రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకం.. వెల్లడించిన సీఎం

రైతులకు అందించే పట్టాదారు పాసుపుస్తకాలను రాజముద్రతో అందించనున్నట్లు గతంలో చెప్పిన చంద్రబాబు.. దానిని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.

Update: 2024-07-29 12:40 GMT

రైతులకు అందించే పట్టాదారు పాసుపుస్తకాలను రాజముద్రతో అందించనున్నట్లు గతంలో చెప్పిన చంద్రబాబు.. దానిని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ అంశంపై ఈరోజు మంత్రి అనగాని సత్యప్రసాద్ సహా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వమించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖలోని ప్రస్తుత పరిస్థితులపై కూడా సమీక్షించారు సీఎం చంద్రబాబు. రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం వారికి రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలను అతి త్వరలోనే అందిస్తామని స్పష్టం చేశారు. అదే విధంగా జగన్ బొమ్మ ఉన్న 77 లక్షల గ్రానైట్ రాళ్లను ఏం చేయాలన్న అంశంపై కూడా ప్రభుత్వం కసరత్తులు చేస్తోందని వెల్లడించారు.

వైసీపీ హయాంలో రైతులకు ఇచ్చిన పాసుపుస్తకాలపై అప్పటి సీఎం జగన్ తన ఫొటో వేసుకున్నారని, అందుకోసం ఆనాటి ప్రభుత్వం రూ.15 కోట్లు వృధాగా ఖర్చు చేసిందని మండిపడ్డారు. ‘‘రైతులకు ఇచ్చే పాసుపుస్తకాలపై ఆయన ఫొటో ఎందుకో ఎవరికీ అర్థం కాలేదు. కానీ ప్రశ్నిస్తే కేసులు పెడతారన్న భయంతో మౌనం వహించారు. కానీ ఎన్నికల సమయంలో ఈ పద్దతిని మారుస్తానని హామీ ఇచ్చాను. రాజముద్రతో రైతుకు పాసు పుస్తం ఇస్తానని చెప్పాను. చెప్పినట్లే ఆదిశగా పనులు ప్రారంభించాం. అతి త్వరలోనే రైతులకు రాజముద్రతో ఉన్న పట్టాదారు పాసు పుస్తకాన్ని అందిస్తాం’’ అని వెల్లడించారు. ఇప్పటికే రాజముద్రతో నమూనా పాసుపుస్తకాన్ని ముద్రించినట్లు చెప్పిన అధికారులు.. ఆ పుస్తకాన్ని సీఎంకు చూపించారు.

ఈ సందర్బంగా పట్టాదారు పాసు పుస్తకం పంపిణీపై చంద్రబాబు మాట్లాడారు. ‘‘భూ యజమానులకిచ్చే పట్టాదారు పాస్ పుస్తకాలపై ప్రభుత్వ రాజముద్ర ఉండేలా చూసుకోవాలి. పార్టీల రంగులు, నేతల ఫొటోలు ఉండకూడదు’’ అని అధికారులు చూపిన నమూనా పాసుపుస్తకంలో కొన్ని మార్పులను సూచించారు. పట్టాదారు పాసు పుస్తకం చూడగానే రైతులకు భరోసా కలిగేలా ఉండాలన్నారు.

 

క్యూఆర్‌తో ఆస్తి వివరాలు

అదే విధంగా ఒక వ్యక్తికి ఉన్న ఆస్తి వివరాలు తెలుసుకునేలా క్యూఆర్ కోడ్‌లను కూడా రూపొందిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే సదరు పత్రంలో ఉన్న ఆస్తి దగ్గరకు తీసుకెళ్లే రూట్ మ్యాప్ కూడా వచ్చేలా ఏర్పాటు చేసినట్లు వివరించారు. వీటిపై కూడా త్వరలోనే చంద్రబాబు మరోసారి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం.

అవసరం లేకున్నా రాళ్ళు సిద్ధం

భూమి రీ సర్వే పేరుతో గత ప్రభుత్వం భారీగా దుబారా ఖర్చులు చేసిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రీసర్వే కోసం అప్పటి వైసీపీ ప్రభుత్వం భారీగా ఖర్చు చేసింది. సరిహద్దు రాళ్లపై తన ఫొటో ఉండాలన్న కోరికను తీర్చుకోవడానికి సీఎం.. రూ.650 కోట్లు ఖర్చు పెట్టారు. కేంద్రం చెప్పిన రీ సరవేలో ఎక్కడా కూడా రాళ్లు పాతాల్సిన అవసరం లేదు. కానీ తన బొమ్మ ఉండాలన్న జగన్.. 77 లక్షల గ్రానైట్ రాళ్లను సిద్ధం చేశారు.

బొమ్మ చెరపడానికి రూ.15కోట్లు

‘‘జగన్ తన బొమ్మతో సిద్ధం చేసిన గ్రానైట్ రాళ్ల సంఖ్య 77 లక్షలు. వాటిని ఏం చేయాలి అన్న అంశంపై ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. వాటిపై ఉన్న జగన్ బొమ్మను చెరపడానికి ఇప్పుడు మరో రూ.15 కోట్లు ఖర్చు అవుతుందని తాత్కాలిక అంచనా. జగన్ బొమ్మల పిచ్చి వల్ల రాష్ట్రానికి మొత్తంగా రూ.700 కోట్లు నష్టం’’ అని మండిపడ్డారు. అనంతరం ఆ గ్రానైట్ రాళ్లు ఎలా ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించాలి అన్న అంశాలపై అధికారులకు ఆదేశించారు. అనంతరం గత 5ఏళ్లలో రెవెన్యూ శాఖలో తీసుకొచ్చిన చట్టాలు, అవి దుర్వినియోగం అయిన తీరుపై చర్చించారు.

సంస్కరణల పేరుతో కొత్త చట్టాలు తెచ్చి అక్రమాలకు పాల్పడిన విధానంపై సమీక్షించారు. పెరిగిన భూ వివాదాల నేపథ్యంలో ప్రజలకు సమస్యలకు పరిష్కారం కోసం తీసుకురావాల్సిన చర్యలపై చర్చించారు. భూ కబ్జాలను అరికట్టడానికి కొత్త చట్టాలు తేవాల్సిన అవసరం ఉందా, ఉంటే ఎటువంటి కొత్త చట్టాలు తేవాలి అనే అంశంపైనా చర్చ జరిగింది.

Tags:    

Similar News