ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిర్చి ధరలు ఉన్నట్లుండి భారీగా పడిపోయాయి. ఈ ఏడాది మిర్చి పంట ఆశా జనకంగా ఉండటం భారీగా దిగుబడులు వస్తుండటంతో మిర్చి రైతులు ఆనందంతో ఉన్నారు. మార్కెట్‌లో నాణ్యమైన మిర్చి క్వింటా ధర రూ. 30వేల వరకు పలికింది. అన్ని రకాల మిర్చి ఇటీవల వరకు రూ. 25వేల నుంచి రూ. 30వేల వరకు అమ్మకాలు జరిగాయి. వ్యాపారులు కూడా రైతుల నుంచి భారీగానే మిర్చిని కొనుగోలు చేశారు.
ఇపుడు ఒక్క సారిగా ధరలు నేల చూపు చూడటంతో రైతులు దిక్కు తోచని స్థితికి వెళ్లారు. ఆరుగాలం కష్టించి చమటోడ్చి పని చేసి పండించి శ్రమకు తగిన ఫలితం దక్కిందన్న ఆనందం ఎంతో సేపు నిలవలేదు. మార్కెట్‌లో ఒక నెల రోజులు మాత్రమే రైతులకు మంచి ధరలు వచ్చాయి. 5 నుంచి 15వేల వరకు తగ్గుదల
పది రోజులుగా మిర్చి యార్డులో మిర్చి ధరలు తగ్గుతూ వచ్చాయి. నాణ్యమైన మిర్చి క్వింటా ధర ప్రస్తుతం రూ. 20వేలకు మించి లేదు. ఒక్క సారిగా మిర్చి ధరలు తగ్గడంతో అటు వ్యాపారుల్లోను ఇటు రైతుల్లోను ఒక విధమైన నిస్తేజం చోటు చేసుకుంది. ప్రస్తుతం మంచి రంగున్న మిరపకాలు కేజీ రూ. 200లకు పైన కొనుగోలు కావడం లేదు. పది రోజుల క్రితం కేజీ రూ. 300లకు కొనుగోలు చేసిన తేజా బెస్ట్ రకం, సూపర్ డీలక్స్ రకం, 355 భేడిగి బెస్ట్ రకం మిర్చి కేజీ రూ. 200 దాటడం లేదు.
గుంటూరు మిర్చి యార్డులో రోజుకు రెండు లక్షల క్వింటాళ్ల మిర్చి అమ్మకం
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు మిర్చి యార్డు దేశంలోనే కాదు ఆసియాలోనే పెద్దది. మిర్చి యార్డులో లక్షల క్వింటాళ్ల అమ్మకాలు రోజూ జరుగుతూ ఉంటాయి. యార్డుకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువుగా మిర్చి వస్తుంది. యార్డులో వేల సంఖ్యలో కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. వందల్లో తూకాలు వేసే కూలీలు ఎప్పుడు రెడీగా ఉంటారు. నిత్యం లారీల లోడులతో యార్డు రద్దీగా ఉంటుంది. కొంత మంది రైతులు కలిసి లారీల్లో మిర్చిని తీసుకొస్తుంటే వ్యాపారులు రైతుల వద్ద నేరుగా కొనుగోలు చేసి లారీల్లో తెచ్చి విక్రయిస్తుంటారు. ప్రతి రోజూ లక్ష క్వింటాళ్లకు కొనుగోళ్లు ఎప్పుడు తగ్గలేదు. ప్రస్తుతం లక్షన్నర నుంచి రెండు లక్షల క్వింటాళ్లు మిర్చి యార్డులో కొనుగోలు జరుగుతోంది.
నిండిన కోల్డ్ స్టోరేజీలు
అటు గుంటూరు నుంచి చిలకలూరి పేట వరకు ఇటు విజయవాడ వైపు మొత్తం వందకుపైగా కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయి. ఈ కోల్ట్ స్టోరేజీల్లో రైతుల కంటే వ్యాపారులే మిర్చిని ఎక్కువుగా స్టాక్ చేశారు. రేటు కొద్ది కొద్దిగా తగ్గుతుండటంతో రైతుల వద్ద ముందుగా కొనుగోలు చేసిన వ్యాపారులు కోల్ట్ స్టోరేజీల్లో మిర్చి బస్తాలను నిల్వ చేశారు. ఇప్పటి వరకు కోటి బస్తాలను నిల్వ చేసినట్లు మిర్చి యార్డు వ్యాపారులు చెబుతున్నారు. కోల్ట్ స్టోరేజీలు ఫుల్ కావడంతో మిర్చి ధరలు డల్ అయ్యాయి.
ఏపిలో 2.25లక్షల హెక్టార్లలో మిర్చి సాగు
ఆంధ్రప్రదేశ్‌లో మిర్చి సాగు సుమారు 2.25లక్షల హెక్టార్లలో ఉంది. హెక్టారుకు 45 నుంచి 50 క్వింటాళ్ల వరకు మిర్చి దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలు, మిచౌంగ్ తుపాను ప్రభావానికి చాలా చోట్ల పంట దెబ్బతినిందని భావించినా దిగుబడులు మాత్రం పెద్దగా తగ్గలేదు. అయితే చాలా చోట్ల కాయ రంగు మారిందని రైతులు చెబుతున్నారు. రంగు మారిన కాయలను వ్యాపారులు క్వింటాలు రూ. 10వేలకు కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేదు. పెట్టుబడులు ఎకరాకు రూ. లక్ష వరకు అయ్యాయని, పెట్టుబడికి, శ్రమకు తగిన ఫలితం ధరల తగ్గుదల వల్ల రాకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒక్క సారిగా ధరలు తగ్గడం పట్ల ప్రకాశం జిల్లా ఎర్రగొండ పాళె మిర్చిరైతు నారు వెంకట రెడ్డి ఆశ్చర్యం వక్తం చేశారు.
"పది రోజుల క్రితం ఉన్న ధరలకు ఇప్పటి ధరలకు దాదాపు 30 నుంచి 40 శాతం తేడా వచ్చింది. మొదట్లో వ్యాపారులు కొనుగోలు చేశారు. ప్రస్తుతం అంత ఎక్కువుగా కొనడం లేదు. ధరలు కూడా బాగా తగ్గిస్తున్నారు. తాలు కాయకు క్వింటాకు రూ. 4వేలకు మించి ధర రావడం లేదు. ఒక ఎకరా మిర్చి పంటకు కనీసంగా పెట్టుబడి ఖర్చులు రూ. లక్ష వరకు అవుతున్నాయి. ఎకరా మిర్చి అమ్మకానికి కనీసం రూ. 3లక్షల వస్తే ఫలితం దక్కినట్లే. లేదంటే కోత కూలీ కూడా మిగిలే పరిస్థితి ఉండదు," అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి ధరలు తగ్గించారని ఆయన చెబుతున్నారు. లేకపోతే, ధరలు తగ్గే అవకాశం లేదనేది ఆయన వాదన
"ప్రపంచ మార్కెట్ లో మిర్చి ధరలు కానీ, మిర్చి పౌడర్ ధరలు కానీ ఏ మాత్రం తగ్గ లేదు. ఊహించిన దాని కంటే గుంటూరు మిర్చి యార్డుకు మిర్చి రావడంతో వ్యాపారులు సిండికేట్ అయి ధరలు పడిపోయేలా చేశారు," వెంకట రెడ్డి అన్నారు. ఇపుడు తమ నిల్వ ఉంచుకునేందుకు కోల్ట్ స్టోరేజీలు కూడా ఖాళీ లేక పోవడం మిర్చి ధరలు పడి పోవడానికి రెండో కారణమని ఆయన అన్నారు.
మంగళవారం రోజు గుంటూరు మిర్చి యార్డులో ధరల వివరాలు
తేజా బెస్ట్ రకం ప్రస్తుతం క్వింటా రూ. 20వేలుగా ఉంది. పది రోజుల క్రితం ఇదే క్వింటా ధర రూ. 30వేల వరకు అమ్మింది. సూపర్ డీలక్స్ రకం కూడా రూ. 2,500 వరకు క్వింటా కొనుగోలు జరుగుతోంది. మరో రకమైన 355 భెడిగి, బెస్ట్ రకం ధరం కూడా పడిపోయింది. అలాగే 2043 భెడిగి, సిజెంటా భెడిగి, సువర్ణా బెడిగీ, 341రకం, నంబరు 5రకం, డిడి రకం, షార్క్ రకం, 273 రకం, కుబేర రకం, ఆర్మూరు రకం, బంగారం రకం, బుల్లెట్ రకం, రొమి రకం, క్లాసిక్ రకం, ఎల్లో రకాలు క్వింటాకు రూ. 10 నుంచి రూ. 14వేల వరకు ధరలు తగ్గాయి. ఇక మీడియం సీడ్ రకాలు నాటు మిరప కాయ రకాల ధరలు కూడా తగ్గాయి. ఆ రోజు మార్కెట్‌లోని డిమాండ్‌ను బట్టి మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. మరీ తక్కువ పలుకుతుందన్నప్పుడు రైతులు మిర్చిని అమ్మడానికి ఇష్టపడటం లేదు. అందువల్ల రైతులు ఒకటి రెండు రోజుల పాటు మార్కెట్ వద్దే పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.