహకరించాలని, నిధులు కేటాయించాలని కోరారు. అమరావతికి తాము అధిక ప్రాధాన్యత ఇస్తామని కూడా పయ్యావుల కేశవ్ వివరించారు. దీంతో ఈసారి ఎలాగైనా అమరావతి నిర్మాణాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం పరుగులు పెట్టించనుందని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వ సంస్థలతో కూడా ఏపీ ప్రభుత్వం సంప్రదింపులు ప్రారంభించిందని తెలుస్తోంది.

అమరావతి ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఏర్పాటు చేసే దిశగా ఇప్పటికే ఏపీ సర్కార్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే కేంద్రం ప్రభుత్వం సంస్థలకు అమరావతి ప్రాంతంలో 2014-2019 మధ్య కేటాయించిన భూముల వివరాలను సీఆర్‌డీఏ తెలిపింది. ఆ భూముల విషయంలో తమ ప్రణాళికలు చెప్పాలని సీఆర్‌డీఏ అధికారులు ఆ సంస్థలకు ఫోన్లు చేస్తున్నారని సమాచారం. కాగా సీఆర్‌డీఏ సంస్థ ఫోన్లపై కేంద్ర సంస్థలు ఒక్కొక్కటి ఒక్కోలా స్పందించాయని తెలుస్తోంది.

‘మాకు ఏ ఫోన్ రాలేదు’

తమకు అమరావతి ప్రాంతంలో స్థలం కేటాయించినట్లు సమాచారమిస్తూ గత ఐదేళ్లలో ఎటువంటి ఫోన్ కాల్ రాలేదని కేంద్ర ప్రభుత్వ సంస్థలు తెలిపాయని సీఆర్‌డీఏ వర్గాలు వివరించాయి. మరికొన్ని సంస్థలు తమకు కేటాయించిన స్థలం చూపించాలని కూడా కోరాయని చెప్పాయి. తమకు కేటాయించిన స్థలం చూసిన తర్వాత తమ తదుపరి నిర్ణయాలను తీసుకుంటామని మరికొన్ని సంస్థల ప్రతినిధులు వెల్లడించినట్లు విశ్వనీయ వర్గాల సమాచారం. దీంతో సదరు సంస్థల ప్రతినిధుల రాకకు సంబంధించి షెడ్యూల్‌ను రెడీ చేసే పనిలో సీఆర్‌డీఏ బిజీ అయినట్లు తెలుస్తోంది. దాదాపు వారికి స్థలాలు చూపించే పనిని రానున్న 20 రోజుల్లో పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

ఆ సంస్థల ఆసక్తి

2014-2019 మధ్య అధికారంలో ఉన్న టీడీపీ.. కాగ్, ఆర్బీఐ, సీబీఐ, ఎఫ్‌సీఐ, సీపీడబ్ల్యూడీ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ పోస్ట్స్, నిఫ్ట్, ఎన్ఐడీ, టూల్ డిజైన్ తదితర సంస్థలకు భూ కేటాయింపులు జరిగాయి. నాబార్డ్, ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఎల్ఐసీ, ఇండియన్ ఆయిల్, హెచ్‌పీసీఎల్, గెయిల్ తదితర సంస్థలు అమరావతిలో కార్యాలయం ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News