హిట్ లిస్టులో ఉన్న ఏపీ మంత్రులు వీళ్లే! నాగబాబుతో పాటు ఇంకెందరికి ఛాన్స్?
చంద్రబాబు క్యాబినెట్లో కొందరు మంత్రులు వివాదాల్లో ఇరుక్కుంటున్నారు.అలాంటి మంత్రుల తీరుతో సీఎం సంతృప్తిగా కనిపించడం లేదు. నాగబాబుతో ఇంకా కొందరికి ఛాన్స్ ఉంటుందా?;
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ లో చేరికలకు మార్చి తర్వాత ముహూర్తం ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబుకి మంత్రి హోదా కేటాయించబోతున్నట్టు ఇప్పటికే సీఎం చంద్రబాబు వెల్లడించారు. మార్చిలో ఎమ్మెల్సీ హోదా కట్టబెట్టి, ఆ తర్వాత క్యాబినెట్లోకి తీసుకుంటామని జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ధృవీకరించారు. దాంతో క్యాబినెట్లో మార్పులు అనివార్యంగా కనిపిస్తున్నాయి.
అయితే కేవలం చేరికలతో సరిపెడతారా లేక మొత్తం పునర్వవస్థీకరణ మీద దృష్టి పెడతారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇటీవల పలువురు టీడీపీ మంత్రుల తీరు వివాదాస్పదంగా మారుతోంది. మంత్రుల వ్యవహారశైలి మీద తెలుగు తమ్ముళ్లే తీవ్రంగా మండిపడుతున్నారు. అలాంటి వారి విషయంలో పార్టీ అధిష్టానం కూడా పునస్సమీక్ష చేసే అవకాశం ఉందన్న వాదన ఉంది. దాంతో కొందరు మంత్రులను పక్కన పెట్టి, కొత్త వారికి అవకాశం ఇచ్చినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదన్న మాట కూడా వినిపిస్తోంది.
సారధికి సెగలు ..
గృహ నిర్మాణం మరియు సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రిగా ఉన్న కొలుసు పార్థసారధి పదే పదే వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. వైఎస్సార్సీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేశ్ తో కలిసి గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణకు హాజరయిన వ్యవహారం దుమారం రేపింది. చివరకు పార్థసారధి బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. పార్టీ శ్రేణులకు, అధిష్టానానికి ఆయన క్షమాపణలు చెప్పుకున్నారు.
అది మరువకముందే మట్టి మాఫియా వ్యవహారంలో తన మాజీ సహచరులు, వైఎస్సార్సీపీ నేతలు వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి వారికి అనుకూలంగా పనిచేస్తున్నారన్న విమర్శలు చుట్టుముట్టాయి. వంశీ, నాని అనుచరులే అటు నూజివీడు, ఇటు గన్నవరం అసెంబ్లీ నియోజవకర్గాల పరిధిలో చక్రం తిప్పుతున్నారంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. మంత్రి తీరుని నిరసిస్తూ కొందరు టీడీపీ కార్యకర్తలు రాజీనామా చేసేటంత వరకూ వెళ్లింది వ్యవహారం. ఈ పరిణామాలతో మంత్రి పార్థసారధి పరిస్థితి ఊగిసలాటలో ఉందన్న వాదన బలపడుతోంది.
సుభాష్ చుట్టూ చిక్కులే
గతంలో వైఎస్సార్ క్యాబినెట్లో కూడా పనిచేసిన అనుభవం ఉన్న కొలుసు పార్థసారధి ఓ విధంగా ఉక్కిరిబిక్కిరి అవుతుంటే రాజకీయంగా పెద్ద అనుభవం లేని యువనేత వాసంశెట్టి సుభాష్ మరో రీతిలో చిక్కులు ఎదుర్కొంటున్నారు. శెట్టిబలిజ కోటాలో ఆయనకు క్యాబినెట్ బెర్త్ దక్కింది. అయినా ఆయన అమాత్య హోదాకు అనుగుణంగా వ్యవహరించలేకపోతున్నారని టీడీపీ నేతలే పెదవి విరుస్తున్నారు. స్వయంగా సీఎం చంద్రబాబు కూడా ఆయన వ్యవహారశైలిని తప్పుబట్టారు. పనితీరు మెరుగుపరుచుకోకుంటే ప్రత్యామ్నాయం చూసుకుంటానంటూ హెచ్చరించిన ఆడియో వైరల్ అయ్యింది.
ఆ తర్వాత కూడా తన శాఖాపరమైన వ్యవహారాల్లో గానీ, సొంత జిల్లా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమలో గానీ సుభాష్ పట్టు సాధించలేకపోతున్నారన్న వాదన ఉంది. సొంత కులస్తులు శెట్టిబలిజల్లో సైతం ఇటీవల వ్యతిరేకత కనిపిస్తోంది. ఇవన్నీ వాసంశెట్టి సుభాష్ కి సమస్యగా మారుతున్నాయి.
కొండపల్లికి మరో తలనొప్పి..
విజయనగరం జిల్లా గజపతినగరం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కొండపల్లి శ్రీనివాస్ సైతం ఇలాంటి సమస్యలనే ఎదుర్కొంటున్నారు. ఆయన కూడా విపక్ష నేతలతో సన్నిహితంగా మెలుగుతున్నారన్న విమర్శలు వచ్చాయి. మండలిలో విపక్ష నేత, వైఎస్సార్సీపీకి చెందిన బొత్సా సత్యన్నారాయణకు కాళ్లు మెక్కారంటూ సోషల్ మీడియాలో తెలుగుదేశం వర్గాలే మండిపడ్డాయి. దానికి ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అభివాదం చేశానే తప్ప కాళ్లు మొక్కలేదంటూ చెప్పుకున్నారు.
తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన కొండపల్లికి సొంత నియోజకవర్గంలో సైతం పట్టు దొరకడం లేదు. జిల్లాల్లో ఆయన్ని అధికార యంత్రాంగం ఖాతరు చేయడం లేదన్న వాదన ఉంది. ఈ నేపథ్యంలో కిమిడి కళా వెంకట్రావు వంటి తూర్పు కాపుల్లో సీనియర్ నేతను పక్కన పెట్టి ఛాన్స్ ఇచ్చినా కొండపల్లి శ్రీనివాస్ తన హోదాకు తగ్గట్టుగా వ్యవహరించడం లేదన్న విమర్శలు చుట్టుముడుతున్నాయి.
వివాదాల్లో సీమ మంత్రి..
రాయలసీమకు చెందిన రవాణా శాఖ మంత్రి రాం ప్రసాద్ రెడ్డిది కూడా అదే తంతు. అన్నమయ్య జిల్లాకే చెందిన సీనియర్లు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వంటి వారిని కాదని రాం ప్రసాద్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. కానీ ఆయన కుటుంబ సభ్యుల వ్యవహారశైలి కారణంగా మంత్రికి తలనొప్పులు తప్పడం లేదు. స్వయంగా ఆయన భార్య ప్రోటోకాల్ కోసమంటూ పోలీస్ అధికారిని బెదిరించిన వీడియో వైరల్ అయ్యింది. మంత్రికి సీఎం నుంచి హెచ్చరికలు కూడా వచ్చాయి.
సొంత శాఖలో సైతం పెద్దగా పట్టు సాధించలేదన్న వాదన ఉంది. యువజన సర్వీసుల మంత్రిగా ఉన్న యువనేతగా యూత్ లో ఆదరణ పెంచే రీతిలో ప్రయత్నం చేయడం లేదంటూ ఇప్పటికే పలు క్యాబినెట్ భేటీలలో సీఎం సైతం ఆయన మీద అసహనం ప్రదర్శించినట్టు లీకులు వచ్చాయి. ఇవన్నీ కలిసి ఈ మంత్రికి సమస్యగా మారుతున్నాయి.
వీరితో పాటుగా రెవెన్యూ వంటి కీలకశాఖ మంత్రిగా ఉన్న అనగాని సత్యప్రసాద్ తెలంగాణాలో గానాబజానా నడుపుతున్న వైనం మీద కూడా కథనాలు వచ్చాయి. ఇలాంటి పలు వ్యవహారాల నేపథ్యంలో ఏపీ క్యాబినెట్లో పునర్వవస్థీకరణ వైపు మొగ్గితే కనీసం అరడజను వరకూ మార్పులుండే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం ఏపీ క్యాబినెట్ లో అధికారికంగా ఒక బెర్త్ ఖాళీగా ఉంది. 25 మంది మంత్రులకు అవకాశం ఉన్నప్పటికీ తొలిసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన సమయంలో కేవలం 24మందితో సరిపెట్టేశారు. దాంతో ఆ ఒక్క ఖాళీ సీటుకి నాగబాబుకి అవకాశం ఇచ్చి సరిపెడతారా, లేక ఇప్పటికే 8 నెలలు దాటుతున్నా ఇంకా గాడిలో పడని మంత్రులను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తారా అన్నది ఆసక్తికర ప్రశ్న. నాగబాబు చేరిక ద్వారా క్యాబినెట్లో కాపుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో దానిని బ్యాలెన్స్ చేసేందుకయినా కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. దాంతో పాటుగా పోర్ట్ ఫోలియోల కేటాయింపు విషయంలో కూడా కొన్ని మార్పులు అనివార్యంగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల్లో ఏపీ క్యాబినెట్ కూర్పు మాత్రం చంద్రబాబుకి కత్తిమీద సాముగానే భావించాల్సి ఉంటుంది.