మారిన ఇసుక కొనుగోలు విధానం
ఇసుక కొనుగోలు విధానం మారింది. కావాల్సిన వారు సీనరేజీ చెల్లించి తీసుకుపోవొచ్చు. ఎవరికైనా ధర ఒకటిగానే ఉంటుంది. కొత్త మార్గదర్శకాలు ఈనెల 8 నుంచి అమలు కానున్నాయి.
ఇసుక వివాదం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుమ్మురేపింది. గత ప్రభుత్వం ఓటమి పాలు కావడానికి ఇసుక పాలసీ కూడా ఒక కారణం. ఈ కారణంగా భవన నిర్మాణాల్లో ఇబ్బందులు ఏర్పడ్డాయి. కూలీలకు పనిలేకుండా పోయింది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నామినల్ ధరకు ఇసుక ఇచ్చే వారు. ఆ తరువాత వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏకంగా ఇసుక టన్ను ధరను మూడింతలు పెంచింది. పైగా ఇసుక అందుబాటులో లేకుండా చేసింది. దీంతో కట్టడాలు ఎక్కడికక్కడ కునారిల్లాయి. కాంట్రాక్టర్లు దిమ్మరపోయారు. బిల్డర్లు భవన నిర్మాలు కొంత కాలం ఆపివేశారు. కొత్తగా కట్టే వారు వాయిదా వేసుకున్నారు. ఇక సాధారణ వ్యక్తులు ఇల్లు నిర్మించుకుందామంటే టన్ను ఎనిమిది వేల నుంచి 15 వేల రూపాయల వరకు పెట్టి కొనుగోలు చేయాల్సి వచ్చింది. అటువంటి పరిస్థితులు ఇప్పుడు మారనున్నాయి. టన్ను ఇసుక ట్రాన్స్‌పోర్టు చార్జీలతో సంబంధం లేకుండా కేవలం రూ. 88లకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గనులశాఖ అధికారులు కొత్త పాలసీని రూపొందించారు. కొత్త ఆదేశాలు ఈనెల 8 నుంచి అమలులోకి రానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.