హైడ్రా తరహా చర్యలు తప్పవు.. రుషి కొండపై సీఎం ఫోకస్ పెట్టారన్న మంత్రి

ఆంధ్రప్రదేశ్‌లోని ఓ మంచి పర్యాటక ప్రాంతం రుషి కొండ. కానీ ఇప్పుడు అక్కడ సగంపైగా కొండ మాయమైంది. వైసీపీ హయాంలో కొండను పెకలించి అక్కడ పలు భవనాలు కట్టారు.

Update: 2024-08-27 07:24 GMT

ఆంధ్రప్రదేశ్‌లోని ఓ మంచి పర్యాటక ప్రాంతం రుషి కొండ. కానీ ఇప్పుడు అక్కడ సగంపైగా కొండ మాయమైంది. వైసీపీ హయాంలో కొండను పెకలించి అక్కడ పలు భవనాలు కట్టారు. వాటిని ఎందుకు కట్టారు? అనేది ఇప్పటికీ ఓ మిస్టరీనే. ఇటీవల రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత రుషి కొండపై కట్టిన కట్టడాల తాళాలు తెరుచుకున్నాయి. ఆ భవనాల లోపలి భాగాలను చూసి యావత్ ప్రపంచం నోరెళ్లబెట్టింది. రాజుల ప్యాలెస్‌లు కూడా రుషికొండ ప్యాలెస్ ముందు దిగదుడుపే అని అంతర్జాతీయ మీడియా కూడా చెప్పింది. దానిని బట్టే అర్థం చేసుకోవచ్చు.. రుషి కొండపై కట్టిన విళాసవంతమైన భవనం ఏ రేంజ్‌లో ఉంది. ఎటువంటి ప్రకటన లేకుండా.. రుషి కొండపై వైఎస్ జగన్ ప్రభుత్వం ఎందుకు నిర్మించిందో తెలీదు. ప్రభుత్వం మారిన తర్వాత రాష్ట్రం మొత్తాన్ని షేక్ చేసిన విషయాల్లో ఇదొకటి. అప్పటి నుంచి ఈ ప్యాలెస్‌లను ఏం చేస్తారన్నది మరో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. కాగా తాజాగా రుషి కొండ దుస్థితిపై మంత్రి నారాయణ స్పందించారు. రుషి కొండపై సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పెషల్ ఫోకస్ పెట్టారని నారాయణ వెల్లడించారు.

విశాఖపట్నంలోని కాపులుప్పాడ డంపింగ్ యార్డును ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌తో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్‌ను సందర్శించారు. అనంతరం రుషి కొండ అంశంపై మాట్లాడారు. గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. ప్రతి శాఖలో అవినీతి తాండవం చేసిందని, అక్రమాలు పెరిగిపోయాయని, ప్రతి శాఖ గాడి తప్పి నడిచిందంటూ విమర్శలు గుప్పించారు. రుషి కొండపై కూడా భారీగా భవనాలు నిర్మించి.. వాటిని ఎందుకు కట్టారో కూడా ప్రజలకు తెలపని ప్రభుత్వం వైసీపీ దంటూ మండిపడ్డారు. తీరా ప్రభుత్వం మారిన తర్వాత ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్.. అధికారులతో కలిసి ఆ భవనాల తాళాలు తెరిపించారని, లోపలికి వెళ్లి చూసిన వారంతా షాక్ అయ్యారని, రాజమహల్ కట్టించినట్లు కట్టించారని, వాటిని అంతలా నిర్మించడానికి కారణాలను ఇప్పటికి కూడా వైసీపీ నేతలు చెప్పలేకున్నారంటూ దుయ్యబట్టారు. కొందరు నోరుజారి.. అది జగన్ ఇల్లు అని కూడా చెప్పారని గుర్తు చేశారు. రుషి కొండ, దీని చుట్టూ జరిగిన రాజకీయాలపై చంద్రబాబు ఫోకస్ పెట్టారని కూడా ఆయన వెల్లడించారు. అనంతరం వేస్ట్ మేనేజ్ మెంట్ గురించి చెప్పారు.

‘‘ఇతర దేశాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిర్వహణలో దుర్వాసన లేదు. ఆ విధానంపై అధ్యయనం చేసి ఇక్కడ కూడా అదే విధానాన్ని అమలు చేస్తాం. గత ఐదేళ్లలో ఒక్క మంత్రి కూడా ఈ ప్లాంట్‌ను సందర్శించలేదు. 2023లో ఈ ప్లాంట్‌కు రూ.450 కోట్లు నిధులు వస్తే వాటిని పక్కదారి పట్టించారు. అతి త్వరలోనే గత ప్రభుత్వంలో జరిగిన భూ ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి పెడతాం. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన కట్టిన నిర్మాణాలను వదులుకోవాలని పిలుపునిస్తున్నా. లేకుంటే మేమే స్వాధీనం చేసుకుంటాం. ఆక్రమిత భవనాల్లో కొన్నింటిని ఇప్పటికే పడగొట్టాం. కాదూకూడదు అంటే ఇక్కడ కూడా హైడ్రా వంటి చర్యలు చేపట్టాల్సి ఉంటుంది’’ అని హెచ్చరించారు.

Tags:    

Similar News