సబ్ కలెక్టర్ ఆఫీసులో అగ్నిప్రమాదం.. ప్రమాదామా ప్లాన్డ్‌గానేనా!

అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కీలక ఫైల్స్ దగ్దమయ్యాయి. నూతన సబ్ కలెక్టర్ బాధ్యతలు స్వీకరించడానికి గంటల ముందు ఈ ప్రమాదం జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

Update: 2024-07-22 07:04 GMT

అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కీలక ఫైల్స్ దగ్దమయ్యాయి. నూతన సబ్ కలెక్టర్ బాధ్యతలు స్వీకరించడానికి గంటల ముందు ఈ ప్రమాదం జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అసలు ఇది యాదృచ్చికంగా జరిగిన ప్రమాదమా? లేకుంటే ఎవరైనా కావాలని ప్లాన్ ప్రకారం చేసిందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇదే అనుమానాన్ని సీఎం చంద్రబాబు కూడా వ్యక్తపరిచారు. వెంటనే ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి సమగ్ర సమాచారంతో వెంటనే నివేదిక అందించాలని, ఈ ప్రమాదంలో దగ్దమైన ఫైళ్లకు సంబంధించి కూడా సమాచారం ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు.

సీరియస్‌ అయిన ప్రభుత్వం

ఈ ఘటనపై చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం సీరియస్ అయింది. భూములకు సంబంధించి కీలక ఫైల్స్ దగ్దం అయ్యాయన్న ఆరోపణలపై సీఎం సీరియస్ అయ్యారు. ఈ ప్రమాదం ఉద్దేశ్యపూర్వకంగా జరిగిందా లేదంటే ఏంటనేది వివరించాలన్నారు. ఈ మేరకు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితులు తెలుసుకోవాలని, ఇందుకోసం హెలికాప్టర్‌లో వెళ్లాలని డీజీపీ ద్వారక తిరుమలరావుకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ఆదేశాలనుసారం డీజీపీ, సీఐడీ చీఫ్ ఇద్దరూ కలిసి హెలికాప్టర్‌లో మదనపల్లికి చేరుకున్నారు. ఇదిలా ఉంటే అగ్నిప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. అప్పటికే కొన్ని ఫైళ్లు దగ్దమైనట్లు అధికారులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు.

ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష

ఈ ఘటనపై అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో సీఎం నారా చంద్రబాబు నాయుడు.. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎస్ నీరభ్ కుమార్, ఇంటెలిజెన్స్ చీఫ్ మమేశ్ చంద్ర లడహా కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ ప్రమాదంలో అసైన్డ్ భూముల దస్త్రాలు దగ్డమైనట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ఘటనాస్థలంలోని అన్ని సీసీటీవీ ఫుటేజీలను బయటకు తీయాలని చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్‌తో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. రాత్రి 11:24 గంటలకు ప్రమాదం జరిగినట్లు అధికారులు సీఎంకు వివరించారు. కాగా ఈ ప్రమాదంపై అధికారుల నుంచి సత్వర స్పందన ఎందుకు లేదని ప్రశ్నించారు సీఎం. ఆదివారం రాత్రి 10:30 గంటలకు వరకు గౌతమ్ అనే ఉద్యోగి ఉన్నట్లు గుర్తించారు. అప్పటి వరకు అతడు కార్యాలయంలో ఎందుకు ఉన్నాడు? ఏ పని కోసం అతడు ఆ సమయంలో ఆఫీసుకు వెళ్లాడు? అన్న వివరాలు అందించాలని సీఎం కోరారు.

ఉద్యోగిపై అనుమానాలు

సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగిన అగ్ని ప్రమాదంలో రెవెన్యూ రికార్డులు, కంప్యూర్లు, సామాగ్రి అగ్నికి ఆహుతయ్యాయని అనుమానాలు రేకెత్తుతున్నాయి. కాగా ఈ ప్రమాదంలో ఏయే ఫైళ్లు దగ్దమయ్యాయి అన్న పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. కాగా గౌతమ్ అనే ఉద్యోగి కార్యాలయంలో రాత్రి 12 గంటల వరకు ఉన్నట్లు సమాచారం. అతడు అప్పటి వరకు ఆఫీసులో ఎందుకు ఉన్నాడు? అసలు ఆ సమయంలో అతడు ఆఫీసులో ఏం పనిపై ఉన్నాడు? అన్న అనుమానాలు రేకెత్తుతున్న క్రమంలో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పూర్తి సమచారం అందాల్సి ఉంది.

Tags:    

Similar News