సీఎం గారు.. సీమకు కనీసం ‘ఆ బోర్డు’ అయినా ఇవ్వండి
ఏపీ సీఎం శాసనసభలో చెప్పినట్లుగా వెంటనే శ్రీబాగ్ ఒప్పందాన్ని గౌరవించి, సీమకు నదీ యాజమాన్య బోర్డును ఇవ్వాలని బొజ్జా దశరథరామిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
కృష్టానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని రాయలసీమలో ఏర్పాటు చేయాలని రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని లేఖ ద్వారా కోరారు. గురువారం నంద్యాల సమితి కార్యాలయంలో ఆయన మాట్లాడారు. శ్రీశైలం రిజర్వాయర్ ఉన్న కర్నూల్ లో ఈ బోర్డును ఏర్పాటు చేస్తే సీమకు ఉపయోగపడుతుందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో నూతన ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక శ్రీబాగ్ ఒడంబడికను గౌరవిస్తున్నామని సీఎం ప్రకటన చేశారని, అందుకు తామెంతో సంతోషించామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ కడప కేంద్రంగా జనవరి 17, 2020న పెద్ద ఎత్తున సంకల్ప దీక్ష చేపట్టామని, అలాగే పాలనా వికేంద్రీకరణ త్వరగా చేపట్టాలని కోరామన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రకటించిన విధంగా వికేంద్రీకరణ చేపట్టకపోగా, కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని కేంద్ర జలశక్తి శాఖకు సిఫార్సు చేయడం రాయలసీమ వాసులకే కాకుండా, యావత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు.
కృష్ణా నదికి ఏ మాత్రం సంబంధంలేని విశాఖపట్నంలో ఏర్పాటు చేసే నిర్ణయాన్ని పునః సమీక్ష చేసి, బోర్డు కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని ప్రజాసంఘాలతో కలిసి అనేక కార్యక్రమాలను నిర్వహించామని తెలిపారు. అందులో ముఖ్యమైన కార్యక్రమాలను ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖలో పొందుపరిచామన్నారు.
1. జనవరి 6, 2021 న కొల్లి నాగేశ్వరరావు అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో విజయవాడ కేంద్రంగా అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం
2. జనవరి 9, 2021 న రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో నంద్యాల కేంద్రంగా అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం
3. డిసెంబర్ 13, 2021 న రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో విజయవాడ కేంద్రంగా ధర్మదీక్ష
4. జనవరి 18, 2023 న రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో నంద్యాల కేంద్రంగా ధర్మదీక్ష
5. జనవరి 2023 లో కృష్ణా నది బోర్డు కార్యాలయం కర్నూలులో ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ అనేక మంది శాసన, శాసన మండలి, పార్లమెంట్ సభ్యులు వ్రాసిన ఉత్తరాలను రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో సేకరించి, రాష్ట్ర ప్రభుత్వానికి చేర్చినట్లు లేఖలో వివరించారు.
6. నవంబర్ 4, 2023 సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ కేంద్రంగా రౌండ్ టేబుల్ సమావేశం.
కృష్ణా నది యాజమాన్య బోర్డు అధికారులు ‘కృష్ణా నది బోర్డు కార్యాలయం’ విశాఖపట్నంలో ఏర్పాటు సరైనది కాదు అని పేర్కొన్న సందర్భంలోనైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని పునఃపరిశీలన చేయాలని కోరుకుంటున్నామని ఆయన డిమాండ్ చేశారు.
“శ్రీబాగ్ ఒడంబడికను” గౌరవిస్తూ, “ఆంధ్రప్రదేశ్ ప్రజల నిర్ణయాన్ని” పరిగణిస్తూ, “ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని నిరూపిస్తూ”, కృష్ణా నది నీటి నిర్వహణకు కీలకమైన కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయం “కర్నూలు”లో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని దశరథరామిరెడ్డి లేఖ ద్వారా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.