ఆ అధికారులకు తిప్పలు తప్పవా..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు యూటర్న్ తీసుకున్నాయి. ప్రభుత్వం మారడంతో అధికార ప్రవర్తనలో కూడా మార్పులు వచ్చాయి. ముఖ్యమంత్రిగా జగన్ దిగిపోవడం..

Update: 2024-06-06 11:46 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు యూటర్న్ తీసుకున్నాయి. ప్రభుత్వం మారడంతో అధికార ప్రవర్తనలో కూడా మార్పులు వచ్చాయి. ముఖ్యమంత్రిగా జగన్ దిగిపోవడం.. నూతన సీఎంగా అతి త్వరలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో పలువురు కీలక అధికారులు చంద్రబాబు నివాసానికి క్యూ కట్టారు. కానీ వీరిలో చాలా మందిని అనుమతించిన భద్రతా సిబ్బంది కొందరు ఐపీఎస్ అధికారులకు మాత్రం నో ఎంట్రీ కార్డ్ చూపింది. మర్యాదపూర్వక భేటీ అని చెప్పినా వినకుండా వెనక్కు పంపేసింది. వాళ్లని కలవడానికి అధికార పార్టీ నిరాకరించినట్లు స్పష్టం చేశారు. వీరిలో సీఐడీ చీఫ్, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, మరో సీనియర్ ఐపీఎస్ అధికారి కూడా ఉన్నారు. వీరికి నో ఎంట్రీ చెప్పిన బాబు.. మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును కలిశారు. దీంతో ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

చంద్రబాబును కలవడానికి సీఐడీ చీఫ్ సంజయ్ వెళ్లారు. కానీ ఆయన కారును పోలీసులు కరకట్ట గేటు దగ్గరే అడ్డుకున్నారు. చంద్రబాబును కలవడం కుదరదని చెప్పి సంజయ్‌ని వెనక్కు పంపేశారు. దాంతో పాటుగా ఎన్నికల ఫలితాలు రాగానే విదేశాలకు వెళ్లాలంటూ సంజయ్ పెట్టిన సెలవులను కూడా అధికారులు రద్దు చేశారు. ఇదిలా ఉంటే చంద్రబాబుపై నమోదైన అక్రమాస్తుల కేసులో సంజయ్ అత్యంత కీలకంగా వ్యవహరించారు.

ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు కూడా ఇంచుమించు ఇటువంటి చేదు అనుభవమే ఎదురైంది. మర్యాదపూర్వకంగా కలవాలంటూ చంద్రబాబు నివాసానికి చేరుకున్న ఆంజనేయులును అనుమతి లేదంటూ వెనక్కు పంపారు సిబ్బంది. అయితే ఆయనను ఎన్నికల విధుల్లో నియమించిన ఎన్నికల సంఘం.. కొన్ని రోజుల తర్వాత విధుల్లో అవకతవకలు చేస్తున్నట్లు గమనించి ఆంజనేయులను బదిలీ చేసింది ఈసీ. ఆ తర్వాత కూడా ఆయన అనధికారికంగా వైసీపీ కోసం పనిచేశారన్న ఆరోపణలు ఉన్నాయి.

సీనియర్ ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామిరెడ్డిని కూడా భద్రతా సిబ్బంది అనుమతించలేదు. చంద్రబాబును కలవడానికి రఘురామిరెడ్డి.. ఫోన్‌లో అనుమతి కోరినా అందుకు తిరస్కరించారు అధికారులు. నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసే సమయంలో రఘురామిరెడ్డి కీలకంగా ఉన్నారు. ఎన్నికల సమయంలో కూడా వైసీపీకి ఆయన విధేయుడిగా ఉన్నారని ఎన్నికల సంఘమే బదిలీ వేటు వేసింది. ఆయనను డీజీపీ ఆఫీసులో రిపోర్ట చేయాలని ఆదేశించింది.

గుంటూరు కలెక్టర్ వేణుగోపాలరెడ్డికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. వైసీపీ ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరించారనే విమర్శలు ఆయనపైన తీవ్రంగా ఉన్నాయి. ఈరోజు చంద్రబాబును కలవడానికి ఆయన వెళ్లగా గేటు దగ్గరే ఆపేరసి వెనక్కి పంపారు.

కానీ ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో మాత్రం అలా ఏమీ లేదు. చంద్రబాబును కలవడానికి వెళ్లిన ఏబీవీని సాదరంగా లోపలికి స్వాగతించారు. ఆయనతో చర్చలు సాగించిన తర్వాత పంపారు చంద్రబాబు. అయితే ఏబీవీని వైసీపీ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులు తర్వాతే అక్రమ కొనుగోళ్లు చేశారంటూ ఆయనపై సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది. ఇటీవల ఏబీవీ సస్పెన్షన్ ఎత్తివేస్తూ కోర్టే ఆదేశాలు జారీ చేసినా చివరికి వరకు ఆయన పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. ఆయన సర్వీస్ మే 31న పూర్తవుతున్న క్రమంలో అదే రోజున ఆయనకు పోస్ట్ ఇవ్వడం జరిగింది.

ఇదిలా ఉంటే ఈరోజు అధికారులను కలిసే వ్యవహారంలో చంద్రబాబు వ్యవహరించిన తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. అధికారంలోకి వచ్చీ రాగానే చంద్రబాబు రివేంచ్ స్టోరీ రాయడం ప్రారంభించారా? ఇలాగైతే రానున్న రోజుల్లో కొందరు అధికారులకు తిప్పలు తప్పవా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. సదరు అధికారులపై సస్పెన్షన్ వేటు పడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని విశ్లేషకులు అంటున్నారు. అదే విధంగా ఏబీవీపై టీడీపీ సన్నహితుడు అన్న ముద్రను ఈరోజు చంద్రబాబు నిజం చేశారని, ఎవరికీ అనుమతివ్వని ఆయన ఏబీవీకి అనుమతి ఇచ్చారని అంటున్నారు.

ఏబీవీకి స్పెషల్ పోస్ట్ ఉంటుందా..!

ఈ నేపథ్యంలోనే మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, చంద్రబాబు భేటి కావడం అనేక చర్చలకు దారితీస్తోంది. పదవీ విరమణ పొందిన ఏబీవీకి ఈసారి టీడీపీ ప్రభుత్వంలో ఏదైనా ప్రత్యేక నియామక స్థానం దక్కనుందా అన్న చర్చలు ఊపందుకున్నాయి. ఆయన ప్రభుత్వ సలహాదారుగా కానీ మరే ఇతర నియామక పోస్ట్ అయినా కట్టబెట్టొచ్చని విశ్లేషకులు కూడా చెప్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News