క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. మంత్రులకు చంద్రబాబు వార్నింగ్
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుకు చంద్రబాబు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. అనంతరం మంత్రులతో చర్చించిన చంద్రబాబు వారికి స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. దేనికంటే..
తన మంత్రి వర్గంతో ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ క్యాబినెట్ సమావేశంలో ఆయన పలు కీలక అంశాలపై చర్చించారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఓటాన్ బడ్జెట్ గడువు ఈ నెలాఖరుకు ముగియనుంది. దానిపై కూడా ఈ భేటీలో చర్చ జరగనుంది. వాటితో పాటు గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు, వాటి వల్ల తలెత్తిన కొన్ని సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వీటి విషయంలో క్యాబినెట్ కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది క్యాబినెట్. వాటిలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్, ఉచిత ఇసుక పంపిణీ, బడ్జెట్‌పై చర్చించారు. వీటిలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలోనే ప్రజల భుములకు రక్షణ కల్పించడానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా క్యాబినెట్ చర్చించింది.
దీంతో పాటుగా కొత్త ఇసుక విధానం, పౌరసరఫరాల శాఖ రూ.2 వేల కోట్ల రుణానికి ప్రభుత్వం గ్యారెంటీ వంటి అంశాలకు ఆమోదముద్ర వేసింది క్యాబినెట్. నూతన ఇసుక విధానానికి సంబంధించి త్వరలోనే విధి విధానాలను కూడా రూపొందించనున్నట్లు క్యాబినెట్ సమావేశంలో తేలింది. రైతులు ధాన్యం కొనుగోలు కోసం ఎన్సీడీసీ నుంచి రూ.3,200 కోట్ల రుణానికి వ్యవసాయ, సహకార కార్పొరేషన్‌కు ప్రభుత్వ గ్యారెంటీ ఇవ్వడానికి కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మరికొన్ని కీలక అంశాలకు కూడా క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి ప్రారంభించాలి అన్న విషయంపై కూడా క్యాబినెట్ సమావేశంలో వాడివేడి చర్చ జరిగింది. చివరకు ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించాలని క్యాబినెట్ తీర్మానించింది. సమావేశం ముగిసిన వెంటనే చంద్రబాబు నాయుడు.. మంత్రులతో మరికొన్ని అంశాలపైన కూడా చర్చించి పలు కీలక సూచనలు చేశారు.
పనితీరుపై ఫోకస్
మంత్రులతో చర్చించి చంద్రబాబు.. కూటమి ప్రభుత్వం ఈ నెల రోజుల్లో చేసిన పనితీరుపై చర్చించారు. పనితీరును మరింత పెరుగుపరిచేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, ఎప్పటికీ కూడా ఇంత పని చాలు అన్న ధోరణిలో ఉండకూడదని మంత్రివర్గాన్ని ఉత్తేజపరిచారు. ప్రజలకు సమస్యలు ఉన్నంత కాలం మన పని పూర్తయినట్లు కాదని చెప్పారు చంద్రబాబు. అదే సమయంలో రాష్ట్ర ఖజానా పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులను సాగించాలని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం పూర్తిగా లోటు బడ్జెట్‌లో ఉందని, దానికి గ్రహించి ప్రతి ఒక్కరు మసులుకోవాలని వివరించారు. శాఖా పరంగా హెచ్‌ఓడీలతో మంత్రులు ప్రతి నెలా సమీక్షలు చేపట్టాలని, అందులో నెల మొత్తం చేసిన పనులు, ఇంకా జరుగుతున్న పనుల పురోగతి వంటి అంశాలై చర్చించాలని ఆదేశించారు. అధికారులతో సమావేశం ముగిసిన తర్వాత సమావేశంలో చర్చించిన అంశాలకు సంబంధించి పూర్తి సమాచారన్ని ప్రజలకు కూడా తెలపాలని చెప్పారు చంద్రబాబు.
అధికారాన్ని అలంకారంగానే ఉంచుకోండి
అధికారం వచ్చింది కదా అని తలబిరుసుగా ప్రవర్థించవద్దని కూడా మంత్రులకు చంద్రబాబు సూచించారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అలంకారంగానే ఉంచుకోవాలి తప్ప అహంకారంగా మార్చుకుని తలకెక్కించుకోవద్దని హెచ్చరించారు. అలా ఎవరైనా చేస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని, దానిని స్పృహలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సూచించారు. మంత్రులు అందరూ కూడా పార్టీ కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని, ఎమ్మెల్యేలతో పంతాలకు పోకుండా సమన్వయంతో మంత్రులు నడుచుకోవాలని హితబోధ చేశారు. మనం ఏ స్థాయిలో ఉన్న మనకు ప్రజల ఆశీస్సులు ముఖ్యమని, వారికి సేవ చేస్తేనే మనకు మనుగడ ఉంటుందని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, వారినే ఎదిరించి నా అంతడి వాడు లేడంటే దెబ్బ కొడుతారని, ప్రజలు కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో ఈ ఏడాది జరిగిన ఎన్నికలు చూపించాని, కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రజాప్రతినిధులుగా, ప్రజాసేవకులుగా మెలగాలని సూచించారు.
మంత్రులకు స్వీట్ వార్నింగ్
ఈ సందర్బంగానే మంత్రులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఉచిత ఇసుక విధానంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ తలదూర్చొద్దని, అనవసర విషయాల్లో జోక్యం చేసుకుని చెడ్డ పేరుతెచ్చుకోవద్దని చెప్పారు చంద్రబాబు. ‘‘అక్టోబర్ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఇసుక రీచ్‌లు అందుబాటులోకి వస్తాయి. బోట్ సొసైటీలకు కూడా అనుమతిస్తున్నాం. డంప్ యార్డుల్లో 43 లక్షల టన్నుల ఇసుక ఉంది. మూడు నెలల్లో కోటి టన్నుల ఇసుక కావాలి. నదుల్లో పూడిక, బోట్ సొసైటీల ద్వారా 80 లక్షల టన్నుల ఇసుక వస్తుంది. ప్రతి అంశంపై కూడా కొత్త మంత్రులు ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలి’’ అనిచెప్పారు.