ఆంధ్రలో భారీ వర్షాలు.. సీఎం పర్యటన రద్దు..
ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. ఈ వర్షాల ప్రభావానికి రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో రోడ్లు నదుల్లా మారాయి.
ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. ఈ వర్షాల ప్రభావానికి రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో రోడ్లు నదుల్లా మారాయి. నడుము లోతు నీళ్లు నిలిచిపోవడంతో జనజీవనం ఎక్కడిక్కడ నిలిచిపోయింది. ఈ వర్షాల కారణంగా సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటన కూడా రద్దు అయింది. ఓర్వకల్‌లో నిర్వహించనున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొనాల్సి ఉంది. ఇప్పుడు వర్షాలు కారణంగా సీఎం చంద్రబాబు పర్యటనను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అంతేకాకుండా అక్కడి పరిస్థితులపై ఎప్పటికప్పుడు సీఎం సమాచారం అందుకుంటున్నారని, భారీ వర్షాల నడుమ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాటు చేయాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం ఆదేశాలిచ్చారు.
ఒకరోజు ముందే..
రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు నుంచే ప్రారంభించారు. ప్రతి నెల ఒకటో తేదీ నుంచి అందించబడే పింఛన్లు ఈసారి ఒకరోజు ముందే ఇవ్వబడుతున్నాయి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్వయంగా చంద్రబాబు పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు తొలుత పత్తికొండ మండలం పుచ్చకాయలమాడలో సీఎం పర్యటనను ఖరారు చేశారు అధికారులు. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పర్యటనను ఓర్వకల్‌కు బదిలీ చేశారు. కాగా ఇప్పుడు వర్షాల కారణంగా ఈ పర్యటన కూడా రద్దు చేశారు. వర్షాలు తగ్గితే రేపు జరిగే పింఛన్ల పంపిణీలో చంద్రబాబు పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. కానీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పింఛన్ల పంపిణీపై అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఉద్యోగులకు సీఎం వెసులుబాటు
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో పింఛన్లను పంపిణీ చేసే సచివాలయ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు ప్రత్యేక వెసులుబాటు కల్పించారు. ‘‘పింఛన్లు పంపిణీ చేసే ప్రాంతాల్లో వర్షాల కారణంగా ఏమైనా ఇబ్బందులు తలెత్తితే అక్కడ పింఛన్ల పంపిణీని వచ్చే ఒకటి రెండు రోజుల్లో పూర్తి చేయండి. సెప్టెంబర్ 2 నాటికి పింఛన్ల పంపిణీ పూర్తయ్యేలా చూడండి. ఈ విషయంలో సచివాలయ ఉద్యోగులకు టార్గెట్లు పెట్టి ఒత్తిడి తీసుకురావద్దు’’ అని కలెక్టర్లకు సూచించారు. అదే విధంగా వర్షాలు లేని ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీ యథావిధిగా కొనసాగాలని చెప్పారు.