కూటమిలో బదిలీల చిచ్చు.. జనసేన గుర్రు

గన్మెన్లను వెనక్కి పంపడంపై పెను దుమారం. వారితో జతకట్టిన మరో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే. భారీగా సొమ్ములు చేతులు మారాయని ఆరోపణలు.

Update: 2024-09-02 13:00 GMT

(బొల్లం కోటేశ్వరరావు - విశాఖపట్నం) 

తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే ఆధిపత్య పోరు మొదలైంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో తాజాగా జరిగిన పోలీసు సీఐల బదిలీల్లో ఇది బహిర్గతమైంది. ఈ బదిలీల్లో తమ సిఫార్సులు చెల్లకుండా పోవడం వీరిలో తీవ్ర మనస్థాపానికి, అసంతృప్తికి కారణమైంది. తాము సిఫార్సు చేసిన వారిని కాకుండా వేరెవరినో నియమించడంపై వీరు రగిలిపోతున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పుడు మౌనంగా ఉంటే మున్ముందు ఇదే ఆసరాగా తీసుకుని తమను లెక్క చేయరన్న భావన వీరిలో బలంగా ఉంది. అందుకే సీఐల బదిలీల్లో తమ మాటకు విలువ లేకుండా పోవడంపై వీరు గుర్రుగా ఉన్నారు. సాధారణంగా తమ నియోజకవర్గాల్లో పనులు కావాలన్నా, సెటిల్మెంట్లు అనుకూలంగా జరగాలన్నా చెప్పుచేతల్లో ఉండే పోలీసు అధికారులు (సీఐలు, ఎస్ఐలు) ఉండాలని ప్రజాప్రతినిధులు/ఎమ్మెల్యేలు కోరుకుంటారు.

 

అందుకే బదిలీల సమయంలో ఫలానా సీఐ/ఎలను తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో నియమించాలని పోలీసు ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తుంటారు. చాలావరకు వారి సిఫార్సుల మేరకు నియామకాలు జరుగుతుంటాయి. సీఐల బదిలీల సంగతి తెలుసుకుని యధావిధిగా కూటమి ఎమ్మెల్యేలు తమకు ఫలానా సీఐ కావాలంటూ పోలీస్ కమిషనర్కు సిఫార్సు లేఖలు పంపారు. మూడు రోజుల క్రితం విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 48 మంది సీఐలను కమిషనర్ శంఖుబ్రతబాగ్చీ బదిలీ చేశారు. ఈ బదిలీల్లో జనసేన ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన వారు కాకుండా వేరొకరికి పోస్టింగ్లు ఇవ్వడంతో వీరు కంగుతిన్నారు.

 

కనీసం సీఐల పోస్టింగుల్లోనూ తమకు విలువ లేకుండా పోతే ఇంకెందుకు? అంటూ వీరు రగిలిపోతున్నారు. ఇది తనకు తీవ్ర అవమానంగా భావించిన పెందుర్తి (జనసేన) ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు ఏకంగా తన గన్మెన్లను వెనక్కి పంపించేసి నిరసనను తెలియజేశారు. ఇదే తరహాలో అసంతృప్తిగా ఉన్న జనసేనకు చెందిన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా పంచకర్ల మాదిరిగానే తన గన్మెన్లను కూడా సరెండర్ చేయడానికి సిద్ధమయ్యారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో నలుగురు జనసేన నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరిలో యలమంచిలి జనసేన శాసనసభ్యుడు సుందరపు విజయకుమార్ కోరుకున్న నలుగురు సీఐల్లో ఒక్కరికే పోస్టింగ్ ఇవ్వడంతో ఆయన కూడా అసంతృప్తితో రగిలిపోతున్నారని చెబుతున్నారు.

 

ఇక మాజీ మంత్రి, సీనియర్ నేత, అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సిఫార్సులు కూడా సీఐల బదిలీల్లో చెల్లుబాటు కాకుండా పోయాయని అంటున్నారు. ఇలా ఇప్పుడు జరిగిన సీఐల బదిలీల్లో టీడీపీ ఎమ్మెల్యేలే చక్రం తిప్పారని, వారి నియోజకవర్గాల్లోనే కాదు.. తమ నియోజకవర్గాల్లోనూ వారికి కావలసిన వారినే వేయించుకున్నారని జనసేన ఎమ్మెల్యేలు లోలోన గుర్రుగా ఉన్నారు. సీఐల బదిలీల్లో తమకు ప్రాధాన్యత ఇవ్వనప్పుడు మౌనంగా ఉంటే మున్ముందు ఇతర అంశాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందన్న భావనలో జనసేన ఎమ్మెల్యేలున్నారు. అందుకే సీఐల బదిలీల వ్యవహారంపై నిరసన గళం విప్పాలన్న భావనలో ఉన్నట్టు తెలుస్తోంది.

 

సిటీలో పోస్టింగులకు డిమాండ్..

విశాఖ సిటీలో సీఐల పోస్టింగులకు చాలా డిమాండ్ ఉంటుంది. సిటీ పరిధిలో పోస్టింగ్ వేయించుకుంటే మంచి రాబడితో పాటు తమ పిల్లల చదువులకు అనువుగాను ఉంటుంది. అందుకే ఎలాగైనా రేంజి నుంచి సిటీలోకి అడుగు పెట్టాలని కోరుకుంటారు. దీనిని ఆసరాగా చేసుకుని లాభదాయకమైన పోలీస్ స్టేషన్లకు బదిలీ చేయించుకోవడానికి రూ.లక్షల్లో చేతులు తడుపుతారన్న ప్రచారం ఎప్పట్నుంచో ఉంది. ఇందుకోసం మంత్రులతోను, స్థానిక ఎమ్మెల్యేలతో సిఫార్సులు చేయించుకుంటారు. కానీ వీరి బదిలీల్లో తమకంటే టీడీపీ ఎమ్మెల్యేల సిఫార్సులకే పెద్ద పీట వేశారన్న భావన జనసేన శాసనసభ్యుల్లో ఉంది. మరోవైపు సీఐల బదిలీల్లో జిల్లాకు చెందిన ఓ కీలక నేతపై అవినీతి ఆరోపణలు గుప్పు మంటున్నాయి. కాగా సీఐల పోస్టింగుల వ్యవహారంలో జనసేన ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారన్న సంగతి తెలుసుకున్న సీపీ.. వీరు సిఫార్సు చేసిన వారిని కాకుండా వేరొకరని ఎందుకు నియమించాల్సి వచ్చిందో ఫోన్లో వివరించినట్టు సమాచారం. కొందరు సీఐల పనితీరును పరిగణనలోకి తీసుకునే పోస్టింగులు ఇచ్చినట్టు చెప్పారని తెలిసింది. మొత్తమ్మీద విశాఖలో సీఐల బదిలీల ఎపిసోడ్ కూటమిలోని జనసేన, టీడీపీ ఎమ్మెల్యేల మధ్య లుకలుకలకు ఆజ్యం పోసినట్టయింది.

Tags:    

Similar News