కలెక్టర్ల కాన్ఫెరెన్స్‌లో నవ్వులు పూయించిన సీఎం చంద్రబాబు
సమయం గురించి సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సమావేశంలో నవ్వులు వెల్లువిరిశాయి. అధికార వర్గాలు ఒక్క సారిగా ఊపిరి పీల్చుకున్నారు.
కలెక్టర్ల కాన్ఫెరెన్స్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమావేశం ప్రారంభంలో సమయం గురించి చేసిన వ్యాఖ్యలతో సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన పక్కనే కూర్చున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్, ఇతర మంత్రులు, కలెక్టర్లు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు అందరూ నవ్వులు చిందించారు. దీంతో అప్పటి వరకు సీరియస్‌గా సాగుతోన్న సమావేశంలో సీఎం మాటలతో ఒక్క సారిగా నవ్వుల వాతావరణం నెలకొంది.
సమావేశంలో సీఎం చంద్రబాబు ఏమన్నారంటే.. గతంలో మాదిరిగా కాకుండా నాలుగో సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత సీఎంగా నిర్వహించే ప్రతి సమావేశంలో సమయ పాలనకు ప్రాముఖ్యత ఇస్తున్నాను. తరచుగా టైమ్ చూసుకుంటున్నాను. ఎంత సమయం అయిందో చెక్ చేసుకుంటున్నాను. సమయం ప్రకారం సమావేశాలను ముగించేందుకు ప్రయత్నం చేస్తున్నాను. సమావేశాలను అర గంట సేపులో కంప్లీట్ చేసేందుకు చూస్తున్నాను. లేదంటే 45 నిముషాలకు పూర్తి చేస్తున్నాను. అప్పటికీ సమీక్ష పూర్తి కాకపోతే ఒక గంట తీసుకుంటున్నాను. అప్పటికీ ఒక కొలిక్కి రాకపోతే చర్చించాల్సిన అంశాలన్నింటని బ్రీఫ్‌గా డిస్‌కస్ చేస్తూ ఒకటిన్నర గంట లోపు ఎట్టి పరిస్థితుల్లో సమీక్షలు పూర్తి చేస్తున్నాను. ఒక వేళ ఆయా అంశాలపైన అధికారులు అవగాహన లేక పోతే ప్రిపేర్ అయి రావాలని సూచిస్తున్నాను. సమీక్షల కోసం గతంలో మాదిరిగా ఎక్కువ సమయం తీసుకోవడం లేదు, ఈ కలెక్టర్ల సమావేశాన్ని కూడా తక్కువ సమయంలోనే కంప్లీట్ చేద్దామని సీఎం చంద్రబాబు అనడంతో ఆయనతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు, అధికారులు ఒక్క సారిగా చిరు నవ్వులు చిందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత ఆగస్టు 5న అమరావతి సచివాలయంలో తొలి కలెక్టర్ల కాన్ఫెరెన్స్‌ను నిర్వహించారు.
ఇది వరకు సీఎం చంద్రబాబు వద్ద సమీక్షలు అంటే అధికారులు, సిబ్బంది హడిలి పోయేవారు. గంటల తరబడి రివ్యూలు నిర్వహించే వారు. కలెక్టర్ల కాన్ఫెరెన్సులు కూడా ఇదే రకంగా నిర్వహించే వారు. రాష్ట్ర విభజన అనంతరం 2014 నుంచి 2019 వరకు కూడా ఇదే వరుస కొనసాగింది. శాఖల వారీగా వరుస సమీక్షలు ఉండటంతో ఇచ్చిన సమయం కంటే చర్చలు మించి పోయేవి. దీనికి తోడు గంటల తరబడి వెయిటింగ్ చేయాల్సి వచ్చేది. తమ వంతు సమయం ఎప్పుడు వస్తుందో, తమను సీఎం ఎప్పుడు పిలుస్తారో అని గంటల తరబడి ఎదురు చూసేవారు. సీఎం వద్ద సమీక్షలు అంటే అధికారులు భయపడి పోయే వారు. సహజంగా ఏడాదికి ఒక సారి కానీ, ఆరు నెలలకు ఒక సారి కానీ సమీక్షలు నిర్వహిస్తారు. కానీ మూడో సారి సీఎం అయిన తర్వాత చంద్రబాబు నాయుడు వరుస సమీక్షలకు శ్రీకారం చుట్టారు. 2019 ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అయితే ప్రతి నెలకు, ప్రతి వారానికి సమీక్షలు నిర్వహించడం మొదలు పెట్టారు. అప్పట్లో అధికార వర్గాల్లో ఇది చర్చనీయాంశంగా కూడా మారింది. ప్రతి నెలకు, ప్రతి వారానికి సమీక్షలు నిర్వహించి టార్గెట్‌లు పెడితే, వాటిని అమలు చేసేందుకు, అంతర్గతంగా సమీక్షలు నిర్వహించేందుకు సమయం ఎక్కడ ఉంటుందని, పీపీటీలు తయారు చేసుకోవడానికే సమయం సరిపోతుందనే విమర్శలు అధికార వర్గాల్లో వినిపించాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ల కాన్ఫెరెన్స్‌లో సమీక్షలకు సమయం గురించి సీఎం చంద్రబాబు మాట్లాడటం, గతంలో మాదిరిగా కాకుండా తక్కువ సమయంలోనే రివ్యూలు పూర్తి చేస్తామని చెప్పడంతో అధికారులు ఒక్క సారిగా ఊపరి పీల్చుకున్నటై్టంది.