రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు.;
By : The Federal
Update: 2025-03-17 05:30 GMT
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్య వరుస ఢిల్లీ టూర్‌లు చేస్తున్నారు. ఇటీవల ఢిల్లీ టూర్‌లో ఉన్న సీఎం చంద్రబాబు అక్కడ నుంచి నేరుగా తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తక ఆవిష్కరణకు ప్రత్యేక విమానంలో విశాఖకు వెళ్లారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారనే దానిమీద సర్వత్రా ఆసక్తి నెలకొంది.
2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి పనులు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదగానే ప్రారంభింప చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. నాడు పార్లమెంట్ నుంచి మట్టి, నీళ్లు తీసుకొచ్చారు ప్రధాని మోదీ. అయితే ఈ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగానే అమరావతి పనులు పునఃప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీని కోసం ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించేందుకు సీఎం చంద్రబాబు మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు.
చంద్రబాబు ఢిల్లీ పర్యటన సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్యక్షతన సోమవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం కూడా జరగనుంది. రాజధాని అమరావతి నిర్మాణాలకు అవసరమైన సీఆర్‌డిఏ ఆమోదించిన టెండర్ల ప్రక్రియకు కూటమి కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఏప్రిల్ నెలాఖరులో అమరావతి నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు.
2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రాజధాని అమరావతి పనులు నిలిచి పోయాయి. మూడు రాజధానుల అంశం తెరపైకి తేవడంతో రాజధాని అమరావతి పనులు అడుగు ముందుకు పడలేదు. దీంతో 2024 అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణాలపై దృష్టి సారించింది. ప్రపంచ బ్యాంకుతో పాటు ఇతర ఆర్థిక సంస్థల నుంచి రాజధాని అమరావతి నిర్మాణాలకు కూటమి ప్రభుత్వం నిధులను సేకరిస్తోంది. ప్రతిష్టాత్మకమైన బ్యాంకులతో పాటు హడ్కో నుంచి కూడా నిధుల సమీకరిస్తున్నారు. అమరావతి నిర్మాణాలకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ కూడా సీఆర్‌డిఏ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం చేపట్టింది.