గ్రూప్‌–2 పై సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు

రోస్టర్‌ సమస్య కొలిక్కి వచ్చేంత వరకు పరీక్షల వాయిదాకు కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.;

Update: 2025-02-22 15:16 GMT

ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌–2 మెయిన్స్‌ పరీక్షల మీద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. గ్రూప్‌–2 మెయిన్స్‌ పరీక్షల వాయిదాకు తమ ప్రభుత్వం కట్టబడి ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు, ఈ నెల 24 సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు తదితర అంశాల మీద తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో, మంత్రులు, ఎమ్మెల్యేలతో శనివారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రూప్‌–2 మెయిన్స్‌ పరీక్షల నిర్వహణపై అభ్యర్థుల్లో నెలకొన్న గందరగోళం వంటి అంశాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు.

ఒక పక్క గ్రూప్‌–2 మెయిన్స్‌ పరీక్షలను ఆదివారం నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఉండటం, మరో వైపు రోస్టర్‌ విధానం మీద స్పష్టత వచ్చేంత వరకు పరీక్షలను నిర్వహించకుండా వాయిదా వేయాలని అభ్యర్థులు చేస్తున్న ఆందోళనలను సీఎం చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. రోస్టర్‌ విధానం మీద అభ్యర్థులు గత మూడు రోజులుగా ఆందోళనలు చేస్తున్నారని, అభ్యర్థుల ఆందోళనలు తమ దృష్టికి వచ్చాయని, ఈ సమస్య సాధ్యాసాధ్యాలను పరిశీలించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. రోస్టర్‌ విధానంపై కోర్టులో కేసు ఉండటం, ఇది మార్చి 11న విచారణ జరగనుండటం అప్పటి వరకు గ్రూప్‌–2 మెయిన్స్‌ పరీక్షలను వాయిదా వేయాలని ఏపీపీఎస్సీకి లేఖ రాసినట్టు టెలికాన్ఫరెన్స్‌లో నేతలకు వివరించారు. రోస్టర్‌ సమస్య కొలక్కి వచ్చిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలనేది ప్రభుత్వ అభిమతమని నాయకులకు సీఎం చంద్రబాబు తెలిపారు.

మరో వైపు గ్రూప్‌–2 మెయిన్స్‌ పరీక్షలను ఆదివారం నిర్వహిస్తున్నట్లు ఇది వరకే ఏపీపీఎస్సీ ప్రకటించింది. పరీక్షలు యథాతథంగానే ఉంటాయని శనివారం ఉదయం ఏపీపీఎస్సీ తెలిపింది. సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం నమ్మొద్దని, ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్‌–1, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్‌–2 ఉంటుందని, అభ్యర్థులందరూ 15 నిముషాలకు మందుగానే పరీక్షా కేంద్రాలను చేరుకోవాలని వెల్లడించింది.
అయితే ఈ ప్రకటన వెలువడిన మరి కొద్ది సేపటికే పరీక్షను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించడం, ఆ మేరకు ప్రభుత్వం ఏపీపీఎస్సీకి లేఖ రాయడం జరిగింది. అయితే ఏపీపీఎస్సీ మాత్రం ప్రభుత్వం రాసిన లేఖ మీద ఇంత వరకు స్పందించ లేదు. ప్రభుత్వమే పరీక్షలు వాయిదా వేయాలని కోరినప్పుడు ఏపీపీఎస్సీ ఎందుకు ఇంత వరకు స్పందించ లేదనేది చర్చనీయాంశంగా మారింది. ఒక వైపు పరీక్షలు జరుగుతాయని ఏపీపీఎస్సీ చెప్పడం, మరో వైపు పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయంచడంతో అభ్యర్థుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం దీనిపై క్లారిటీ ఇచ్చేశారు. పరీక్షల వాయిదాకు తాము కట్టబడి ఉన్నామని స్పష్టం చేశారు.
Tags:    

Similar News