CBN TWIST|జగన్ 'అవినీతి'ని అసెంబ్లీలో ఉతికేసిన చంద్రబాబు
చంద్రబాబు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. అదానీకి మోదీతో ఉన్న స్నేహాన్ని, అదానీతో తనకున్న వైరాన్ని పక్కన బెట్టి జగన్ పై వచ్చిన ఆరోపణలపై అసెంబ్లీలో చర్చించారు.
By : The Federal
Update: 2024-11-22 12:24 GMT
అమెరికాలో ఇన్వెస్టర్లు (మదుపర్లు) ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీపై పెట్టిన కేసు ఆంధ్రప్రదేశ్ లో మంటలు పుట్టిస్తోంది. సోలార్ పవర్ ప్రాజెక్టుతో పాటు గంగవరం పోర్టు, అదానీకి చెందిన ఇతర సంస్థలకు అడ్డగోలుగా భూములు అప్పగించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అదానీ గ్రూపు నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారు 1,750 కోట్ల రూపాయలు లంచాలు తీసుకున్నారంటూ వచ్చిన ఆరోపణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవంబర్ 22న రాష్ట్ర శాసనసభలో చర్చకు చేపట్టారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా అసలు ఆయన ఈ విషయాన్ని పట్టించుకుంటారా లేదా అనే అనుమానానికి తావు లేకుండా జగన్ పై వచ్చిన ఆరోపణలను సభలో సాక్షాత్తు ఆయనే ప్రస్తావించడం గమనార్హం. గౌతమ్ అదానీకి నరేంద్ర మోదీతో ఉన్న సత్ సంబంధాల దృష్ట్యా చంద్రబాబు ఆ అంశాన్ని పట్టించుకోకపోవచ్చుననే అభిప్రాయాన్ని పటాపంచలు చేసేలా టీడీపీ ప్రభుత్వం చర్చించింది.
ఇదసలు ఊహించలేదంటున్నారు సీనియర్ జర్నలిస్టులు ఎం.చంద్రశేఖర్, కె.రామకృష్ణ. "అవును అమెరికా.. అదానీ.. మాజీ సీఎం జగన్.. ఈ వ్యవహరంపై ఏపీలో చర్చ జరిగే అవకాశం తక్కువే అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా కూటమి ప్రభుత్వం ట్విస్ట్ ఇచ్చింది. ఏకంగా అసెంబ్లీలోనే దీనిపై చర్చ పెట్టింది. జగన్ను టార్గెట్ చేసుకునేందుకు కూటమి ప్రభుత్వానికి లడ్డూ లాంటి అవకాశం వచ్చినా.. అదానీ ఉన్నారు కాబట్టి.. దానిపై పెద్దగా మాట్లాడదేమోనని అందరూ అనుకున్నారు.. ఇంకొంత మంది దాదాపు ఫిక్సై అయిపోయారు. కానీ ఏపీ ప్రభుత్వం దీనికి భిన్నంగా వ్యవహరించింది. అమెరికా.. అదానీ.. జగన్ అంశంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. పైగా ఆ చర్చను కూడా బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు ప్రారంభించడం ఈ ఎపిసోడులో హైలెట్ వ్యవహరం వ్యవహారమే.." అన్నారు వారు. చంద్రబాబు చాణిక్యమేమిటో ఇప్పుడు బాగా తెలిసివస్తోందని, రాజకీయం రాజకీయమే అని చంద్రబాబు మరోసారి నిరూపించారు అన్నారు చంద్రశేఖర్.
చంద్రబాబు ఏమన్నారంటే...
బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు నవంబర్ 22న అసెంబ్లీలో చర్చను ప్రారంభించారు. స్వల్పకాలిక చర్చలో టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఆ తర్వాత చంద్రబాబు చర్చకు సమాధానం ఇచ్చారు. వైఎస్ జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ఠ, బ్రాండ్‌ను దెబ్బతీసేలా ప్రవర్తించారని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. ‘‘జగన్ చేసిన అవినీతి అంశాన్ని ప్రస్తావించడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అంశాన్ని జాగ్రత్తగా గమనిస్తోంది. మరింత సమాచారం తీసుకుని తగిన విధంగా స్పందిస్తాం. మరొకరు ఇలాంటి తప్పులు చేయకుండా చూస్తాం. అమెరికా కోర్టులో వేసిన ఛార్జిషీట్ కూడా మా దగ్గర ఉంది. దీనిపై అధ్యయనం చేసి ఎలాంటి చర్యలు చేపట్టాలో నిర్ణయం తీసుకుంటాం’’ అన్నారు చంద్రబాబు.
జగన్ పిరికివాడు- గోరంట్ల బుచ్చయ్య చౌదరి
‘‘జగన్ లాంటి పిరికి వ్యక్తి సీఎం ఎలా అయ్యారు? తన అవినీతి ఖ్యాతిని జగన్ విశ్వవిఖ్యాతం చేసుకున్నారు అని టీడీపీ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. రూ.60 వేల కోట్లు దోచుకొని జగన్ ఈడీ కేసుల్లో ఉన్నారు. "12 ఏళ్లుగా కేసు సాగుతోంది. ఆ కేసుల్ని ఎలా పొడిగించుకోవాలో తెలిసిన వ్యక్తి జగన్ అటువంటి వ్యక్తికి రూ.1,750 కోట్లు లంచం తీసుకోవడం ఓ లెక్కా. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలతో భారీగా దోచుకునేందుకు ప్రణాళిక చేశారు" అన్నారు గోరంట్ల బుచ్చయ్య.
‘‘జగన్ దోపిడీతో రాష్ట్రానికి నష్టం జరిగింది. అదానీతో చాలా ఒప్పందాలు చేసుకున్నారు. ఓ తెలుగు వాడు నిర్వహిస్తున్న గంగవరం పోర్టును అక్రమంగా అదానీకి కట్టబెట్టారు. జగన్ అవినీతిని పరాకాష్ఠకు చేర్చారు. ప్రభుత్వ ఖర్చుతోనే తన నివాసానికి ఇనుప బారికేడ్లు పెట్టుకున్నారు. సీఎంగా పర్యటనకు వస్తే చెట్లు కొట్టేయాలా? పరదాలు పెట్టుకోవాలా? దుకాణాలు మూసేయాలా? ఇలాంటి పిరికి వ్యక్తి సీఎం ఎలా అయ్యారు? అమెరికాలో కేసులు వాయిదా వేయించుకునే అవకాశం లేదు. దేశంలో అయితే కేసులు వాయిదా వేయించుకోవచ్చు. జగన్ చేసిన నేరాలు, అక్రమాలపై విచారణ చేయాలని కోరుతున్నాం’’ అని బుచ్చయ్య చౌదరి విమర్శించారు.
జగన్‌ను సభకు పిలిపించాలి- ఆదినారాయణ రెడ్డి
"జగన్ 15 ఏళ్ల క్రితమే రూ.లక్ష కోట్లు సంపాదించారు" అని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. జగన్ సంపాదన ఎంతో నిగ్గు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాధనం దోపిడీ కోసం అంగళ్లు పెట్టాడని ఆరోపించారు. జగన్‌ను సభకు పిలిపించి అక్రమాలపై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు ఆదినారాయణ రెడ్డి.
ఇంకా ఏమన్నారంటే...
బీజేపీ, టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఇంకా ఏమన్నారంటే.." అవినీతి అక్రమాలపై జగన్ పేరు ఇప్పుడు విదేశాలకు ఎక్కింది. మాజీ ముఖ్యమంత్రి పేరు ప్రపంచవ్యాప్తం అయిపోయింది. అవినీతి మూలాలన్నీ జగన్ ప్రభుత్వం వైపు చూపిస్తున్నాయి. రుషికొండ, గంగవరం పోర్టుల్లోనూ పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. రూ.651 కోట్లకు గంగవరం పోర్ట్ వాటాలను ఇచ్చేయటం ఏమిటి? కనీసం 2 వేల కోట్ల రూపాయల విలువైన భూములను కట్టబెట్టారు. విద్యుత్ ఒప్పందాల్లో డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. 2019 నుంచి 2024 జూన్ వరకు అధికారంలో ఉన్న వైఎస్ జగన్ పాలనపై విచారణకు ప్రత్యేక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేయాలి (బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు). ఆయన అవినీతి అక్రమాలు రాష్ట్రం, దేశం పరిధి దాటి ఇప్పుడు విదేశాలకు ఎక్కింది. ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బు దుర్వినియోగం చేసి రుషికొండ ప్యాలస్ కట్టుకున్నారు. దీనిపై అన్ని చోట్లా చర్చ జరగాల్సిందే. 60వేల కోట్ల రూపాయలు దోచుకుని ఈడీ కేసుల్లో ఉన్నవ్యక్తికి రూ.1750 కోట్లు ఓ లెక్కా? (గోరంట్ల బుచ్చయ్య).
మోదీతో ఉన్న మిత్రత్వం మూలంగా చంద్రబాబు అదానీ అవినీతి అంశాన్ని చర్చించకపోవచ్చునని చాలామంది అనుమానించారు. రాష్ట్ర శాసనసభలో చర్చతో ఆ అనుమానానికి తావు లేకుండా పోయిందని సీనియర్ జర్నలిస్టు రామకృష్ణ చెప్పారు. అవినీతిపై ఎంత చర్చ జరిగితే ప్రజలకు అంత మేలు జరుగుతుందని రామకృష్ణ అన్నారు.