రాజకీయ చదరంగంలో వృద్ధులు బలవుతున్నారా!

ఆంధ్రలో పింఛన్‌ల పంపిణీపై సీఐటీయూ ప్రధాన కార్యదర్శి మురళి ఘాటుగా స్పందించారు. పార్టీ రాజకీయ చదరంగంలో వృద్ధులు బలవుతున్నారని అన్నారు.

Update: 2024-05-09 09:22 GMT

ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధులకు పింఛన్ వ్యవహారం మరోసారి దుమారం రేపుతోంది. గత నెల అనేక ఇబ్బందుల తర్వాత వృద్ధులకు పింఛన్లు వచ్చాయి. దీంతో ఇటువంటి ఘటనలు మరోసారి పునరావృత్తం కాకూడదని, మే నెలలో పింఛన్ల పంపిణీ ప్రక్రియ అవాంతరాలు లేకుండా జరగాలని, దానికి తగిన అన్ని చర్యలు ప్రభుత్వం ఇప్పటి నుంచే తీసుకోవాలని ఏప్రిల్ ఆఖరి వారంలో ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అయినా ఆంధ్రలో మే నెలలో పింఛన్ల పంపిణీ కూడా తీవ్ర వివాదంగా మారిపోయింది.

వృద్ధులకు వారి బ్యాంకు ఖాతాల్లోకి పింఛన్ నగదు జమ చేస్తున్నామంటూ యాక్షివ్‌లో లేని ఖాతాల్లోకి ప్రభుత్వం డబ్బు పంపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దాంతో ఇప్పుడు ఈ మండుటెండల్లో వృద్ధులు మరోసారి పింఛన్ కోసం బ్యాంకుల చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సి వస్తుంది. దానికి తోడు ఎక్కడలేని పేర్లు చెప్పి.. వాటికి ఛార్జీలు అంటూ వృద్ధుల దగ్గర నుంచి వందల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ చర్యలన్నింటినీ సీఐటీయూ తీవ్రంగా ఖండించింది. వృద్ధులకు పింఛన్లను ఇంటివద్దకే తీసుకెళ్లి ఇవ్వాలని సీఐటీయూ.. తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి కోరారు.

ఛార్జీలు తిరిగి ఇచ్చేయాలి

‘‘ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్ వ్యవస్థను వినియోగించలేకున్నామని, అందువల్ల వృద్ధులకు పింఛన్‌ను బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు రకరకాల కారణాలు చెప్తూ లబ్ధిదారుల దగ్గర నుంచి ఛార్జీలు వసూలు చేస్తున్నారు. హామీ ఇచ్చేటప్పుడు ఇంటికే పింఛన్ అన్నారు. ఇప్పుడు బ్యాంకులో పింఛన్ అంటూ వృద్ధులను ఇబ్బందులకు గురి చేయడం అన్యాయం. ఈ వైఖరిని సీఐటీయూ తీవ్రంగా ఖండిస్తోంది. వృద్ధుల నుంచి బ్యాంకులు ఎటువంటి ఛార్జీలు వసూలు చేయకూడదు. ఇప్పటివరకు వసూలు చేసిన ఛార్జీలను కూడా వెనక్కి ఇచ్చేయాలి’’అని ఆయన డిమాండ్ చేశారు.

‘‘రాష్ట్రంలో మొత్తం 65.49 లక్షల మంది పింఛన్ లబ్దిదారులు ఉంటే వారిలో 48.92 లక్షల మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. వాటిలో నేరుగా పింఛన్ నగడు జమ అవుతుందని అధికారులు ప్రకటించారు. దీని వల్ల వృద్ధుల నానాతంటాలు పడుతున్నారు. పింఛన్ పంపిణీకి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఎన్నికల సంఘం చెప్పినా ప్రభుత్వం అలసత్వం వల్ల వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. మండుతున్న ఎండలను వృద్ధులు తట్టుకోలేకున్నారు. బ్యాంకుల దగ్గర వృద్దులకు కనీస సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయలేదు. ఆఖరికి కదలేని స్థితిలో ఉన్న వృద్ధులకు కూడా బ్యాంకు ఖాతాల్లో నగదును జమ చేశారు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతూ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ పరిస్థితికి ప్రభుత్వమే కారణం’’ అని వివరించారాయన.

రాజకీయ చదరంగంలో బలవుతున్న పింఛన్‌దార్లు

‘‘వృద్ధుల పింఛన్ సొమ్మును ఒకవైపు బీజేపీ బ్యాంకులు ఛార్జీల పేరుతో దండుకుంటుంటే మరోవైపు వైసీపీ మాత్రం వీటిని తన రాజకీయం కోసం వినియోగించుకుంటుంది. ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఆడుతున్న రాజకీయ చదరంగంలో వృద్ధులు బలిపశువుల్లా మారారు. ఇది ఏమాత్రం తగదు. తక్షణమే పింఛన్ లబ్దిదారుల సమస్యలను నెరవేర్చాలి. వారికి వెంటనే పింఛన్ అందేలా చర్యలు తీసుకోవాలి’’అని ఆయన కోరారు.

Tags:    

Similar News