గ్రూప్1తో జగన్ రాజకీయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులతో చెలగాటమాడుతోంది. గ్రూప్1 నోటిఫికేషన్ ఇవ్వటంలో నిబంధనలు గాలికొదిలేసింది.
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పట్టిపీడిస్తుంటే మరోవైపు నిరుద్యోగులతో ఏపీపీఎస్సీ చెలగాటమాడుతోంది. ఏపీపీఎస్సీ రాజకీయ రంగు పులుముకుందా? అనే అనుమానాలు పలువురు నిరుద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రస్థాయిలో ఉన్నత ఉద్యోగ నియామకాలు ఏపీపీఎస్సీ గ్రూప్1 ద్వారా భర్తీ చేస్తున్నారు. గ్రూప్1 మూడు దశలలో పరీక్ష విధానం ఉంటుందని, ఇంటర్వ్యూలలో పారదర్శకత కొరవడిందని గతంలో జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించి అధికారంలోకి రాగానే ఈ పరీక్షలకు ఇంటర్వ్యూ లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. సీఎం కాగానే గ్రూప్స్‌కు ఇంటర్వ్యూలు లేకుండా ఆదేశాలు కూడా జారీ చేయించారు. ఆ తరువాత తిరిగి గ్రూప్1కు ఇంటర్వ్యూలు ఉంటాయని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గ్రూప్1 పరీక్ష విధానం సిలబస్ మొత్తం ఉన్నత సాంకేతిక విద్య అభ్యసించిన వారికి అనుకూలంగా ఉందని, గ్రామీణ ప్రాంత విద్యార్థులు, పేద మధ్య తరగతి వారు గ్రూప్1 సాధించలేకపోతున్నారని నిరుద్యోగులు వాపోతున్నారు.