మళ్ళీ మేఘాకే.. డయాఫ్రం వాల్ నిర్మాణంపై మంత్రి నిమ్మల

పోలవరం ప్రాజెక్ట్‌ను మరోసారి పరుగులు పెట్టించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి సహకారం అందిస్తామని బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రకటించింది.

Update: 2024-08-17 05:55 GMT

పోలవరం ప్రాజెక్ట్‌ను మరోసారి పరుగులు పెట్టించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి సహకారం అందిస్తామని బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రకటించింది. దీంతో చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ విషయంలో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు.. కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశమయ్యారు. ఇందులో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రం అందించే సహకారంపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలోనే కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణంపై ఒక నిర్ణయానికి వచ్చాయి. ఈ వాల్ నిర్మాణ పనులను పాత కాంట్రాక్ట్ సంస్థ మేఘాకే ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమిక అభిప్రాయానికి వచ్చాయి. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు ఇదే అంశంపై జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో చర్చించారు. ఈ సమావేశంలోనే డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను మళ్ళీ మేఘాకు ఇవ్వడంపై ఏకాభిప్రాయానికి వచ్చారు.

పాత ధరలకే నిర్మాణం

పోలవరం డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని మేఘా సంస్థకు ఇవ్వాలని ఆసక్తి చూపడంపై కేంద్రమంత్రికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈ నిర్మాణ పనులను ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ధరలకు కాకుండా 2022లో ఉన్న ధరల ప్రకారమే 73 వేల క్యూబిక్ మీటర్ల దయాఫ్రం వాల్ నిర్మాణానికి మేఘా సంస్థ సిద్ధంగా ఉందని, అలా చేయడంతో ప్రభుత్వంపై అదనపు భారం పడదని సీఎం చంద్రబాబు వివరించారు. అంతేకాకుండా మేఘా సంస్థకే ఈ నిర్మాణ పనులను కేటాయించడం ద్వారా ఇప్పుడు టెండర్లు పిలిచి.. కొత్త సంస్థను ఎన్నుకోవడానికి పట్టే సమయం కూడా ఆదా అవుతుందని, ఆ లోపు పనులు కూడా ప్రారంభమైపోతాయని బాబు వివరించారు. చంద్రబాబు ఇచ్చిన వివరణకు కేంద్ర మంత్రి కూడా సానుకూలత వ్యక్తం చేశారు.

తుదినిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే..

డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను పాత కాంట్రాక్టర్‌కే ఇవ్వడంలో తమకు ఎటువంటి అభ్యంతరం లేదని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ చెప్పారు. కానీ తాము లిఖితపూర్వకంగా ఎటువంటి ఆదేశాలు ఇవ్వమని, ఏది ఏమైనా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే ఈ విషయంపై రాష్ట్ర క్యాబినెట్‌తో చర్చించి త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్ట్ ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తూ వీలైనంత త్వరగా పూర్తి చేసేలా అడుగులు వేస్తున్నామని కూడా ఆయన వివరించారు.

కూటమి ఆలోచన అదే

‘‘పోలవరం ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తి చేయాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఈ విషయాలపైనే కేంద్రమంత్రి సీఆర్ పాటిల్, సీడబ్ల్యూసీ, పీపీఏ అధికారులతో సీఎం చంద్రబాబు గంటకు పైగా చర్చించారు. నవంబర్ నుంచి ప్రారంభమయ్యే సీజన్ నష్టపోకుండా ప్రాజెక్ట్ పనులను పూర్తి చేసేలా రూపొందించిన డిజైన్లను ఆమోదింది. వాటి ప్రకారమే పోలవరం పనుల విషయంలో ముందుకు వెళ్తున్నాం. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం పాత వారితోనే కొనసాగించడమా, కొత్త టెండర్లు పిలవడమా అన్నదానిపై చర్చించగా పాతవారికే అందించాలని ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు’’ అని చెప్పారు.

ఏజెన్సీని మార్చడం వల్లే ఆలస్యం

‘‘గతంలో ఏజెన్సీని మార్చడం వల్ల ప్రాజెక్ట్ పనులు పదేళ్లు ఆలస్యమయ్యాయి. అప్పట్లో ఏజెన్సీని మార్చొద్దని సీడబ్ల్యూసీ, పీపీఏ హెచ్చరించాయి. కానీ అప్పుడు ఏజేన్సీ మారింది. ప్రాజెక్ట్ ఆలస్యమైంది. అలాంటి తప్పులను మళ్ళీ పునరావృత్తం చేయకూడదు. 2022లో డయాఫ్రం వాల్ దెబ్బతిన్నప్పుడు మరమ్మతుల కోసం కొత్త టెండర్లు పిలిచాం. ఆ సమయంలో 29 వేల క్యూబిక్ మీటర్ల పనులను రూ.390 కోట్లకు చేయడానికి పాత సంస్థే సంసిద్దత కనబరిచింది. ఇప్పుడు నిర్మించాల్సిన కొత్త డయాఫ్రం వాల్ 73వేల క్యూబిక్ మీటర్లు. ఇప్పుడు ఈ పనులను 2022 ధరలతో ఆ సంస్థే కొనసాగిస్తే పనులు ఆలస్యం కాకుండా సాఫీగా సాగుతాయి. ప్రాజెక్ట్ కూడా త్వరగా పూర్తవుతుంది’’ అని చెప్పుకొచ్చారు.

అది ప్రభుత్వం తప్పే

‘‘గతంలో డయాఫ్రం వాల్‌ దెబ్బతినడానికి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలే కారణం. ఏజెన్సీ తప్పేమీ లేదు. అప్పటి సర్కార్ ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తిచేయకపోవడంతో ఆ ఖాళీల నుంచి 2020 ఆగస్టులో 23 లక్షల క్యూసెక్కుల వరదనీరు రావడంతో డయాఫ్రం వాల్ దెబ్బతిన్నది. వరద వల్ల డయాఫ్రం వాల్ ముందున్న ఇసుక 50-60 అడుగుల లోతు కూరుకుపోవడమే వాల్ దెబ్బతినడానికి కారణమని హైదరాబాద్ ఐఐటీ చెప్పింది. పాత ప్రభుత్వం ఏజెన్సీని మార్చకుండా పాత ఏజెన్సీనే కొనసాగించి ఉంటే 2019 నాటికి 70-80శాతం పూర్తయిన కాఫర్ డ్యామ్.. 2020 జూన్-జూలై నాటికి పూర్తయి ఉండేది. కానీ ఆ పని చేయకుండా ఏజెన్సీ మార్చాలంటూ పాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతిన్నది’’ అని వివరించారు.

Tags:    

Similar News